కడప స్టీల్‌ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు 

దరఖాస్తు చేసిన రెండున్నర నెలల్లోనే అనుమతులు సాధించిన ప్రభుత్వం

అమరావతి: కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కీలక ముందడుగు పడింది. స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతి మంజూరు చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ, క్లైమేట్‌ ఛేంజ్‌ మంత్రిత్వశాఖనుంచి అనుమతి ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌ వచ్చింది. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు పర్యావరణ అనుమతి కోసం గతేడాది డిసెంబర్‌ 20న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దరఖాస్తు చేసిన రెండున్నర నెలల్లోనే అత్యంత వేగంగా పర్యావరణ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. 

వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లె, పెద్దనందులూరు వద్ద ఈ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. తొలి దశలో ఏడాదికి మూడు విలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటుకు వైయస్‌ జగన్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టుంది. ఈ పరిశ్రమకు అనుబంధంగా 84.7 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్టీల్‌ ప్లాంట్, విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు 3,591.65 ఎకరాల భూమి కేటాయించింది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలంటూ గత డిసెంబర్‌లో కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఆ శాఖ శాస్త్రవేత్తలు సూచించిన మేరకు ఈ ఏడాది జనవరి 23న మరోసారి సవరణలతో ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనకు ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ నివేదికను జత చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై డిసెంబర్‌ 30, 31న, ఈ ఏడాది ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ఈఏసీ సమావేశాలు నిర్వహించింది. సమగ్ర పరిశీలన తరువాత.. ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఇస్తున్నట్లుగా వెల్లడించింది. ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ నోటిఫికేషన్, 2006 ప్రకారం పర్యావరణ అనుమతి ఇస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ పరిశ్రమను ఏర్పాటు చేసే ప్రాంతంలో 33 శాతం అంటే 484.4 హెక్టార్లలో గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేస్తారు. ఐదేళ్లలో 12,10,000 మొక్కలు నాటుతారు. 

 

Back to Top