నెల్లూరు: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాన్ని కప్పి పుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ముందస్తు జాగ్రత్తల్లోనే కాకుండా, సహాయక చర్యల్లో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన స్పష్టం చేశారు. ఎంతసేపూ గత ప్రభుత్వాన్ని, జగన్‌ను నిందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, తమ పార్టీ నేతలను టార్గెట్ చేసి కేసులతో వేధించడం సీఎం చంద్రబాబు దినచర్యగా మారిందని దుయ్యబట్టారు. బుడమేరుకు సరిగ్గా 60 ఏళ్ళ క్రితమే వరద వచ్చి అప్పట్లోనే పది మంది మరణించిన విషయాన్ని ప్రస్తావించిన కాకాణి, ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. నెల్లూరు నగరంలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు.. మీది రియల్ టైం గవర్నెన్స్ అంటారు కదా?. మరి ఇవన్నీ ముందే ఎందుకు పసిగట్టలేదని కాకాణి ప్రశ్నించారు. కృష్ణానదిపై ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే ఫ్లడ్ కుషన్ ఎందుకు చేయలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని గట్టిగా నిలదీసిన ఆయన, ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి అలెర్ట్ ఇచ్చినా చంద్రబాబుకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేకపోవడం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. లక్షలాది జనాన్ని గాలికొదిలేసి, చంద్రబాబు మాత్రం తన అక్రమ కట్టడం నుంచి పారిపోయి కలెక్టరేట్‌ను పునరావాస కేంద్రంగా మార్చుకున్నారన్నారు. జనాన్ని మాత్రం తరలించలేదని, పైగా తన ఇల్లు మునిగిపోయిందంటే పరువు పోతుందని కలెక్టరేట్‌లో ఉంటూ కలరింగ్ ఇచ్చారని కాకాణి ఎద్దేవా చేశారు. వర్షాలు, వరదల వల్ల ఉద్యానపంటలు లక్షలాది ఎకరాలు నీట మునిగాయన్న కాకాణి, గతంలో తమ ప్రభుత్వంలో ఇలా జరిగితే, వెంటనే రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. చంద్రబాబు తక్షణమే రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజల దృష్టి మళ్లించడానికి చంద్రబాబు, డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారన్న ఆయన, ఎక్కడో బోట్లు కొట్టుకుపోతే దానికి వైఎస్‌ఆర్‌సీపీకు ముడి పెట్టడం కుట్రలో భాగమేనన్నారు. స్కిల్ స్కామ్‌లో పక్కా ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేస్తే, అది అక్రమ అరెస్ట్ అంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెట్టిందన్న మాజీ మంత్రి, అన్ని ఆధారాలు ఉండబట్టే, చంద్రబాబును జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారని చెప్పారు. చంద్రబాబుకు భజన చేసే మీడియా.. జాకీలు పెట్టి మరీ బాకాలు ఊదుతోందని, ఆయన ప్రాణాలు ఫణంగా పెట్టి వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారని అదేపనిగా ఊదరగొడుతున్నారని ఆక్షేపించారు. ఇప్పటికైనా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మాని, వరద ప్రాంతాల్లో పరిస్థితులను చక్కదిద్దాలని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు.