హామీల అమలును ఎగ్గొట్టేందుకు చంద్రబాబు యత్నం

గత ప్రభుత్వంపై సాకులు చూపుతూ తప్పుడు విమర్శలు

తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందకు అనుకూల వాదన

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్

చంద్రబాబుకు భజన చేయడమే ఎల్లో మీడియాకు తెలిసింది

వాస్తవాలను ధైర్యంగా అంగీకరించలేని స్థితిలో ఉన్న చంద్రబాబు

ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అంటూ కట్టుకథలు

చివరికి తన దావోస్ విఫల పర్యటనపైనా అబద్దపు కథలు

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం

గుంటూరు: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని సీఎం చంద్రబాబు స్వయంగా తన అసమర్థతన అంగీకరిస్తున్నారని మాజీ  మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, అందువల్లే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చంద్రబాబు ప్రకటించడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో విజనరీ, అనుభవం ఉన్న నేతగా తనను తాను గొప్పగా చిత్రీకరించుకునే చంద్రబాబు తాజాగా తన అబద్దాలతో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలు నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. 

నీతి అయోగ్ వెల్లడించిన లెక్కలను చూపుతూ తాజాగా సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను బట్టి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాను అని అంగీకరించారు. దానికి కారణం వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం హయాంలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని సాకులు చూపుతుండటం ఆయన అసమర్థతకు నిదర్శనం. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలంటే, తాను ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం అయ్యిందని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు అనేక వాగ్ధానాలు చేశారు. వాటిని అమలు చేస్తానని చెప్పారు. ఆనాడే వైయస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు హామీలు అమలు చేయలేనివి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు అనుగుణంగా లేదని చెప్పారు. అయినా కూడా నేను అన్నీ చేయగలను అని చంద్రబాబు ప్రజలను నమ్మించి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. 

రాష్ట్ర అప్పులపైనా అబద్దాలు

ఎన్నికల ప్రచారంలో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం  పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని విష ప్రచారం చేశారు. ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బడ్జెట్ సందర్భంగా మీరే అధికారికంగా వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు 6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారు. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన అప్పుల కన్నా యాబై శాతం తక్కువగానే గత ప్రభుత్వం అప్పులు చేసింది అని తెట్టతెల్లం అయ్యింది.   అంటే మీరు ఊహించిన దానికన్నా అప్పుల తక్కువగా ఉన్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ఎవరికైనా అర్థం అవుతుంది. ఈ వాస్తవాలను ఒకవైపు అంగీకరిస్తూనే, మరోవైపు ఎన్నికలకు ముందు మేం ఊహించిన దానికన్నా ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది, దానికి వైయస్ఆర్ సీపీ హయాంలో చేసిన అప్పులే కారణం అని ఎలా చెబుతారు? చంద్రబాబు తన మాటలను తానే ఖండించుకుంటున్నారు. ఇలా గత ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గు అనిపించడం లేదా? 

తన ప్రజంటేషన్ లోనూ తప్పుడు వాదనలు

తాజాగా చంద్రబాబు నీతి అయోగ్ లెక్కల గురించి ఇచ్చిన ప్రజంటేషన్ లో మాట్లాడుతూ 2022-23లో సీఎం వైయస్ జగన్ చేసిన పెట్టుబడి వ్యయం రూ.7,244 కోట్లు, అప్పులు రూ.67,985 కోట్లు అని చెప్పారు. ఇలా చేయడం అన్యాయం, అక్రమం అని చెప్పారు. 2024-25లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ ఏడు నెలల్లో చేసిన అప్పులు రూ.73,685 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.8,894 కోట్లు. వైయస్ జగన్ ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేసింది పోల్చుకుంటే ఎక్కడా పెద్ద తేడా కనిపించడం లేదు. మరి చంద్రబాబు దీనిని ఎలా సమర్థించుకుంటారు? చంద్రబాబు తన మీడియా సమావేశంలో ఇలా గతంలో జరిగిందంతా తప్పు, తాను చేస్తున్నవి మాత్రం అత్యుత్తమమైన ఒప్పు అని ఎటువంటి సిగ్గు లేకుండా చెబుతుంటే, ఈ మీడియా సమావేశంలో చంద్రబాబుకు భజన చేసే ఎల్లో మీడియా ప్రతినిధులు 'మీరు చాలా తక్కువగా చెబుతున్నారు, ఇంకా కొన్ని కలుపుకుంటే చాలా ఎక్కువ అప్పులు కనిపిస్తాయి' అంటూ చంద్రబాబు అబద్దాలకు తాళం వేస్తున్న పరిస్థితి చాలా దురదృష్టకరం. ఇటువంటి అబద్దాలను చెబుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగవేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం.

చంద్రబాబు అసమర్థత వల్లే పెట్టుబడులు రాలేదు 

ఇటీవల చంద్రబాబు దావోస్ పర్యటనకు తన కుమారుడు లోకేష్ తో పాటు పలువురు అధికారులతో తీసుకుని ఎంతో ఆర్భాటంగా పర్యటనకు వెళ్లారు. ఇంకేముందీ రాష్ట్రాన్ని పెట్టుబడుల వరద ముంచెత్తుతుందనే స్థాయిలో ఈ ప్రచారం జరిగింది. తీరా ఉత్తి చేతులతో చంద్రబాబు బృందం రాష్ట్రానికి తిరిగి వచ్చింది. ఒక్క ఎంఓయు లేదు, కోట్ల రూపాయల ప్రజాధనంను వ్యయం చేశారు. కనీసం దారి ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మాట్లాడుతూ దావోస్ లో ఎంఓయులు అనేవి ఒక మిథ్య అంటూ చాలా గొప్పగా సెలవిచ్చారు. దావోస్ వెళ్ళినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయనేది ఒక భ్రమ అని కొత్త అంశాన్ని వెల్లడించారు. అలాంటప్పుడు చంద్రబాబు, ఆయన బృందం ఎందుకు దావోస్ వెళ్ళారు. చంద్రబాబు ఆరోగ్యరీత్యా ఆయన కోటు వేసుకోలేని స్థితిలో ఉన్నారు. దానిని కూడా ఎల్లో మీడియా అంతగొప్ప చలిలో కూడా కోటు తొడుక్కోకుండా పెట్టుబడుల కోసం చంద్రబాబు ప్రయత్నించారంటూ దిగజారుడు రాతలు రాసింది. అనుకూలంగా ఉంటే ఒకరకంగా, వ్యతిరేకం అయితే మరోరకంగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. టక్కుటమార విద్యలకు చంద్రబాబు ప్రసిద్ది. ఆయన చెప్పే ప్రతి విషయాన్ని భక్తితో పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే ఎల్లో మీడియాకు తెలిసింది. 2014-19 హయాంలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ నిర్వహించారు. 328 ఒప్పందాల ద్వారా రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఆర్భాటంగా ప్రకటించారు. ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని డబ్బా కొట్టుకున్నారు. ఇందులో ఎన్ని ఒప్పందాలు ఆచరణలోకి వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంత మందికి ఉపాధి కల్పించారో చెప్పగలరా? సీఎంగా వైయస్ జగన్ గారు కూడా దావోస్ కు వెళ్ళి 1.26 లక్షల కోట్ల రూపాయల ఎంఓయులపై సంతకాలు చేశారు. టెక్ మహేంద్ర సీఈఓ గుర్నానీ రూ.200 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఆదానీ గ్రూప్ రూ.60 వేల కోట్లతో పెట్టుబడులతో వస్తే, భూములు కేటాయించి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే 37వేల కోట్ల పెట్టుబడులతో కర్నూలు జిల్లాలో గ్రీన్ కో కంపెనీ పనులు కూడా మా హయాంలోనే ప్రారంభమయ్యాయి. అరబిందో గ్రీన్ ఎనర్జీ 28వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో వచ్చింది. ఇవ్వన్నీ జగన్ గారి హాయంలో జరిగినవి. 

ఎల్లో మీడియా అండతో రెచ్చిపోతున్న చంద్రబాబు

ఒక పర్యాయం సీఎం వైయస్ జగన్ దావోస్ పర్యటనకు వెళ్ళలేకపోతే చంద్రబాబుకు భజన చేసే ఎల్లో మీడియా ఈనాడు పత్రిక 'ఓసోస్ దావోస్ మనకెందుకూ' 'పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళలేరా?'  అంటూ ఒక కథనాలను ప్రచురిస్తూ, సీఎం దావోస్ ఎందుకు వెళ్ళలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పొరుగు రాష్ట్రాల సీఎంలు దావోస్ కు వెళ్ళి పెట్టుబడులు తెచ్చుకుంటుంటే మీరు ఎందుకు స్పందించడం లేదు అంటూ తమ కథనాల్లో ప్రశ్నించారు. మరి నిత్యం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతూ స్వామిభక్తిని చాటుకునే ఇదే ఎల్లో మీడియాకు చెందిన ఈనాడు పత్రికకు ఉత్తి చేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు బృందం అసమర్థత కనిపించడం లేదా?  దావోస్ వెళ్లినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయా అంటూ చంద్రబాబు  ప్రశ్నిస్తే సమంజసమే అన్నట్లుగా అనుకూల కథనాలను రాయడానికి ఏమాత్రం వెనకాడలేదు. అంటే వైయస్ జగన్ గారు దావోస్ వెళ్ళకపోతే పెట్టుబడులు అక్కరలేదా అని ప్రశ్నిస్తారు, అదే చంద్రబాబు తన అసమర్థత వల్ల పెట్టుబడులు తీసుకు రాలేకపోతే మరే ఫరవాలేదు అంటూ చంద్రబాబును సమర్థిస్తారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల సీఎంలు లక్షల కోట్లు పెట్టుబడులతో తమ రాష్ట్రాలకు వచ్చారు, చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఎంఓయు కుదుర్చుకోకుండా వచ్చారు. ఇది ఎల్లోమీడియాకు కనిపించదు. ఇదీ ఎల్లో మీడియా, దానిని నిర్ధేశిస్తున్న చంద్రబాబు నిజస్వరూపం. నరంలేని నాలుకను ఎటువైపు అయినా తప్పి మాట్లాడటంలో ఎంతో ఘనుడు. ఈ విషయంలో చంద్రబాబు, ఆయనకు ప్రచారం చేసే ఎల్లో మీడియాను మించిన వారు లేరు. 

పగిలిన గ్లాస్ కథను ప్రచారంలోకి తెచ్చారు

దావోస్ లో చంద్రబాబు ఎంత బాధ్యతతో వ్యవహరించారో ఆయనతో పాటు పర్యటనలో పాల్గొన్న ఒక అధికారి ఎల్లో మీడియాకు చెందిన ఒక చానెల్ కు తెలిపిన కథనాన్ని చాలా గొప్పగా ప్రసారం చేశారు. ఈ కథనంలో దావోస్ లో మైనస్ 12 డిగ్రీల చలిలో చంద్రబాబు బృందం నిద్రిస్తున్న గదుల్లో గ్లాస్ పగిలి, గడ్డకట్టించే చలిలో రాత్రంతా నిద్రలేకుండా గడిపారని, తెల్లవారుజామున వారు కొద్దిసేపు నిద్రించి ఆలస్యంగా లేచారట. సదరు అధికారులు తెల్లవారిన తరువాత లేచి చూస్తే చంద్రబాబు గదిలో లేరని, ఆయన గదిలో కూడా గ్లాస్ పగిలినా, గడ్డకట్టే చలిలో రాత్రంతా వణికిపోతూ నిద్ర లేకుండా గడిపి, ఉదయానే అలసటను కూడా పట్టించుకోకుండా దావోస్ లోని మీటింగ్ హాల్ కు వెళ్ళిపోయారట. అంతేకాదు మిగిలిన రాష్ట్రాల వారు ఇంకా తమ స్టాల్స్ ను ప్రారంభించక ముందే అందరికంటే ముందుగా చంద్రబాబు ఏపీ స్టాల్ కు వెళ్ళి,  దానిని ప్రారంభించి, అప్పటికే అక్కడకు వచ్చిన కొందరు విదేశీ పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతూ కనిపించారట. అక్కడ ఉన్న విదేశీ పారిశ్రామికవేత్తలు కోట్లు, రగ్గులు కప్పుకుని ఉంటే, చంద్రబాబు మాత్రం తాను రోజూ ధరించే అదే ఖద్దరు దుస్తులతో వారితో మాట్లాడుతూ కనిపించారట. అది చూసి అధికారులు సిగ్గుతో చంద్రబాబు వద్దకు వచ్చి ఇంత చలిలో మీరు ఎందుకు అందరికంటే తొందరగా వచ్చారని వారిలోని ఒక అధికారి ప్రశ్నిస్తే, మనం ప్రభుత్వ సొమ్ముతో, వారు చెల్లించిన పన్నులతో విమానాల్లో ఇక్కడకు వచ్చాం, అందరికంటే ముందుగా ఇక్కడకు వస్తే కనీసం ముందుగా వచ్చే పారిశ్రామికవేత్తలతో మాట్లాడవచ్చు, వారిలో ఒకరిద్దరు అయినా పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే బాధ్యతతో ఇక్కడకు వచ్చాను అని అన్నారట. అది విన్న సదరు అధికారి కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయని అత్యంత అద్భుతమైన ఒక కథను ప్రచారం చేశారు. ఈ మొత్తం కథను 2023 నవంబర్ 13వ తేదీన టీవీ5 అనే ఛానెలో లో ప్రజంటేటర్ మూర్తికి, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మధ్య జరిగిన సంభాషణ. ఇదే స్టోరీని అదే ఛానెల్ లో అదే ప్రజంటేటర్ మూర్తి 20.1.2025న తాజాగా జరిగినట్లు చెప్పడం చూస్తే వీరు ఎంతగా దిగజారిపోయారనేది ప్రజలకు అర్థమవుతుంది. ఈ కథనంను ప్రచురించి ఎల్లో మీడియా చానెల్ టీవీ5 మరెవరిదో కాదు ఇటీవలే చంద్రబాబు ఆశీస్సులతో టీటీడీ చైర్మన్ గా పదవిని దక్కించుకున్న బీఆర్ నాయుడిది. తనకు పదవి ఇచ్చినందుకు గానూ కృతజ్ఞతతో తన చానెల్ లో గత ఏడాది నవంబర్ లో సినీ నిర్మాత బండ్ల గణేష్ చెప్పిన కథను తాజాగా ఇప్పుడే జరిగింది అని చెప్పి, దానిని ప్రచారంలోకి తీసుకురావడం చూస్తే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? 2023న పగిలిన గ్లాసు కథను టీవీ5 మూర్తి 2025లో జరిగినట్లు చెప్పడం ఎంత దారుణం. 

చంద్రబాబు కుమారుడిగానే లోకేష్ కు గౌరవం

వైయస్ఆర్ సీపీ హయాంలో మేం చేసుకున్న ఒప్పందాల్లో భాగంగానే ప్రాజెక్ట్ లను ఇప్పుడు ప్రారంభిస్తున్నారి మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్న మాటలను మీడియా నారా లోకేష్ వద్ద ప్రస్తావిస్తే అమర్ నాథ్ గురించి 'ఆ.. కోడిగుడ్డాయనా' అని ఎద్దేవా చేశాడు. లోకేష్ పెద్ద పప్పుసుద్ద కాదా? చంద్రబాబును చూసి ఆయనను గౌరవిస్తున్నారు. గుడివాడ అమర్ నాథ్ ఒక మాజీ మంత్రి కుమారుడు. ఆయన చనిపోయిన తరువాత కూడా అమర్ నాథ్ ప్రజల నుంచి గౌరవం పొందుతున్నాడు. కేవలం చంద్రబాబు సీఎంగా ఉండటం వల్లే లోకేష్ కు గౌరవం. ఇది నిజంగా లోకేష్ కు ఉన్న గౌరవం కాదు. లోకేష్ ఎర్ర బుక్కుకు నా కుక్క కూడా భయపడదు. ఎంతమందిని జైలులో అక్రమ కేసులతో జైలుకు పంపినా వైయస్ఆర్సీపీ వెనుకంజ వేయదు. 

రిపబ్లిక్ డే ప్రసంగంలోనూ డొల్లతనం

వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ప్రసంగం ద్వారా 1.03 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు, 2.7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం. రూ.3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, అమ్మ ఒడి ద్వారా లక్షలాధి మంది తల్లులకు అండగా నిలుస్తామని ఇలా పలు కార్యక్రమాల గురించి చెప్పాం. వాటిని తరువాత అదే తరహాలో ఆచరణలో కూడా చూపాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం తమ తొలి రిపబ్లిక్ డే నాడు ప్రసంగంలో ఒక్క కార్యాచరణపైన కూడా నిర్ధిష్టమైన విషయాలను చెప్పలేకపోయింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఇంకా గత ప్రభుత్వంపైనా, వైయస్ జగన్ గారిపైనా విమర్శలు చేయడంతోనే కాలం గడుపుతోంది. ఆంధ్రా బ్రాండ్ ను దావోస్ కు వెళ్లి పెంచామని సిగ్గులేకుండా చెబుతున్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి, లేనిపక్షంలో వైయస్ఆర్ సీపీ నుంచి మిమ్మల్ని నిలదీస్తాం. సూపర్ సిక్స్ హామీల అమలు ఏదీ? తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు అమలు విస్మరించలేదా? తమ అసమర్థతను దాచుకుంటూ జగన్ గారి వల్ల అమలు చేయలేకపతున్నామని చెప్పడానికి తెగబడుతున్నారు. 

మీడియా ప్రశ్నలకు సమాధానం చెబుతూ...
లోకేష్ రెడ్ బుక్ చూసి పారిపోలేదు, రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అని విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. విజయసాయిరెడ్డిని అప్రూవర్ గా మారమని చాలా వత్తిడి తెచ్చారని ఆయనే చెప్పారు. ఇలా వత్తిడి తెచ్చిన వారు ఎవరో ఆయనే చెప్పాలి. వైయ‌స్ జగన్ గారి మీద పెట్టిన ఏ కేసులోనూ ఆధారాలు లేవు, రాజకీయ కక్షతోనే ఆయనను జైలుకు పంపారు. లోకేష్ వేధింపులపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఎర్ర పుస్తకంలో పిచ్చిరాతలు రాసుకుని, అందరి మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్న దానికి ప్రతిఫలం లోకేష్ అనుభవించక తప్పదు. వైజాగ్ లో జగన్ గారి హయాలో నిర్మించిన అద్భుతమైన నిర్మాణాలను ఏం చేసుకోవాలో తెలియని అయోమయంలో లోకేష్ ఉన్నారు. వైయ‌స్ జగన్ గారిని మించిన ప్రజాధరణ కలిగిన నాయకుడు ఈ రాష్ట్రంలో మరొకరు లేరు. రాజకీయపార్టీలు ఓటమి పాలైన తరువాత నాయకులు బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇది కేవలం వైయస్ఆర్ సీపీకే పరిమితం కాదు. గతంలో చాలా మంది టీడీపీ నుంచి బయటకు వెళ్లారు. అంతమాత్రాన టీడీపీ అధికారంలోకి రాకుండా మిగిలిపోయింది. పార్టీ నుంచి వెళ్ళడం అనేది వెళ్ళినవారి నైతికతకు సంబంధించిన విషయం. కష్టాలను తట్టుకునే శక్తి, నష్టాలను పూడ్చుకునే శక్తి కూడా వైయస్ఆర్ సీపీకి ఉంది. మళ్లీ అధికారంలోకి వచ్చేలా ప్రజలను మెప్పిస్తాం.

Back to Top