విజయవాడ: చంద్రబాబు పాపం పండింది.. అవినీతి బట్టబయలైందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అమరావతిలో రాజధాని కడతానని, ప్రతి ఇటుకకు డబ్బులివ్వండి అని, మనల్ని అందర్నీ తాకకట్టు పెట్టి బాండ్స్ ఇష్యూ చేసి తెచ్చిన డబ్బులు ఆయా కంపెనీలకు ఇచ్చారు. ఆ కంపెనీల ద్వారా నిధులు డొల్ల కంపెనీలకు మళ్లించారని ఇన్ కం ట్యాక్స్ శాఖ నోటీసులు చూస్తే మొత్తం రూ.160 కోట్ల రూపాయలు కొట్టేశారని తేలిందన్నారు. చంద్రబాబు ఇన్ కం టాక్స్ నోటీసులపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిలో ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములు చేతులు మార్చే క్రమంలో పెద్ద స్కామ్ జరిగిందని గతంలోనే సీఐడీ తేల్చింది. -అమరావతి పేరుతో జరిగిన స్కామ్ లన్నిటిలో డొల్ల కంపెనీలు పెట్టి, వాటి ద్వారా తండ్రీ కొడుకులు ముడుపులు పుచ్చుకున్న విషయాలు ఇప్పటికే సీఐడీ విచారణలో చూశాం. డొల్ల కంపెనీలతో డబ్బును జేబులో వేసుకోవడం, హవాలా ద్వారా తండ్రీకొడుకులకు చేరవేయడంలో ఈ మధ్య కూడా మరొక స్కామ్ బయటకు వచ్చింది. - లోకేశ్ మిత్రుడు రాజేశ్ అనే వ్యక్తికి, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా అమరావతి పేరుతో జనం సొమ్మును కొట్టేశారు. -ఆ రూటింగ్ అంతా చూస్తే ఇప్పటికే సీఐడీ విచారణలో తేలిన స్కిల్ స్కాం, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం, కాంట్రాక్ట్ పనుల్లో స్కాములు, ఫైబర్ నెట్ స్కాంలలోనూ ఇదే వ్యక్తుల ద్వారా ఇదే విధమైన రూటింగ్ జరిగింది. -ఎంవీపీ, పీఏ శ్రీనివాస్, రాజేష్ వంటి వ్యక్తులు పాత స్కామ్ లలోనూ ఉన్నారు. - 2014 నుంచి 2019 వరకూ రకరకాల స్కీమ్ ల పేరుతో స్కామ్ లు చేసి వేల కోట్లు దోచుకుని హైదరాబాద్ లో దాచుకున్నారు. -ఇవన్నీ ప్రస్తుతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సీఐడీ పట్టుకున్న స్కామ్ లలో కానీ, నేడు ఇన్ కం ట్యాక్స్ శాఖ పట్టుకున్న స్కామ్ లో కానీ మూలాలు అన్నీ చంద్రబాబు, ఆయన కొడుకు దగ్గరే ఉన్నాయి. - దొంగలకు నోటీసులిస్తే కూడా వేధించడమేనా..? ప్రజా ధనాన్ని దోచేసిన తండ్రీ కొడుకులను వలేసి భలే పట్టుకున్నారని ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు. -ఈ తండ్రీ కొడుకులిద్దరు ఏమేమి పాపాలు చేశారని మేం గత నాలుగేళ్లుగా చెప్తున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా ఆధారాలతో దొరుకుతున్నాయి. -ఖచ్చితంగా చంద్రబాబు పాపం పండే రోజు వచ్చింది...ఆయన అవినీతి బట్టబయలయింది. వాటికి చంద్రబాబు అనుభవించే రోజు వస్తుంది.