అధికారంలో ఉన్నపుడు  ఆధారాలతో విమర్శలు చేస్తే మంచిది..  

మీడియా స‌మావేశంలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి

45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజల మన్ననలు పొందినది పెద్దిరెడ్డి  కుటుంబం.  

నిన్న జరిగిన ఎన్నికల్లోనూ ఎంపి, రెండు ఎమ్మెల్యే స్థానాలలో ఆ కుటుంబ సభ్యులను ప్రజలు గెలిపించుకున్నారు.   

డిప్యూటీ సీఎంకు సినిమా సంఘటనను గుర్తు చేసుకుని విమర్శలు చేయడం మంచిది  కాదు..  

అధికారంలో ఉన్న మీరు ఎర్రచందనంపై విచారించి ఆధారాలతో నిరూపిస్తే ఎంపి మిథున్ రెడ్డితో పాటు తాను కూడా 
రాజకీయాల నుంచి వైదొలుగుతా.  

ఎర్రచందనం అక్రమ రవాణా దారులను ఆధారాలతో పట్టుకొని ఉరి తీసేలా చట్టం తేవాలి.  

ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. 

ఎంపి మిథున్ రెడ్డి పై డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి 

అన్న‌మ‌య్య జిల్లా: అధికారంలో ఉన్నప్పుడు  ఆధారాలతో విమర్శలు చేస్తే అందరికీ మంచిదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అన్నమయ్య జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబంపై ఆధారాలు చూపకుండా ఎర్రచందనం అక్రమ రవాణాలో పాత్ర ఉందంటూ అసత్యపు ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ మధ్య వచ్చిన ఒక సినిమా సంఘటనను ఇతివృత్తంగా చేసుకొని అక్రమ ఎర్రచందనం రవాణాలో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ల పాత్ర ఉందంటూ చేసిన విమర్శలు అర్థరహితమన్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు మీ దగ్గరకు వచ్చిన ఎర్రచందనం ఫైల్ పైన విచారించి ఆధారాలను బయట పెట్టాలన్నారు.

 పవన్ కళ్యాణ్ చేగువేర లాంటి పెద్దలను ఆదర్శంగా చేసుకొని రాజకీయంగా తప్పులను ప్రశ్నిస్తానంటూ 2014లో రాజకీయ ప్రవేశం చేశారన్నారు. తొలినాళ్లలో టిడిపి, బిజెపిలను ప్రశ్నించారన్నారు. 2019లో పోటీ చేసి ఓటమి చెందారన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కూటమితో జతకట్టి అధికార పార్టీపై విమర్శలు చేశారన్నారు. కూటమితో కలిసి అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ చేగువేరా భావజాలాలతో ఉంటారని ప్రజలు ఆశించారు. సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల పైన రాజకీయంగా సమీక్షలు చేసుకొని ముందుకు సాగుతారని అందరూ కోరుకొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం హోదాలో ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో నిజానిజాలను  పరిగణలోకి తీసుకోకుండా రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబంపై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. 

45 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా రాజకీయాలలో  ప్రజాదారణ కలిగిన కుటుంబంగా నిలిచిందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ల పాత్ర ఏమాత్రం ఉన్న ఆధారాలతో బయటపెట్టాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు. డిప్యూటీ సీఎం హోదాలో అక్రమ ఎర్రచందనం రవాణాలో ఎంపీ, మాజీ మంత్రి  పాత్ర ఉందన్న ఫైల్ తన వద్ద ఉందంటూ ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు.  చిత్తూరు జిల్లాలో రాజకీయంగా 45 ఏళ్లుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అజాతశత్రువుగా పేరొందారన్నారు.

 ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈ ఎన్నికలలో కూడా పార్లమెంటు సభ్యుడిగా మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, ద్వారకనాథ్ రెడ్డిల గెలుపు సాధ్యమైందన్నారు.  తిరుపతి సమీపంలో సొంత నిధులతో వకులమాత గుడిని నిర్మించారని, అలాగే అయ్యప్ప స్వామి ఆలయం తర్వాత అంత పవిత్రత కలిగిన ఆలయాన్ని సొంత మండలంలో సొంత డబ్బులతో నిర్మించారు. ఇలా ఎన్నో ఈద్గాలు,  ఆలయాల నిర్మాణాలను సొంత డబ్బులను ఖర్చు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి దైవ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆయా ప్రాంతాల ప్రజలకు దగ్గర అయ్యారని చెప్పారు. ఆరు రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా పెద్దిరెడ్డి కుటుంబానికి వ్యాపార సంబంధాలు ఉన్నాయన్న  విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ప్రాంతాల అభివృద్ధి, జవాబుతారి తనం, తప్పు చేస్తే ఎవ్వరినైనా ప్రశ్నిస్టానని రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా బురదజల్లే ఆరోపణలు చేయడం మంచిది  కాదన్నారు. 

వ్యక్తిగత విమర్శలు చేస్తే పెద్ద నాయకులమన్న భావన నుంచి కూడా కొంతమంది నాయకులు బయటకు రావాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షాన బాధ్యతాయుతంగా  వ్యవహరించడం మా బాధ్యత అన్నారు. అటవీ శాఖ మంత్రిగా ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో తప్పు లేదన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఎంతటి వ్యక్తులు ఉన్నా వదల వద్దని ఇందుకోసం ప్రత్యేక చట్టం తెచ్చి తప్పు చేసిన వారిని ఉరీ తియ్యాలని శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో ఎంపీ మిథున్ రెడ్డి, తాను అనేక  పర్యాయాలు టాస్క్ఫోర్స్ అధికారులతో సమీక్షించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేశామన్నారు. 

ఇప్పుడు కూడా అటవీశాఖ మంత్రి హోదాలో నిజాయితీ కలిగిన అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసి అత్యంత విలువైన సంపదను తరలిపోకుండా చూడాలన్నదే నా ఆలోచన అన్నారు. అలాగే ఎంపీ మిథున్ రెడ్డి పైన కూడా ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని ఎంపి చేసిన సవాల్ ను డిప్యూటీ సీఎం హుందాగా స్వీకరించాలన్నారు. అలాగే అనేక చెక్ పోస్టులను దాటి నేపాల్ కు ఎలా చేరిందన్న విషయాలపై డిప్యూటీ సిఎం విచారణలో తెల్చాలన్నారు. మన దేశంలోని అనేక రాష్ట్రాలలోని చెక్ పోస్టులను దాటుకుంటూ ఎప్పుడు  చేరిందన్న  వాస్తవాలను భయట పెట్టాలన్నారు.

మిథున్ రెడ్డి ప్రాథినిత్యం వహిస్తున్న పార్లమెంట్  పరిధిలో తాను కూడా ఉన్నానని నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తున్న మిథున్ రెడ్డి పైన ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరోపణలు రుజువు చేస్తే తాను కూడా రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. లేని పక్షంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిథున్ రెడ్డి తరఫున రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. 
 

Back to Top