అమరావతి : వికేంద్రీకరణ, 13 జిల్లాల అభివృద్ధిపై టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో రాజధాని అవసరం లేదని చెప్పే ధైర్యం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి ఉందా అని ప్రశ్నించారు. వెనుకబడిన కర్నూలులో హైకోర్టు అవసరంలేదని బహిరంగంగా చెప్పగలరా అని నిలదీశారు. మంగళవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శాసనమండలి రద్దుకు టీడీపీ వ్యతిరేకమైతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న దిశ చట్టంను దేశ వ్యాప్తంగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. అసత్యాలు ప్రచారాలు చేస్తూ.. ప్రజలను పక్కదారి పట్టించడంతో చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ఆయనలా దిగజారి మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డొస్తోంది. ఐదేళ్ల పదవీ కాలంలో కనీసం దుర్గగుడి ఫ్లై ఓవర్ కూడా పూర్తి చేయలేని చంద్రబాబు రాజధానిని ఎలా నిర్మించగలరు?. ప్రభుత్వ నిర్ణయంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు దావోస్‌కు ఎందుకు వెళ్లారో చెప్పాలి. స్విస్ బ్యాంక్‌లో దాచుకున్న అక్రమ సొమ్ము కోసమే వెళ్లారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు చరిత్ర ఎలాంటిదో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు రాసిన పుస్తకం చూస్తే తెలుస్తుందని ఈ సందర్భంగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు.