వంద రోజుల పాలన నుంచి బయటపడేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ 

తిరుమల లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు

బాబూ.. భక్తుల మనోభావాలతో ఆడుకుంటావా?

లడ్డూ వివాదం విషయంలో నిష్పక్షపాత విచారణ జరగాలి

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి

నెల్లూరు: ఏపీలో దుర్మార్గమైన వంద రోజుల పాలన నుంచి బయటపడేందుకు చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

మాజీ మంత్రి కాకాణి సోమవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమల లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీవారి ప్రతిష్టను దిగజార్చవద్దు. సీఐడీతో కాకుండా సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలి. రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు వైఎస్‌ జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుర్మార్గమైన వంద రోజుల పాలన నుంచి బయటపడేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. పవిత్రమైన తిరుమలను రాజకీయాలకు వాడుకుంటున్నాడు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వ్యవహరించాలి. తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని విష ప్రచారం చేయడం సరైన పద్దతి కాదు. చంద్రబాబు ప్రస్టేషన్‌తో మాట్లాడుతున్నాడు.

తిరుమల లడ్డూపై విచారణ జరపాలని ప్రధాని మోదీకి వైయ‌స్‌ జగన్‌ లేఖ రాశారు. లడ్డూ వివాదం విషయంలో నిష్పక్షపాత విచారణ జరగాలి. ఈవో శ్యామలరావుని కీలు బొమ్మలా మార్చి చంద్రబాబు ఆడిస్తున్నాడు. బాబు పలుకులే శ్యామలరావు పలుకుతున్నారు. శ్యామలరావు అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. భక్తుల మనోభావాలు కాపాడాలి. చంద్రబాబు ప్రభుత్వంలో సిట్ వేస్తే విచారణ నిగ్గు తేలదు. జంతువుల కొవ్వు అని చంద్రబాబు అన్నారు. వెజిటబుల్ ఫ్యాట్ అని ఈవో అంటున్నారు. నెయ్యి సరఫరాకి సంబంధించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి.

సీఎంగా చంద్రబాబు 2015లో ఉన్నప్పుడే నెయ్యిపై ఆరోపణలు వచ్చాయి. కల్తీ నెయ్యి జరిగిందని పదే పదే చెబుతున్నారు.. అది నిరూపించగలరా?. జూన్‌లో ఎవరి ప్రభుత్వం ఉంది?. ఒకవేళ ఆ నెయ్యిని జూన్, జూలైలో వాడి ఉంటే తప్పు ఎవరిది?. భక్తుల మనోభావాలతో ఆడుకుంది చంద్రబాబు కాదా?. కుట్ర పూరితంగా లడ్డు వివాదం చేస్తున్నారు.

వెంకటేశ్వర స్వామి గురించి తప్పుగా మాట్లాడాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడా?. మా ప్రభుత్వ హయాంలో టెండర్లు నిబంధనల మేరకే జరిగాయి. ఐదేళ్లు డెయిరీ ఫామ్‌కి అనుభవం, ఏడాదికి 500 కోట్లు టర్నోవర్ ఉంటేనే కాంట్రాక్టు ఇస్తామని మేము చెప్పాం. చంద్రబాబు హయాంలో నందిని నెయ్యి రూ.306కి కొనుగోలు చేశారు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Back to Top