అదే దుర్మార్గం.. 

ఆగని తప్పుడు కేసులు, వేధింపులు.. అరెస్టులు 

మరో కేసు మోపి.. ఇంటూరి రవికిరణ్‌ మళ్లీ అరెస్ట్‌

సజ్జల భార్గవ్‌రెడ్డి, మరో ఇద్దరిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు 

రెండేళ్ల క్రితం కార్టూన్‌ ఫార్వర్డ్‌ చేశారని భీమవరంలో మురళీ కృష్ణ అరెస్ట్‌.. తెలంగాణకు చెందిన బద్దం అశోక్‌రెడ్డిపై మంగళగిరిలో కేసు, అరెస్ట్‌ 

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఒక్క రోజే 13 కేసులు నమోదు 

సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై కక్షగట్టిన సర్కారు 

ప్రశ్నించిన వారందరినీ పోలీస్‌స్టేషన్‌లకు లాక్కెళ్తున్న వైనం 

పలుచోట్ల కుటుంబ సభ్యులకు ఆచూకీ చెప్పని పోలీసులు  

ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఫిర్యాదులు 

మరో ఆలోచన లేకుండా కేసులు కడుతున్న ఖాకీలు 

అమ‌రావ‌తి: ప్రభుత్వ వైఫల్యాలపై, మోసాలపై, ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం మరోమారు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని అడిగినందుకు, ప్రభుత్వం ఇచ్చే సరుకుల్లో తూకం తేడా ఉందన్నందుకు, పింఛన్లు తెచ్చుకోవడానికి వెళ్లిన వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారని చెప్పినందుకు.. తుదకు కార్టూన్‌ను ఫార్వర్డ్‌ చేసినందుకు.. ఇలా చిన్న చిన్న విషయాలను సాకుగా చూపి తప్పుడు కేసులు పెడుతోంది. 

చెప్పాపెట్టకుండా ఇళ్లకు వచ్చి పోలీ­సులు ఎత్తుకెళ్లిపోతున్నారు. పలువురు బాధితులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుండటంతో వారి అరెస్టులు చూపక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఇంటూరి రవికిరణ్‌పై పోలీసులు మరో నింద మోపి తాజాగా ఇంకో కేసు నమోదు చేశారు. పులివెందులలో సజ్జల భార్గవ్‌రెడ్డి, మరో ఇద్దరిపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఆదివారం రోజే 13 కేసులు నమోదు చేశారంటే ప్రభు­త్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో ఇట్టే తెలుస్తోంది.   |

ఇంటూరిపై 15కు చేరిన కేసులు  
మధురవాడ ధర్మపురి కాలనీకి చెందిన ఇంటూరి రవికిరణ్‌ పొలిటికల్‌ పంచ్‌ వెబ్‌ చానెల్‌ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ట్విట్టర్‌ (ఎక్స్‌), ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ పోలీసులు కేసుల పేరుతో మానసికంగా వేధించారు. 

ఇప్పటికే ఆయనపై దువ్వాడ, గుంటూరు, విజయవాడ, మార్టూర్‌ పోలీస్‌స్టేషన్లలో ఒక్కో కేసు.. గుడివాడ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేస్తూ 41ఏ నోటీసులు జారీ చేశారు. రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్‌లోనూ పలు కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఇతనిపై దాదాపు 15 కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న రవికిరణ్‌ను దువ్వాడ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ పేరుతో రాత్రి 9 గంటలకు వరకు వేధించారు. 

చివరికి 41ఏ నోటీసులు అందించి ఈ నెల 11న మెజి్రస్టేట్‌ ముందు హాజరు కావాలని ఆదేశించి విడిచిపెట్టారు. ఈలోగా రవికిరణ్‌పై మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశారని తెలుసుకుని మళ్లీ అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఆదివారం ఉదయం మళ్లీ మహరాణిపేట పోలీసులు విచారణకు తీసుకొచ్చారు.  అనంతరం రాజమండ్రిలోని ప్రకాష్ నగర్‌ పోలీసులు  వచ్చి, రవికిరణ్‌ను తీసుకెళ్లిపోయారు. కుటుంబ సభ్యులెవరికీ సమాచారం ఇవ్వలేదు.   

పీటీ వారెంట్‌పై మార్టూరుకు వెంకటేష్‌  
గాజువాక మండలం గొల్ల జగ్గరాజుపేటకు చెందిన బోడి వెంకటేష్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సీఎం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేశ్‌పై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఈ నెల 3న బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 5న బాపట్ల పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. 6న దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌లో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరోసారి వెంకటేష్ని తీసుకెళ్లారు. 

7న మరోసారి విచారణకు పిలిపించి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. వెంకటేష్పై 9న మహరాణిపేట స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. బెయిల్‌పై వచ్చిన వెంకటేష్ని మరోసారి విచారణ పేరుతో మహరాణిపేట పోలీసులు తీసుకెళ్లారు. స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి పంపించే సమయానికి బాపట్ల జిల్లా మార్టూరుకి చెందిన పోలీసులు వచ్చి.. పీటీ వారెంట్‌పై ఆదివారం వెంకటేష్ను మార్టూరుకు తరలించి కోర్టులో హాజరు పరిచారు. వెంకటేష్కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. 
  
అన్ని చోట్లా అదే తీరు 
» సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని చెబుతూ పులివెందుల పట్టణ, అర్బన్‌ పోలీస్‌ స్టేషన్లలో వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్‌ రెడ్డి, సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డిలపై కేసు నమోదైంది. మరికొంత మందిపై కూడా కేసులు పెడుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సీఐ జీవన్‌ గంగనాథ్‌ బాబును వివరణ కోరగా.. ఇది ఎస్సీ, ఎస్టీ కేసు అని, ప్రస్తుతానికి ముగ్గురిపై కేసు నమోదు చేశామని చెప్పారు.  
»   ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ పెసల శివారెడ్డిపై ఈ నెల 8వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నెల 13వ తేదీ విచారణ నిమిత్తం స్టేషన్‌కు రావాల్సిందిగా ఆదివారం కంకిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీన కూడా ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.   
»   గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ మేకా వెంకటరామిరెడ్డి సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌ కళ్యాణ్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారనే నెపంతో నెల్లూరు 35వ డివిజన్‌ జనసేన పార్టీ ఇన్‌చార్జి అశోక్‌ ఆదివారందర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 
»    కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇటీవల కడప కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశంలో చిందులు తొక్కడంపై ట్విట్టర్, ఇన్‌స్టాలో పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.   
»    తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌ జిల్లా మొండోరాకు చెందిన బద్దం అశోక్‌రెడ్డి ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంగళగిరి టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి కోర్టులో హజరు పరిచారు. 14 రోజుల రిమాండ్‌ విధించారు.
 

ఎక్కడెక్కడి నుంచో ఫిర్యాదులు  
»    అద్దంకిలో కల్లం హరికృష్ణ రెడ్డి, హరీశ్వర్‌రెడ్డిలు సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టారని టీడీపీ కార్యకర్త యర్రాకుల రామాంజనేయులు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు డి.చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  
»  మేదరమెట్లకు చెందిన టీడీపీ కార్యకర్త గోలి అజయ్‌ ఫిర్యాదు మేరకు కడపకు చెందిన కె.హనుమంతారెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. 
»  సంతమాగులూరు మండలం మిన్నేకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వసంత వేణు ఫిర్యాదుపై గురజాలకు చెందిన పి.వెంకటరామిరెడ్డిపై కేసు నమోదైంది.  
»  ఎన్‌.బాలాజీరెడ్డి అనే వ్యక్తి  ప్రభుత్వాన్ని తప్పు పడుతూ పోస్టులు పెట్టాడని రేపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు బొర్రా సూర్యరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. చెరుకుపల్లిలో తిరుమల కృష్ణ అనే వ్యక్తిపై కూడా  రాం»ొట్లవారిపాలెం గ్రామానికి చెందిన అలుమోలు దుర్గారెడ్డి ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు.  

రెండేళ్ల క్రితం కార్టూన్‌ ఫార్వర్డ్‌ చేశారని..
వన్‌కళ్యాణ్, చంద్రబాబులపై వచ్చిన పోస్టింగ్‌ని తన వాట్సా‹ప్‌ నుంచి ఇతరుల ఫోన్లకు పంపించాడనే నెపంతో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఘంటా మురళీకృష్ణపై తాడేపల్లిగూడేనికి చెందిన జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి ఈ నెల 6వ తేదీన స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై భీమవరం పోలీసులు ఈ నెల 6వ తేదీన మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి తాడేపల్లిగూడెం పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు.

తీరా ఈ నెల 10వ తేదీ ఆదివారం అయినప్పటికీ తాడేపల్లిగూడెంలోని న్యాయమూర్తి ఇంటి వద్ద మురళీకృష్ణను హాజరు పరిచగా రిమాండ్‌ విధించారు. ‘రెండేళ్ల క్రితం నా ఫోన్‌ వాట్సాప్‌కు పవన్‌కళ్యాణ్, చంద్రబాబుపై ఒక వ్యంగ్య కార్టూన్‌ వచ్చి0ది. అప్పట్లో దానిని నేను ఫార్వార్డ్‌ చేశాను. 

ఆ సమయంలో భీమవరానికి చెందిన జనసేన కార్యకర్త పలికెల కిరణ్‌కుమార్‌ స్క్రీన్‌ షాట్‌ తీసి దాచిపెట్టి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిర్యాదు చేశాడు. దీంట్లో నిజానిజాలు విచారించకుండానే నాపై తప్పుడు కేసు పెట్టారు’ అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.   

Back to Top