తాడేపల్లి: రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలకు గానూ అరకొర నిధులను విడుదల చేస్తూ, సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వైయస్ఆర్సీపీ ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమరు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బాకాయిలు రూ.25000 కోట్లు ఉంటే, కూటమి ప్రభుత్వం కేవలం రూ.1300 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. ఇవ్వాల్సిన బకాయిలు కొండంత... చెల్లింపులు చేస్తామన్నది గోరంతగా ఉందని విమర్శించారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమరు చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం పెండింగ్ బకాయిల కోసం మొత్తం రూ.6700 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో రూ.1300 కోట్లు మాత్రమే ఉద్యోగులకు సంబంధించినవి ఉన్నాయి. ఈ కొద్దిపాటి మొత్తాన్ని విడుదల చేస్తూ ఏదో ఉద్యోగులకు వరాలు కురిపించినట్లు, సంక్రాంతి కానుకను అందించినట్లు ప్రచారం చేసుకోవడం ఆక్షేపనీయం. మీరు ఇవ్వాల్సిన బకాయిలు ఎంత? మీరు చెల్లిస్తామన్నది ఎంతో వివరంగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వ నిజ స్వరూపం బయట పడుతుంది. గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను తరచుగా నిర్వహిస్తూ ఉద్యోగుల సమస్యలను గురించి నిర్ణయాలు తీసుకునేంది. కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగసంఘాలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను పిలిచి మాట్లాడిన దాఖలాలే లేవు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించి రూ.1300 కోట్లలోనూ రూ. 519 కోట్లు జీపీఎఫ్ కోసం, రూ.214 కోట్లు కేవలం పోలీస్ విభాగం ఒక విడత సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల భాగస్వామ్యం రూ. 300 కోట్లు మాత్రమే కడతామని చెబుతున్నారు. ఇదేనా మీరు ఉద్యోగులకు ఇస్తున్న సంక్రాంతి కానుక? కనీసం మొత్తం జీపీఎఫ్ బకాయిలు అయినా చెల్లించాలి జీపీఎఫ్ అనేది ఉద్యోగులు దాచుకున్న డబ్బు. దీనిని మొత్తం ఇవ్వకుండా కేవలం రూ. 519 కోట్లు మాత్రమే ఇస్తామని అనడం ఎంత వరకు సమంజసం? ఏడాదికి 15 రోజులు ఉద్యోగులు తమ లీవులను సరెండర్ చేసుకునేందుకు వీలుంది. దీనిని అందరికీ ఇవ్వకుండా కేవలం పోలీస్ డిపార్ట్ మెంట్ కు అది కూడా ఒక విడత మాత్రమే ఇస్తున్నారు. అలాగే సీపీఎస్ కూడా ఒక విడత చెల్లింపులు మాత్రమే చేస్తున్నామని అంటున్నారు. ఉద్యోగస్తులకు టీడీఎస్ కింద రూ.265 కోట్లు ఇస్తున్నామని చెబుతున్నారు. 36 సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేసిన ఒక ఉద్యోగిగా ప్రభుత్వ తీరు అర్థం కావడం లేదు. ఉద్యోగులు ఆదాయపన్ను ఎంత కట్టాలో అంతే చెల్లిస్తారు. కార్పోరేట్ సంస్థ మాదిరిగా ముందుగా కొంత మినహయింపు చేసి, తరువాత దానిని వారికి చెల్లించే విధానం ప్రభుత్వంలో లేదు. అలాంటప్పుడు ఈ టీడీఎస్ అనేది ఎవరికి ఇస్తున్నారు? ఇటువంటి అయోమయం లేకుండా ఉండాలంటే ఉద్యోగసంఘాలను పిలిచి వారితో చర్చించాలి. కానీ అటువంటి ప్రయత్నం చేయకుండా ఏకంగా ఉద్యోగులకు రూ.1300 కోట్లు ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. - 3.80 లక్షల పెన్షనర్లకు మేలు చేయడం లేదు ఈ రాష్ట్రంలోని 3.80 లక్షల పెన్షనర్లకు ఏ మాత్రం మేలు చేసే కార్యక్రమం చేయడం లేదు. డీఎ ఎరియర్స్, పీఆర్సీ ఎరియర్స్, సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్, రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్, కమిటేషన్ ఆఫ్ లీవ్, గ్రాట్యూటీ వంటి బెనిఫిట్స్ పెండింగ్ లో పెడుతున్నారు. అలాగే మెడికల్ రీయింబర్స్ మెంట్, జీపీఎఫ్, ఏపీజెఎల్ వంటివి కోట్లలో ఉన్నాయి. వాటిల్లో ఇంత మేరకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. - ఎన్నికల సమయంలో హామీల అమలు ఏదీ? ఉద్యోగులకు రావాల్సినవి ఇస్తున్నారే తప్ప ప్రభుత్వం మాకు ఎటువంటి కానుకలను ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. మంచి పీఆర్సీని, మధ్యంతర భృతిని ఇస్తామని హామీలు ఇచ్చింది. ఏడు నెలలు గడుస్తున్నా పీఆర్సీని నియమించలేదు, ఐఆర్ ను ప్రకటించలేదు. రావాల్సిన బకాయిల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రతి ఆరునెలలకు కేంద్రం డీఏను ప్రకటిస్తుంది. ఈ రాష్ట్రంలో 2024లో రావాల్సిన రెండు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వస్తే ప్రతి ఉద్యోగికి ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామన్నారు. తొలి రెండ నెలలు మాత్రమే ఇలా ఇచ్చారు. తరువాత నుంచి ఆలస్యంగానే జీతాల చెల్లింపులు జరుగుతున్నాయి. హెల్త్ కార్డ్ లకు సంబంధించి ఉద్యోగులు కొంత,ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది. ప్రతిసారీ ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తున్నారు. సకాలంలో ప్రభుత్వ వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. రెగ్యులర్ కు అర్హత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను గత ప్రభుత్వం కొంతమేర రెగ్యులర్ చేశారు. మిగిలిన వారిని కూడా రెగ్యులర్ చేయాలి. గ్రామసచివాలయ ఉద్యోగులకు జాబ్ చార్ట్ లేకుండా ప్రభుత్వం వారిని అడ్డా కూలీలుగా ఇష్టం వచ్చినట్లు పనిచేయించుకుంటోంది. వారి పనితీరుపై ప్రభుత్వం గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగుల సంఘాలతో చర్చించాలి. - ఉద్యోగాల భర్తీ ఏదీ? మేం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి నాలుగు లక్షల చొప్పున మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అప్పటి వరకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగభృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంగన్ వాడీ లకు కూడా ఉద్యోగభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీపీఎస్, జీపీఎస్ ను సమీక్షించి, అందరికీ ఆమోదయోగ్యమైన పెన్షన్ స్కీంను తీసుకువస్తామని అన్నారు. దాదాపు 3 లక్షలమంది ఉద్యోగులు సీపీఎస్ కింద ఉన్నారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా పెట్టలేదు. కూటమి ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నాం.