రాజమహేంద్రవరం: తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీదే పూర్తి బాధ్యత అని, అందుకే వెంటనే బోర్డును రద్దు చేయాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వమే బోర్డును రద్దు చేయాలని ఆయన తేల్చి చెప్పారు. అలాగే ఈ దుర్ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని.. హైకోర్టు సీజే కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన నేరం మాఫీ కాదన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడారు. భక్తులను పార్కులో బంధించారు తిరుపతిలో తొక్కిసలాట ఘటన రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద విషాదం. అదొక చీకటి అధ్యాయం. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల కోసం, బైరాగిపట్టడి కేంద్రానికి ముందు రోజు ఉదయం నుంచే భక్తులు తరలి రావడంతో, వారిని అక్కడే ఉన్న పద్మావతి పార్కుకు తరలించి తాళం వేశారు. 9వ తేదీ తెల్లవారుజామున 5 గం.కు టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించగా, 8వ తేదీ ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. దాదాపు 5 వేల మంది భక్తులను పార్కులో ఉంచి, బయటకు రాకుండా తాళం వేశారు. భక్తులను జైల్లో ఖైదీలుగా, జూలో జంతువుల మాదిరిగా నిర్భంధించి, వారికి కనీస వసతులు కల్పించలేదు. ఆహారం లేదు. తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదు. చివరకు పిల్లలకు పాలు కూడా పంపిణీ చేయలేదు. టీటీడీ బోర్డును రద్దు చేయాలి: ఇంత దుర్ఘటన జరిగాక, ఇద్దరు అధికారులను బాధ్యులను చేసి సస్పెండ్ చేయడం, నలుగురి బదిలీ.. ఇంక క్షమాపణలు చెబితేనో చేసిన పాపం పోదు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామా చేయాలి. లేదా ప్రభుత్వమే టీటీడీ బోర్డును రద్దు చేయాలి. ఈ ఘటనలో అక్కడ డ్యూటీ చేసిన పోలీసులది తప్పయితే, వారిని మోహరించిన బోర్డుది కూడా తప్పే. ఏదేమైనా నేరం చేసిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సిందే. నిందితులను శిక్షించే దాకా బాధితుల పక్షాన మా పార్టీ పోరాడుతుంది. న్యాయ విచారణ జరిపించాలి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు జస్టిస్‌తో సమగ్రమైన విచారణ జరిపించాలి. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ కేసును సుమోటోగా తీసుకుని తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలను కాపాడాలి. ఒకవేళ చంద్రబాబు ఆదేశాలతో దర్యాప్తు జరిగితే గోదావరి పుష్కరాల్లో మాదిరిగానే భక్తుల అత్యుత్సాహం వల్ల తొక్కిసలాట జరిగిందని రిపోర్టు ఇప్పించి వారిదే తప్పన్నట్టు ప్రచారం చేస్తారు. తొక్కిసలాటతో ఆరుగురి మరణానికి కారణమైన ప్రభుత్వం తమ చేతకానితనాన్ని మా నాయకుడు జగన్‌గారిపై నెట్టాలని చూస్తోంది. అందుకే సీఎం చంద్రబాబు మొదలు, ఆ పార్టీ నాయకులు ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారు. చివరకు వైయస్ జగన్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తే.. దానిపైనా అర్ధంలేని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. పరస్పర నిందలు జుగుప్సాకరం: తిరుపతిలో ఇంత దారుణ ఘటన జరిగితే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం మరింత జుగుప్సాకరంగా ఉంది. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరితే.. ఎవరో చెబితే తామెందుకు క్షమాపణలు చెప్పాలని?. అలా చెప్పినంత మాత్రాన చనిపోయిన వారు దిగొస్తారా? అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. భక్తుల భద్రతపై దృష్టి పెట్టకుండా వారి చావులకు కారణమైన ఈ సర్కారు, తప్పును దిద్దుకోకుండా మరింత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందనడానికి వీరి తాజా వైఖరే నిదర్శనం. చంద్రబాబు ప్రచార యావ.. సామాన్యుల బలి: చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి. 2015లో ఇక్కడే రాజమహేంద్రవరంలో గోదావరి నది పుష్కరాల్లో ఆయన ప్రచారయావకు ఏకంగా 29 మంది బలయ్యారు. అప్పుడు సీఎం అయిన చంద్రబాబు కెమెరాలతో షూటింగ్ పెట్టుకుని పుష్కర స్నానం చేసేంతవరకు మొత్తం యాత్రికులను ఆపారు. ఆ తర్వాత ఒక్కసారిగా వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారు. ఆ తర్వాత కందుకూరు, గుంటూరు సభల్లో జరిగిన తొక్కిసలాటలే దీనికి ఉదాహరణ. ఆ తర్వాత కందుకూరు సభలో తొక్కిసలాటకు 8 మంది, గుంటూరులో చీరల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాటకు ముగ్గురు మరణించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అంత మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని మార్గాని భరత్ గుర్తు చేశారు.