తిరుపతి ఘటనలో మూడు రోజులైనా బాధ్యులపై కేసులు లేవు

తన సొంత టీంలోని అధికారులను సీఎం కాపాడుకుంటున్నారు

మాజీ మంత్రి ఆర్కె రోజా ఆగ్రహం

తిరుపతి దుర్ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబు

వైకుంఠ ద్వార దర్శనం ఉందని తెలిసి కూడా కుప్పం పర్యటన పెట్టుకున్నారు

తన పర్యటన కోసం మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని మోహరింప చేసుకున్నారు

అందువల్లే తిరుపతిలో భక్తుల భద్రతపై అధికారులు దృష్టి సారించలేదు

మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ఆర్కె రోజా ఫైర్

ఎవరు తప్పు చేసినా తాట తీస్తానన్న పవన్ ఏం చేస్తున్నారు?

క్షమాపణలతోనే సరిపెడతారా... బాధ్యులైన అధికారులపై చర్యలు చేపడతారా?

వారి కులం బలం చూసి పవన్ భయపడుతున్నారు

సంథ్యా థియేటర్ ఘటనలో ఒక్కరు చనిపోతే 14 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు

తిరుపతి ఘటనలో ఎవరిపైన క్రిమినల్ కేసులు పెడుతున్నారు?

నిలదీసిన మాజీ మంత్రి ఆర్కె రోజా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరీ ఈ ఘటనపై నోరు మెదపడం లేదు

హిందువుల గురించి హైందవ శంఖారావంలో మాట్లాడిన మాటలు మరిచిపోయారా?

చంద్రబాబును కాపాడుకునేందుకే మౌనం వహిస్తున్నారా?

మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి పజలు బడితపూజ చేస్తారు

బాధితులకు వైయస్ఆర్ సీపీ డబ్బులిచ్చి మాట్లాడించిందంటారా?

బాధితులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎల్లో మీడియాలో కూడా వచ్చింది

కూటమి ప్రభుత్వంపై బాధితుల ఆగ్రహం చూసి కన్నీరు వచ్చిందని డిప్యూటీ సీఎం అన్నారు

వీరికి కూడా వైయస్ఆర్ సీపీ డబ్బులు ఇచ్చి మాట్లాడించిందా?

ప్రశ్నించిన మాజీ మంత్రి ఆర్కె రోజా

నగరి: తిరుపతి తొక్కిసలాట జరిగి మూడు రోజులైనా బాధ్యులపై ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం దారుణమని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ఆర్కె రోజా ఆక్షేపించారు. ఇటువంటి దుర్ఘటన జరిగినా ఇంకా కూటమి ప్రభుత్వంలోని సీఎం, డిప్యూటీ సీఎంలకు బుద్దిరాలేదని మండిపడ్డారు. న్యాయస్థానాలు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరి క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ అధికార ప్రతినిధి ఆర్కె రోజా శ‌నివారం మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి:
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన ఘటనలో తొలి ముద్దాయిగా సీఎం చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. తిరుమలలో వైకుంఠ ద్వారదర్శనంకు లక్షలాధి మంది భక్తులు వస్తారు, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని తెలిసి కూడా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు సీఎం చంద్రబాబు తన నియోజకవర్గంలో పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటన కోసం చిత్తూరు, తిరుపతి పోలీస్ బలగాలను, అధికార యంత్రాంగాన్ని మోహరింప చేసుకోవడం వల్లే తిరుపతిలో భక్తుల భద్రతను ఎవరూ పట్టించుకోలేదు. సంఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా చంద్రబాబు ఇంకా తమ సొంత మనుషులను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబుకు శ్రీవారి భక్తులన్నా, హిందువులన్నా ఏ మాత్రం గౌరవం లేదు. వారి ప్రాణాలకు విలువ లేదు. చంద్రబాబు తనకు రోజూ భజన చేసే బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ గా, తన గత ఓఎస్డీని అడిషనల్ ఈఓగా తన సెక్యూరిటీ ఆఫీసర్ సుబ్బారాయుడిని తిరుపతి ఎస్పీగా నియమించుకున్నారు. వీరెవరూ స్వామి వారికి సేవ చేసిన వారు కాదు, చంద్రబాబుకు సేవ చేసిన వారు, ఇప్పుడు కూడా ఆయన కోసమే పనిచేస్తున్న వారు. తన టీంను కాపాడుకోవడమే చంద్రబాబుకు ముఖ్యం. 

చంద్రబాబు ప్రచార యావ వల్లే...

తిరుపతి తొక్కిసలాటకు చంద్రబాబు ప్రచార యావే అసలు కారణం. ఒకవైపు ప్రధాని పర్యటన కోసం మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని విశాఖ తరలించారు. కనీసం చిత్తూరు, తిరుపతిజిల్లాలకు చెందిన పోలీస్ బలగాలను అయినా వైకుంఠ ద్వారదర్శనం ఏర్పాట్లలో నిమగ్నం చేసి ఉన్నా ఇటువంటి దారుణం జరిగేది కాదు. మూడు రోజుల ముందుగానే టోకెన్లు పంపిణీ చేసి ఉంటే ఇలాంటి  దుర్ఘటన జరిగేది కాదు. తొమ్మిదో తేదీన టోకెన్లు ఇస్తామని ముందుగా ప్రకటించి, తరువాత దానిని ఎనిమిదో తేదీ సాయంత్రానికే అంటూ ముందుకు తీసుకువచ్చారు. ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కుప్పంలో తన పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని అక్కడే మోహరింప చేశారు. దీనివల్ల పోలీసులు తిరుపతి వైకుంఠ ద్వారదర్శనం భద్రతా ఏర్పాట్లలో పాల్గొన కుండా చేశారు. ఇప్పుడు అధికారులదే తప్పని చంద్రబాబు అనడం దారుణం. ఇది ముమ్మాటికీ చంద్రబాబు, ఆయన ప్రభుత్వం చేసిన హత్యలే. మూడు రోజుల పాటు కుప్పం పర్యటనలో స్వర్ణకుప్పం, కుప్పం విజన్ -2029 అంటూ ప్రచారం చేసుకున్నారు. మూడు సార్లు సీఎం, ముప్పై ఏళ్ళ పాటు కుప్పం ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు చేయలేని కుప్పంను ఇప్పుడు స్వర్ణకుప్పంగా చేస్తారా? వైకుంఠ ఏకాదశకి తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్ లకు తెలియదా? వారికి పూర్తి కట్టుదిట్టమైన భద్రత మధ్య టోకెన్ల జారీ చేయాలనే విషయం వారికి తెలియదా? పైగా నిస్సిగ్గుగా ఈ టోకెన్ విధానం మేం తెచ్చింది కాదు, గత ప్రభుత్వం తెచ్చింది అని చెబుతున్నాడు. మా హయాంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఈ విధానం సరైంది కాదు అని అనుకుంటే మీ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయ్యింది. ఎందుకు ఈ విధానంను తీసేయలేదు?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధ్వంద వైఖరి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ నేను క్షమాపణలు చెప్పాను, మీరు ఎందుకు  చెప్పరు అని అధికారులను అడుగుతున్నారు. గతంలో మహిళపై దాడుల గురించి మాట్లాడుతూ బెత్తం దెబ్బలతో సరిచేస్తాను అంటూ మాట్లాడారు. ఇప్పుడు క్షమాపణలతోనే ఈ ఘటనను సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కడప పర్యటనలో ఎవరు తప్పు చేసినా ఊరుకోను, తాట తీస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి తొక్కిసలాటకు టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓ, ఎస్పీలు కారణమని మీరే చెబుతున్నారు, మరి వారి తాట ఎందుకు తీయడం లేదు? గతంలో పవన్  మాట్లాడుతూ కులం పేరుతో ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే ఊరుకోను అని అన్నారు. తిరుపతి ఘటనలో బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరి, సుబ్బారాయుడిని శిక్షించడానికి  ఏ కులంను చూసి భయపడుతున్నారు? ఆరోజు జరగని కల్తీ జరిగిందంటూ తిరుపతి లడ్డూ వ్యవహారంలో కాషాయవస్త్రాలు ధరించి పశ్చాత్తాప దీక్ష అంటూ హంగామా చేశారు. ఈ రోజు ఆరుగురు భక్తులు చనిపోతే క్షమాపణలు చెబితే చాలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ద్వంద వైఖరిని ప్రజలు చూస్తున్నారు. పుష్ఫ సినిమా ప్రదర్శన సందర్భంగా ఒకరు చనిపోతే సినిమా యూనిట్ కు మానవత్వం లేదు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తన అన్న కుమారుడి సినిమా గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు హాజరై వెడుతూ ఇద్దరు యువకులు చనిపోతే ఇన్ని రోజులు అవుతున్నా ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు. పిఠాపురంకు బాధిత కుటుంబాలను పిలిపించుకుని, కనీసం వారిని కలవకుండానే వారిని అవమానించిన పవన్ కళ్యాణ్ కు మానవత్వం ఉందా? హైదరాబాద్ సంథ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక్కరు చనిపోతే బాధ్యులుగా సినీ హీరోతో సహా థియేటర్ యాజమాన్యం వరకు మొత్తం 14 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ రోజు కుప్పంలో చంద్రబాబు అవసరం లేకపోయినా తన ప్రచార యావతో మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన చుట్టూ తిప్పుకుని, తిరుపతిలో భక్తుల భద్రతను గాలికి వదిలేసి ఆరుగురు మృతి చెందేందుకు కారణమయ్యాడు. ఇందుకు గానూ చంద్రబాబుతో సహా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జిల్లా ఎస్పీతో సహా అందరిపైనా క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము. 

హిందువుల ప్రాణాలకు విలువ లేదా పురంధేశ్వరీ?

తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు హిందువులు చనిపోయారు. అరవై మంది గాయపడ్డారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబు వదిన పురంధేశ్వరికి దీనిపై మాట్లాడేందుకు నోరు రాలేదు. ఎవరు దీనికి కారణమో, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండే రాలేదు. ఇటీవల హైందవ శంఖారావంకు వెళ్ళి ఆమె మాట్లాడిన పెద్ద పెద్ద మాటలను అందరూ విన్నారు. ఇక్కడ హిందువులు చనిపోతే వారి ప్రాణాలకు విలువ లేదా పురంధేశ్వరీ గారు?  ప్రధాని మోదీ గారికి ఈ దుర్ఘటన గురించి వివరించి, బాధితులకు న్యాయం చేయమని కోరండి.

మంత్రి ఆనం రాంనారాయణ దిగజారుడు వ్యాఖ్యలు

దేవాదాయశాఖా మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. జగన్ గారు తిరుపతిలో బాధితులను పరామర్శించి, కూటమి ప్రభుత్వంను తిట్టాలంటూ వారికి డబ్బులు ఇచ్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. జగన్ గారు ఆసుపత్రికి రాకముందే తెలుగుదేశంకు అనుకూలమైన ఏబీఎన్ ఛానెల్ లోనే బాధితులు మాట్లాడుతూ చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని ఎన్ని తిట్లుతిట్టారో ప్రజలంతా చూశారు. అలాగే మరో టీవీ ఛానెల్ ఎన్ టీవితో మాట్లాడిన బాధితులు కూడా ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని కూడా పెద్ద ఎత్తున విమర్శించారు. అలాగే రామోజీరావు కుమారుడు కిరణ్ ఆధ్వర్యంలోని పసుపు ఛానెల్ ఈటీవీలో కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భక్తులు ఎంత దారుణంగా ఇబ్బంది పడ్డారో కళ్ళకు కట్టినట్లు చూపించారు. వీరికి కూడా డబ్బులు ఇచ్చి, ప్రభుత్వాన్ని తిట్టించామా? ఇంతెందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ స్వయంగా మాట్లాడుతూ బాధితులను కలిసినప్పుడు వారు పడ్డ ఇబ్బందిపై చెప్పిన మాటలు వింటే కళ్ళ వెంట నీరు వచ్చిందని అన్నారు. పవన్ కళ్యాణ్ కు కూడా మేం డబ్బులు ఇచ్చి మాట్లాడించామా? మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దీనిపై సమాధానం చెప్పాలి. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డబ్బులు ఇచ్చామంటూ వైయస్ఆర్సీపీపై దిగజారుడుతనంతో మాట్లాడుతున్న మీ మాటలకు ప్రజలే మీకు బడితపూజ చేస్తారు. న్యాయస్థానాలు ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలి. సుమోటోగా తీసుకుని ఈ ఆరుగురి మరణానికి కారణమైన వారిపైన చర్యలు తీసుకోవాలి. తిరుమల ప్రతిష్ట దెబ్బతినకుండా చూడాలని కోరుకుంటున్నాము.
 

Back to Top