విజయవాడ: దివంగత ఎన్టీఆర్‌ను మోసం చేసినట్లే చంద్రబాబు ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా మోసం చేస్తున్నాడని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. చంద్రబాబు యథావిధిగా కుటుంబానికి అబద్ధం చెప్పాడని నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఏమీ జరగకున్నా, మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని మండిపడ్డారు. కన్నీళ్లు పెట్టుకొని పెద్ద సీన్ క్రియేట్ చేశారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. ఆ మహానీయుడి కుటుంబంలో పుట్టి ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, బాబు మాటలు నమ్మవద్దని హితవు పలికారు. మీ నాన్నగారి విషయంలో చంద్రబాబు ఒక్క నిజం కూడా చెప్పలేదని, ఎన్టీఆర్ ఎపిసోడ్‌లోనూ భువనేశ్వరి, పురందేశ్వరి బాలకృష్ణ మనసు మార్చారని పేర్కొన్నారు. సీఎం పదవి కోసం భార్యపై నిందలు వేసుకుంటాడా అని , సానుభూతి సంపాదించుకునేందుకు భార్య పేరు వాడుకుంటాడా అని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ‘నందమూరి బాలకృష్ణ అంటే నాకు అభిమానం. ఆ కుటుంబంలో ఎంతో కొంత మంచి మనసున్న వ్యక్తి, అమాయకుడు. అటువంటి బాలయ్య ఆలోచించుకోవాలి. వైశ్రాయ్ ఎపిసోడ్‌కు చంద్రబాబే కర్త, కర్మ, క్రియ. వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్‌పై చెప్పులేసి అవమానించారు. అక్కడికి బాలకృష్ణ వచ్చినప్పుడు చంద్రబాబు కుట్ర గురించి ఆయనకు చెప్పాను. మీ నాన్న అధికారంపై కుట్ర చేస్తున్నారని వివరించాను. అయినా కూడా బాలకృష్ణ స్పందించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాటకాన్ని ఎన్టీఆర్ కుటుంబం గుర్తించి కళ్లు తెరవాలి’ అని లక్ష్మీ పార్వతి సూచించారు. ‘చంద్రబాబు గురించి ఎన్టీఆరే స్వయంగా చెప్పారు కదా.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తన నటనతో మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఆస్కార్ అవార్డును దాటిపోయేలా చంద్రబాబు నటిస్తున్నాడు. నన్ను మించిన నటుడు చంద్రబాబు అని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు. చంద్రబాబు ఒక నీచుడు, నికృష్టుడు. మహిళలను కించపరిచి, వాడుకుంటున్నది చంద్రబాబే. లబ్ది కోసం ఎలాంటి పనైనా చేయగల సిద్ధహస్తుడు చంద్రబాబు. అధికార పిచ్చి పట్టిన మృగం. గతంలో వైఎస్సార్ కుటుంబంపై చంద్రబాబు నీచ ప్రచారం చేశారు. నేరుగా ప్రజల్లో గెలవలేక బురద జల్లడంలో చంద్రబాబు ఘనుడు. 25 ఏళ్లు చంద్రబాబుపై పోరాడాను. అనేక కష్టాలు పడ్డా ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేదు. మీ బావ మీద పోరాటం కోసమే నేను వైఎస్సార్‌సీపీలో చేరాను. ఇప్పటికీ మీరు ఎందుకు ఆ దుర్మార్గున్ని నమ్ముతున్నారు. సానుభూతి కోసం మీ చెల్లెల్ని బజారున పెట్టాడు. పురందేశ్వరి ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. చంద్రబాబుకు చనిపోయే వరకు పదవి కావాలి. ఎన్టీఆర్ గుండెపోటుకు చంద్రబాబే కారణం. ఎన్టీఆర్ బాధల్ని చంద్రబాబు ఏ రోజు పట్టించుకోలేదు. నాడు ఎన్టీఆర్ కన్నీరు పెట్టినప్పుడు మీకు కనిపించలేదా. నా వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు ఇప్పటికీ మిమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవాలనే చంద్రబాబు డ్రామాలు. చంద్రబాబు కుట్రలను ఇప్పటికైనా చంద్రబాబు అర్థం చేసుకోవాలి.చంద్రబాబు మాయలో పడొద్దు’ అని లక్ష్మీ పార్వతి విన్నపించారు.