`కూట‌మి` వ‌చ్చాక ఇసుక ధ‌ర పెరిగింది

మండ‌లి విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

 శాసనమండలిలో ఉచిత ఇసుకపై వాడివేడిగా చర్చ 

అమ‌రావ‌తి:  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింద‌ని శాస‌న మండ‌లి విప‌క్ష నేత బొత్స సత్యనారాయణ మండిప‌డ్డారు. ఉచిత ఇసుక, ఇసుక అక్రమ అమ్మకాలపై శాసనమండలిలో వాడివేడిగా చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చాక విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇసుక ధర తగ్గలేద‌న్నారు. ప్రభుత్వం చెప్పినట్లు ఇసుక ఇవ్వడం లేద‌ని త‌ప్పుప‌ట్టారు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎంతకిస్తున్నారో వెరిఫై చేయాల‌ని డిమాండ్ చేశారు.  కూటమి నేతలు చెప్పే లెక్కలు తప్పుగా ఉన్నాయ‌ని,  వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక ఎంతకు దొరికేది?.. ఈ రోజు ఎంతకు దొరుకుతుందంటూ కూటమి సర్కార్‌ని నిలదీశారు. ఉచిత ఇసుక అంటే టన్నుకు కనీసం 400 రూపాయలు తగ్గాల‌న్నారు. సామాన్యులకు ఉచిత ఇసుక అందే పరిస్థితి లేదని బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిపడ్డారు.

ప‌గ‌లూ, రాత్రి తేడా లేకుండా అక్ర‌మ ర‌వాణా: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాత్రి, పగలూ తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల స్టాక్‌ను కొత్త ప్రభుత్వానికి అప్పగించిందని.. దానిలో ఎంత స్టాక్ రికార్డెడ్‌గా జమ చేశార‌ని ప్ర‌శ్నించారు?. ఎంత ఆదాయం వచ్చిందని నిల‌దీశారు. రీచ్‌లలో ట్రాక్టర్ల నుంచి లారీల్లోకి ఇసుక వేయాల్సి ఉంటుంద‌ని, ప్రస్తుతం మొత్తం మెషినరీల ద్వారానే ఇసుకను తీసి లారీలకు లోడు చేస్తున్నార‌ని ఆక్షేపించారు.  ఒక్కొక్క లారీకి సుమారు 11 నుంచి 12 వేల వరకు వసూలు చేస్తున్నార‌ని తెలిపారు. గత ప్రభుత్వం అప్పగించిన ఇసుకకు, చెబుతున్న లెక్కలకు తేడాలు ఉన్నాయ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.  గత 2016లో తెచ్చిన పాలసీనే ఇప్పుడు కూడా ఉంద‌ని, పేద ప్రజలకు ఇసుక అందే పరిస్థితి లేదని తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు.

Back to Top