విశాఖపట్నం: రాష్ట్రంలోని లక్షలాది మంది పిల్లలకు, యువతకు ఉపాధి చూపించేందుకు ఉపయోగించాల్సిన నిధులను చంద్రబాబు నాయుడు దోపిడీ చేశాడని, ఎంత అనుభవం ఉన్నా సరే.. చేసిన తప్పులకు శిక్ష తప్పదని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. అనుభవం ఉందని, అవినీతికి ఆమడ దూరంలో ఉంటానని చెప్పుకుని తిరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు పాపం పండి.. అవినీతి డొంక కదిలిందన్నారు. ఇక ఆయన శేష జీవితం జైలు పాలేనని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. విశాఖ సర్క్యూట్ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అమర్‌నాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రజాప్రతినిధిగా ఉండి కంచే చేను మేసిన విధంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజల సంపదను దోపిడీ చేశాడు. పబ్లిక్ సర్వెంట్ చట్ట ఉల్లంఘనకు పాల్పడితే ఏరకంగా చర్యలు తీసుకుంటారో చంద్రబాబుపై నమోదైన సెక్షన్లు ఉదాహరణ. నేరం చేసిన తరువాత తప్పించుకునే ప్రయత్నం చంద్రబాబు ఎన్నో సందర్భాల్లో చేశారు. చంద్రబాబు చేసిన పాపాలకు తెరపడింది. ఉదయం నుంచి అరెస్టు అయిన తరువాత టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా అంతా చంద్రబాబు తప్పులేదు, అక్రమ అరెస్టు, అన్యాయంగా కస్టడీలోకి తీసుకున్నారని మాట్లాడుతున్నారు. తప్పు చేసిన చంద్రబాబు మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. నేను తప్పు చేయలేదు, ఈ కేసుకు నాకు సంబంధం లేదు అని చంద్రబాబు ఏరోజూ చెప్పలేదు. వంద కోట్లు గెలుచుకున్నారు రూ.10 లక్షలు కడితే రూ.100 కోట్లు చెల్లిస్తామని కొన్ని సంస్థలు ఏరకంగా మోసం చేస్తామయో.. ఆ మాదిరిగానే స్కిల్ స్కామ్‌ను చేశారు. సీమెన్స్ ప్రపంచ వ్యాప్తంగా పేరున్న సంస్థ. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కింద రూ.3356 కోట్లు ఖర్చు చేసి 6 సెంటర్లు ఏర్పాటు చేస్తాం.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెడతాం.. ఒక్కో దానికి రూ.550 కోట్లు ఖర్చు అవుతాయి. రూ.3356 కోట్లలో 10 శాతం ఏపీ ప్రభుత్వం చెల్లిస్తే.. 90 శాతం గ్రాంట్ కింద సీమెన్స్ కంపెనీ ఖర్చు చేస్తుందనేది ఈ స్కామ్‌కు పునాది. రూ.371 కోట్లు చంద్రబాబుకు సంబంధించిన రెండు షెల్ కంపెనీలకు డైవర్ట్ చేశారు. తరువాత 2014 ఆగస్టు నుంచి 2016 ఫిబ్రవరిలోపు రూ.371 కోట్లు ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చే షేర్‌ను షెల్ కంపెనీలకు డైవర్ట్ చేశారు. రూ.371 కోట్లు అకౌంట్లకు చేరిన తరువాత రాష్ట్రంలో ఏ స్కిల్ సెంటర్ లేదు.. చంద్రబాబు క్రిమినల్ స్కిల్ తప్పితే.. ఏ స్కిల్ రాష్ట్రానికి రాలేదు. చెప్పిన ఏ సంస్థ దీనిపై స్పందించలేదు. దీనిపై ఇప్పటికే ఈడీ సీమెన్స్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ వికాస్ నాయక్ కన్వేల్కర్, అదే కంపెనీకి చెందిన మాజీ ఫైనాన్స్ అడ్వయిజర్ ముకుల్ చంద్ర అగర్వాల్‌ను అరెస్టు చేశారు. ఎంతమంది పాత్రదారులు ఉన్నా.. ఈ స్కామ్‌కు సూత్రదారి చంద్రబాబే అని సీఐడీ, ఏసీబీ, మిగిలిన దర్యాప్తు సంస్థలు నమ్మాయి, ఆధారాలు సేకరించాయి కాబట్టే అరెస్టు చేశాయి. దీనిపై సీమెన్స్ కంపెనీని వివరణ కోరితే.. మాకేం అవసరం 90 శాతం రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏంటని సీమెన్స్ లెటర్ రాసి పంపించింది. సౌమ్యాద్రి శేఖర్ బోస్‌ను ఉద్యోగం నుంచి ఎప్పుడో తొలగించామని ప్రస్తావించింది. పేరున్న సంస్థను వాడుకొని ప్రజల సంపదను దోచే కార్యక్రమం చంద్రబాబు చేస్తే.. ఎందుకు అరెస్టు చేశారు అని మాట్లాడేందుకు టీడీపీ నేతలకు సిగ్గులేదా..? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్లు కాజేసి నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నాడని ఇన్‌కం ట్యాక్స్ 46 పేజీల నోటీసులు ఇచ్చింది. దాంట్లో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన పీఎస్ శ్రీనివాస్ వాంగ్మూలం ఇస్తే.. ఈ కంపెనీలతో మధ్యవర్తిత్వం చేసిన మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇస్తే.. వారి చెప్పిన మాటలకు సమాధానం చెప్పాలని చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే.. మీకేంటి సంబంధం.. మీ సర్కిల్‌కాదు కదా అని దబాయిస్తున్నాడు. రూ.118 కోట్ల ముడుపుల విచారణకు హాజరుకాకుండా పాత్రదారులిద్దరినీ దుబాయికి, అమెరికాకు పంపించాడు. చంద్రమండలం మీద ఉన్నా సరే మిమ్మల్ని జైల్లో కూర్చోబెట్టే బాధ్యత ఎంక్వైరీ ఏజెన్సీలు తీసుకుంటాయి. చట్టం నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు చేసిన పాపాలు, తప్పులు, అవినీతి, అక్రమాలకు, దోపిడీకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు మీద పెట్టిన కేసులకు కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. తప్పు చేసిన వారిని అరెస్టు చేయకుండా సినిమాలు చూపిస్తారా..? వివిధ స్కామ్‌లలో రూ.5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని లాలూ ప్రసాద్ యాదవ్‌ను జైల్లో పెట్టారు. చంద్రబాబుకు ఎంత అనుభవం ఉన్నా.. చేసిన తప్పులకు శిక్ష తప్పదు. నైపుణ్య అభివృద్ధి పేరిట రాష్ట్రంలోని లక్షలాది మంది పిల్లలకు, యువతకు ఉపాధి చూపించేందుకు ఉపయోగించాల్సిన నిధులను దోపిడీ చేశాడు. ఆర్థిక నేరాలకు, కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం అన్యాయం అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అనడాన్ని చూస్తే ఆమె లా ను పక్కనపెట్టి, మరిది కోసం పని చేస్తున్నట్టు కనిపిస్తోందని మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్, సిపిఐ సిపిఎం నేతలు, సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావులు ఎల్లో మీడియా బాబు చేసిన నేరాలపై సమాధానం చెప్పకుండా, ప్రభుత్వాన్ని తప్పు పట్టడం, విమర్శించడం ఎంత వరకు సమంజసమని అమర్‌నాథ్ ప్రశ్నించారు. పాత్రధారులు ఎంతమంది ఉన్నా, సూత్రధారి దోచుకున్న డబ్బు తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని అమర్‌నాథ్ వెల్లడించాడు. దయచేసి ఈ వ్యవహారాన్ని ఎవరు రాజకీయ కోణంలో చూడద్దని అమర్‌నాథ్ విజ్ఞప్తి చేశారు.