సీబీఐ విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయి..

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు: నెల్లూరు కోర్టులో చోరీ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, సీబీఐ విచారణలో నిజాలు నిగ్గుతేలుతాయని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. వాస్తవానికి ఆ కేసును సీబీఐకి అప్పగించాలని తానే అఫిడవిట్‌ ఫైల్‌ చేశానని చెప్పారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ హైకోర్టుకు కూడా తెలిపానని చెప్పారు. సీబీఐ విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయని, దీని వెనుక ఎఎవ‌రెవ‌రు ఉన్నార‌నేది బ‌య‌ట‌కు వ‌స్తుంద‌న్నారు. టీడీపీ నేతలు తనపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

ప్రజా జీవితంలో, ప్రజాప్రతినిధిగా ఉన్నవారు ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎటువంటి విచారణనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మంత్రి కాకాణి అన్నారు. చంద్రబాబు మీద అనేక రకాల కేసులు ఉన్నాయని, బాబు మాదిరిగా కేసుల విషయంలో స్టేలు తెచ్చుకోవాల్సిన ఖర్మ, గ‌తి తనకు పట్టదని, ధైర్యంగా విచారణను ఎదుర్కొంటానని చెప్పారు. కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నానన్నారు.  

Back to Top