చంద్రబాబూ.. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి

అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలని ప్రకటించండి

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

 

విజయవాడ: అమరావతి పేరుతో ఇతర ప్రాంతాలను ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకించారు కాబట్టే ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌ వికేంద్రీకరణ ప్రకటన చేసిన నాటి నుంచి అమరావతి పేరుతో కృత్రిమ ఉద్యమం చేస్తూ ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని, వెనుకబడిన ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టాలని నిర్ణయంపై చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆ ప్రాంత ప్రజలకు ఆగ్రహం వచ్చిందన్నారు.

ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని వెక్కిరించే విధంగా ప్రవర్తించిన చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు విశాఖలో పర్యటనను అడ్డుకున్నారన్నారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఉత్తరాంధ్ర ప్రజలు భావించారన్నారు. విశాఖలో ప్రజల ఆగ్రహం ఎక్కువవ్వడంతో ఆ సమయంలో సమన్వయంతో ఆలోచన చేసి వెనక్కు రావాల్సిందిపోయి పోలీసులనే చంద్రబాబు నిందిస్తున్నాడన్నారు. ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నం వెళ్లినప్పుడు పోలీసులు రన్‌వే పైనే నిర్బంధించి అక్కడి నుంచి వెనక్కు పంపించారని గుర్తుచేశారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం చంద్రబాబుకు భద్రత కల్పించినా.. పోలీసులపైనే నిందలు వేసి కావాలని చంద్రబాబు నీచ రాజకీయం చేశాడని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని, ఒక ప్రాంతం, ఒక వర్గం అని ఆలోచన మానుకోవాలని సూచించారు. సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న మంచికి మద్దతు తెలపాలని కోరారు.

Back to Top