అమరావతి: ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి రాజ్యాంగ విలువలను కాలరాశాడని, చంద్రబాబును నమ్మి మోసపోయిన వారిలో తాను ఒకడినని అన్నా రాంబాబు చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. వందల కోట్ల రూపాయలు వెచ్చించి శాసనసభ్యులను చంద్రబాబు కొన్నాడంటే అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది.. ఆ డబ్బు అవినీతి డబ్బు కాదా అని ప్రశ్నించారు. వెలుగొండ ప్రాజెక్టు రెంటు టన్నెల్స్ ఉన్నాయని, మొదట్లో వేసే బోర్ లోపలికి వెళ్లే కొద్ది లైనింగ్ చేయడం వల్ల వైశాల్యం తగ్గుతుందని, ఆ పనులు చేసే ఇద్దరు కాంట్రాక్టర్లను క్యాన్సిల్ చేసి రూ. 600 కోట్లు ఉంటే.. తదుపరి టెండర్లు రూ. 16 వందల కోట్లకు పిలిచారన్నారు. వర్కులు క్యాన్సిల్ చేసి మిషినరీ మాత్రం అదే కాంట్రాక్టర్‌కు చెందినవి వాడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఒక కమిటీ వేసిందని, దాంట్లో అన్నీ బయటకు వస్తుందన్నారు. అవినీతి సొమ్ముతో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, దానికి తానే సాక్షమన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చంద్రబాబు శాసనసభలో కూర్చోవడానికి అనర్హుడన్నారు. అధికారం ఉంది కదా అని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి నలుగురికి మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు ఇష్టానుసారంగా వ్యవహరించాడని మండిపడ్డారు. సిగ్గు, ఎగ్గూ లేకుండా చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత స్పీకర్ కోడెల ఏకవ్యక్తి పాలన నిర్ణయాలకు తాబేదారుడిగా వ్యవహరించారని ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే ఆ సభ్యుడిపై అనర్హత వేటు వేయాలని చట్టం చెబుతున్నా.. స్పీకర్‌గా ఉన్న కోడెల ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం హేయమన్నారు. పార్టీ ఫిరాయించిన వారిపై వెంటనే అనర్హత వేటు పడేలా చట్ట సవరణ చేసి పార్లమెంట్‌కు నివేదించాల్సిందిగా స్పీకర్‌ను కోరారు.