తాడేపల్లి: దళితులు పేదలుగానే మిగిలిపోవాలా?, వారికి భూములిస్తే మీకెందుకు కడుపు మంట? అంటూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్నా, వాటిపై ఏ హక్కులు లేక, ఇబ్బందులు పడుతున్న లక్షలాది రైతులకు మేలు చేస్తూ, వైయస్ జగన్‌గారి ప్రభుత్వం నిషేధిత జాబితా 22–ఏలో ఉన్న భూములను, ఆ ఆంక్షల నుంచి తొలగించిందన్నారు. గత ఎన్నికల ముందు రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లకు చేరిందని ఏ విధంగా దుష్ప్రచారం చేశారో.. ఇప్పుడు భూముల విషయంలోనూ అలాగే కొత్త డ్రామాకు తెర తీశారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. చంద్రశేఖర్ ఏం మాట్లాడారంటే..: – ‘పేదలకు మాటలు. కూటమి నాయకులకు మూటలు. వైయస్ఆర్‌సీపీ నాయకులకు కేసులు’.. అన్నట్లుగా ఉంది కూటమి నాయకుల వ్యవహారం. – దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్నా, వాటిపై ఏ హక్కులు లేక, ఇబ్బందులు పడుతున్న లక్షలాది రైతులకు మేలు చేస్తూ, జగన్‌గారి ప్రభుత్వం నిషేధిత జాబితా 22–ఏలో ఉన్న భూములను, ఆ ఆంక్షల నుంచి తొలగించింది. – చుక్కల భూములు, అసైన్డ్, ఇనాం భూములు, సర్వే ఇనాం, షరతులతో కూడిన పట్టా భూముల విషయంలో నిపుణుల సలహాలతో వారి సూచనల మేరకు, రైతులకు ఆ భూములపై పూర్తి హక్కులు కల్పించారు. అసైన్డ్ భూములు: – పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములపై 20 ఏళ్లు పూరై్తన తర్వాత, వాటిపై యాజమాన్య హక్కులు కల్పించాం. అదే విధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు కల్పించాం. – జగన్‌గారి ప్రభుత్వ నిర్ణయం వల్ల 27,41,698 ఎకరాలపై 15,21,160 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులకు హక్కులు కలిగాయి. – ఆ భూములు నిషేధిత జాబితా 22–ఏ నుంచి తొలగించడం ద్వారా, వాటిపై వారికి పూర్తి హక్కులు కలిగి, వారు తమ అవసరాల కోసం ఆ భూములు వినియోగించే అవకాశం ఏర్పడింది. మీకెందుకు కడుపు మంట?: – పేదలకు భూములపై హక్కు కల్పిస్తే ప్రభుత్వానికి ఎందుకు కడుపు మంట?. తమకు మాత్రమే మూటలు అన్నట్లుగా, మంత్రి అనగాని సత్యప్రసాద్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 27 వేల ఎకరాలు అసైన్డ్ భూములు రిజిస్టర్ అయ్యాయంటే ఆయనకు ఎందుకు కడుపుమంట?. – పేదలు ఎప్పటికీ అలాగే ఉండాలా?. విచిత్రంగా ఇలాంటి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మాట్లాడుతున్నారు. ఈ భూమి పేదవారి వద్దనే ఉంటే వాటిని అడ్డుకోవడానికి ఇలాంటి విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. – దశాబ్దాలుగా చుక్కల భూముల సమస్య పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న కారణంగా పేదలు ఇబ్బందులు పడుతుంటే, వాటిపై అధ్యయనం చేసి, ఆ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరిగింది. కొత్త డ్రామా: – గత ఎన్నికల ముందు రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లకు చేరిందని ఏ విధంగా దుష్ప్రచారం చేశారో.. ఇప్పుడు భూముల విషయంలోనూ అలాగే కొత్త డ్రామాకు తెర తీశారు. – ఆ భూముల పట్టాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరాధార ఆరోపణలు చేశారు. ఇది అత్యంత హేయం. వారిపై చర్యలతోనే మొదలుపెట్టాలి: – నిజంగా ల్యాండ్ గ్రాబింగ్ నియంత్రణ చేస్తామంటే మేం కూడా స్వాగతిస్తాం. అయితే రాజధాని ప్రాంతంలో అక్రమంగా అసైన్డ్ భూములు కాజేసిన కూటమి నాయకుల మీదనే మొదట చర్యలు తీసుకోవాలి. ఆనాడు అక్రమంగా కట్టబెట్టిన భూమిని వెనక్కి తీసుకోవాలి. – మరి ఎంత అసైన్డ్ భూమిని కొల్లగొట్టారో, ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయో వాటి మీద విచారణ జరిపించి పేద ప్రజలకు ఇచ్చే ధైర్యం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా? మీరు ఏనాడైనా ఇచ్చారా?: – రాష్ట్రంలో ఎక్కువ కాలం పాలించిన తెలుగుదేశం పార్టీ.. ఒక్క సెంటు భూమి అయినా దళితుల స్మశానాలకు కేటాయించిందా? – వైయస్సార్‌సీపీ ప్రభుత్వం, స్మశాన వాటికలు లేని 1563 దళిత వాడలు గుర్తించి, వాటికి 951 ఎకరాలు కేటాయించింది. దాని మీదా కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. శ్రీవాణి ట్రస్ట్‌పై నిందలు: – దళిత వాడలకు దూరమైన హిందుత్వాన్ని, శిథిలావస్థకు చేరిన ఆలయాలకు భక్తులను ప్రొత్సహించేలా, శ్రీవాణి ట్రస్టు ద్వారా చేసిన గొప్ప కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం తప్పు బడుతోంది. ట్రస్టుపై నిరాధార ఆరోపణలు చేస్తోంది. – శ్రీవాణి ట్రస్టు పేరుతో ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, రూ.10 వేల శ్రీవాణి దర్శనం టికెట్ల నిధులతో దళిత, గిరిజన వాడల్లో హిందుత్వాన్ని పెంచడంతో పాటు, పాత ఆలయాల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. – ఇప్పుడు శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి, ఆ నిధులను మెయిన్ అకౌంట్లోకి మారుస్తామని చెప్పడం అవినీతికి మార్గం చూసుకోవడమే. – మరోవైపు దళితులు, బీసీలను ఆలయాలకు దూరం చేసే కుట్ర చేస్తున్నట్టుగా భావించాల్సి వస్తోంది. కక్ష సాధింపు చర్యలు. కేసులు: – హామీల అమలు లేకపోవడాన్ని, ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు, సోషల్ మీడియా వర్కర్లపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. – విచక్షణా రహితంగా అందరిపై ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. పేకాట క్లబ్‌లపై ప్రశ్నిస్తే కేసు!: – ‘పేకాట ఆడించడం ధర్మమా? అని నేను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే.. ఎస్సై నాకు వాట్సాప్‌లో 41–ఏ నోటీసులు పంపారు. నాపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. – ఆ అంశంపై టీడీపీ అనుకూల ఎల్లో మీడియాలోనే కథనాలు వచ్చాయి. వాటినే ఉటంకిస్తూ నేను పోస్టు పెట్టడం తప్పా?. పేకాట క్లబ్బులు నిర్వహించడం వాస్తవం కాదా? పేకాట క్లబ్బులు అనేవి కాసుల కక్కుర్తికి కాకపోతే వాటిలో ప్రజాశ్రేయస్సు ఏముంది? – అసెంబ్లీలో మాట్లాడకుండా, సోషల్ మీడియాలో మాట్లాడకుండా, ఇప్పుడు మీడియాలో కూడా మాట్లాడకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. – ఎంత తొక్కాలని చూస్తే అంత ఎక్కువగా ప్రశ్నిస్తాం. మీరు చేసే అన్యాయాలను ఎండగడతాం. – నియంతలైన హిట్లర్, గడాఫీలా వ్యవహరిస్తే భయపడి పారిపోయే రకం తాము కాదని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు.