తాడేపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హత్యా రాజకీయాలకు చంద్రబాబే ఆధ్యుడని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎదుగుదలలో ప్రతి అడుగులోనూ ఆయన చేసిన కుట్రలు, కుతంత్రాలు కనిపిస్తాయని మండిపడ్డారు. రాయలసీమలో తన స్వార్థం కోసం హత్యాలను ప్రోత్సహించిన చరిత్ర చంద్రబాబు సొంతమని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఎమన్నారంటే.... తన 45 ఏళ్ల జీవితంలో హత్యా రాజకీయాలకు దూరంగా ఉన్నానని చంద్రబాబు ఇప్పుడు నీతులు వల్లించడం విడ్డూరంగా ఉంది. తాము శుద్ధపూసలన్నట్టు తండ్రీకొడుకులు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ మరణానికి కారకులెవరో ప్రజలందరికీ తెలుసు. దానికి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. 'నిన్ను చంపితే దిక్కెవరు జగన్' అని చంద్రబాబు గతంలో హెచ్చరించలేదా? ఆయన హెచ్చరించినట్లుగానే వైయస్ జగన్‌పై రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. వైయస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగినప్పుడు చంద్రబాబే సీఎంగా ఉన్నాడనేది నిజం కాదా? ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు వైయస్ జగన్ పై రాయితో దాడి చేసిన వారితో టీడీపీ నాయకులకు ఉన్న సంబంధం కూడా పోలీసుల విచారణలో బయటపడింది. చిత్తూరు జిల్లా అంగళ్లులో పోలీసులను ఉద్దేశించి 'తరమండి నా కొడుకుల్ని..' అంటూ రెచ్చగొట్టి దాడులు చేయించింది చంద్రబాబు కాదా? టీడీపీ నాయకులు చేసిన దాడుల కారణంగా ఒక పోలీస్ తన కంటి చూపును కోల్పోయాడు. ఆది నుంచి చంద్రబాబుది క్రూర స్వభావమే 1995 సెప్టెంబర్ 1 చంద్రబాబు మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నాలుగేళ్లలోనే రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలో చంద్రబాబు ప్రేరణతో ఎన్నో హత్యలు జరిగాయి. హత్యా రాజకీయాలు పురుడుపోసుకున్నదే చంద్రబాబు పాలనతో. హత్యకేసుల్లో అరెస్టైన నిందితులపై కేసులు ఎత్తేయించి నిర్దోషులుగా బయటకు తీసుకొచ్చిన ఘటనలే హత్యా రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తారని చెప్పడానికి ఉదాహరణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకుండానే ఎన్నికలయ్యాక జరిగిన హింస ఆయన ప్రోద్భలంతోనే జరిగింది. వైయస్ఆర్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా ఇప్పటికే వందల మందిపై దాడులు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం, నడిరోడ్డుపై హత్యలు చేయడం, హత్యాయత్నాలకు పాల్పడటం ఇప్పటికీ రాష్ట్రంలో ఏదోఒక మూల జరుగుతూనే ఉన్నాయి. 1995, 1996లో ఒకేసారి రాయలసీమలో 14 మందిని హత్య చేశారు. దీని వెనుక ఉన్నది చంద్రబాబు కాదా? రెడ్‌బుక్ పేరుతో నారా లోకేష్ అరాచకం చంద్రబాబు అనేక సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలతో దూషణలకు దిగాడు. వైయస్ జగన్ సైకో ముఖ్యమంత్రి అంటూ దూషించాడు. నాయీ బ్రాహ్మణులను మీ తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించాడు. రాష్ట్రంలో పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేశాడు. ఇటువంటి మనస్తత్వం కలిగిన చంద్రబాబు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడు. ఇవే కాకుండా సోషల్ మీడియాలో జగన్ కుటుంబంపై మార్ఫింగ్ పోస్టులు, వెకిలి పోస్టులు, ఎల్లో మీడియాలో కార్టూన్లు ఇలా అనేక దారుణాలు చంద్రబాబు ప్రోద్భలంతోనే జరిగాయి. కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబు ప్రతిబింబం అయితే, దాన్ని కొడుకు నారా లోకేష్ వారసత్వంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం పట్టాభి లాంటి వారిని పార్టీ ఆఫీసులో కుర్చోబెట్టి బూతులు తిట్టించడమే పనిగా పెట్టుకున్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నాడు. వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై వేల సంఖ్యలపై దాడులు జరిగినా ఒక్క టీడీపీ నాయకుడిపైన కూడా కేసు నమోదు కాలేదు. ఆఖరుకి వినుకొండలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రషీద్‌ను బహిరంగంగా నడిరోడ్డుపై నరికి చంపినా నిందితులకు శిక్షపడలేదు. రాష్ట్రంలో బూతుల సంస్కృతిని ప్రారంభించిందే టీడీపీ. ఎదురు దాడి చేసిన పాపానికి వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళిని తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. నిన్న మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో నారా లోకేష్ పక్కనే కూర్చుని వైయస్ జగన్ ను ఉద్దేశించి నెల తక్కువ బాలుడు అన్న మాటలకు ఏం సమాధానం చెబుతారు? నెల ఎక్కువ పుట్టినందుకే అచ్చెన్నాయుడు, లోకేష్‌లకు అంత భారీ శరీరాలు వచ్చాయా? చరిత్రలో ఎప్పుడైనా మంచి చేసిన వారే చిరస్థాయిగా నిలబడి పోతారనే విషయాన్ని ఇప్పటికైనా చంద్రబాబు గ్రహించాలి. మంత్రి లోకేష్ చేతకానితనంతో విద్యావ్యవస్థ నాశనం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతకానితనం వల్లే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనమవుతోంది. కూటమి అసమర్థ పాలన వల్లే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు, యువత రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా నిరుద్యోగులు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై వారికి అండగా నిలబడాలని వైయస్ఆర్‌సీపీ యువత పోరు పేరుతో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమానలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో జగన్ పాలనలో విద్యకు పెద్దపీట వేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ చేతకానితనం ఈ 9 నెలల్లోనే బయటపడింది. 9 నెలల పాలనతోనే కూటమి ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేనంత వ్యతిరేకతను మూటకట్టుకుంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే సరిద్దికోవడం పక్కనపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, కేసులతో వేధించడం ప్రభుత్వానికి రివాజుగా మారింది.