పాలకుల చేతగానితనం వల్ల ఆరు నిండు ప్రాణాలు బలి 

ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు?

సీఎం, డిప్యూటీ సీఎం వేర్వేరుగా వచ్చారంటేనే మీ వ్యూహం ఏమిటో అర్థ‌మ‌వుతుంది

తొక్కిసలాట ఘటనపై ఎక్స్ వేదిక‌గా స‌ర్కార్ తీరును ఎండ‌గ‌ట్టిన మాజీ మంత్రి ఆర్కే రోజా

తిరుపతి : కోరి కొల్చినవారికి కొంగు బంగారమై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం చెంత తిరుపతిలో జ‌రిగిన తొక్కిసలాట పాలకుల చేతగానితనమే కార‌ణ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నేత‌, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు. పాలనా వైఫ‌ల్యం వల్ల ఆరు నిండు ప్రాణాలు బలికావటం, 43 మందికి పైగా గాయపడటం చరిత్ర ఎరుగని విషాదమ‌న్నారు. ఇంతటి మహా విషాదానికి కారణమైన అధికారుల్ని ఎందుకు కాపాడుతున్నారంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై గురువారం రాత్రి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వేర్వేరుగా స్టేట్‌మెంట్‌లు ఇవ్వడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌ వేదికగా స్పందించారు. 

రోజా తన ట్వీట్‌లో ఏమన్నారంటే?
ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు..?వైకుంఠ ఏకాదశి దర్శన టోకన్లు పొందడం కోసం పరితపించిన భక్తులు..!! కానీ కూటమి ప్రభుత్వం, నిర్లక్ష్యం కారణంగా ఆరు మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనకు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బారాయుడు ప్రధాన కారణం. ఈ విషయం డిప్యూటీ సీఎం  పవన్‌ కళ్యాణ్‌  కూడా ప్రజల్లో అగ్రహాం రావడంతో  సమాజ మెప్పు కోసం అంగీకరించారు.

పవన్ మాటలలోనే విధినిర్వహణలో టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు, ఈఓ శ్యామల రావు, అదనపు ఈఓ వెంకయ్యచౌదరిలు పూర్తిగా విఫలం అయ్యారు అని స్పష్టమయింది. మరి ఈ కీలక స్థానంలో ఉన్న ప్రధాన అధికారులు, పాలకండలి వైఫల్యమే కదా. తొక్కిసలాటకి కారణం ఫలితంగా ఆరుగురు భక్తులు తమ నిండు ప్రాణాలు కోల్పోయారు.

అందుకు కారణమైన టీటీడీ ఛైర్మన్, ఈఓ, అదనపు ఈఓలపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అడగరు? అంటే సమాజంలో ఉన్న అభిప్రాయం తాను చెప్పడం ద్వారా ప్రజలు మెప్పు పొందటం, చంద్రబాబుకు ఇష్టమైన అధికారులపై చర్యలు కోరకుండా తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం..!! ఇదేనా మీ సనాతన ధర్మం..? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వచ్చారంటేనే అర్దం అవుతుంది మీ వ్యూహం ఏమిటో!!’ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Back to Top