విజయవాడ: ఫిష్ ఆంధ్రాతో ఆక్వాకల్చర్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందుతుందని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. సాగు, దిగుబడులు, ఎగుమతుల్లోనే కాకుండా స్థానికంగా వినియోగంలో సైతం రాష్ట్రాన్ని నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఔత్సాహికులతో కలిసి ఆక్వా హబ్‌లు, రిటైల్ ఔట్‌లెట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోందని చెప్పారు. వీటిలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి పేటీఎంతో కలిసి పనిచేస్తున్నామన్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో మంగళవారం మంత్రి సమక్షంలో పేటీఎం, రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్కాఫ్) మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఆఫ్కాఫ్ చైర్మన్ కె.అనిల్ బాబు, పేటీఎం చీఫ్ బిజినెస్ మేనేజర్ అభయ శర్మ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అనంతరం రిటైల్ ఔట్‌లెట్ నిర్వాహకులకు రూ.22 వేల విలువైన పాయింట్ ఆఫ్ సేల్ (పోస్), క్యూఆర్ కోడ్, తదితరాలను పేటీఏం సంస్థ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 100 ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటికి అనుబంధంగా 14 వేలకుపైగా రిటైల్ ఔట్‌లెట్లను తీసుకొస్తున్నామని చెప్పారు. మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు మాట్లాడుతూ.. ఫిష్ ఆంధ్రా ద్వారా పోషక విలువలు ఉన్న తాజా చేపలు, సముద్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతామన్నారు. వీటి ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. పేటీఎం చీఫ్ బిజినెస్ మేనేజర్ అభయ్ శర్మ మాట్లాడుతూ.. ఫిష్ ఆంధ్రా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిలో పేటీఏంను భాగస్వామిని చేయడం గర్వకారణంగా ఉందన్నారు.