కాసేపట్లో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్‌

విశాఖపట్నం: మరికాసేపట్లో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. బొత్స నివాసానికి పెద్ద సంఖ్యలోవైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. పార్టీ నాయకులతో కలిపి ఇంటి  నుంచి కలెక్టరేట్‌కు బొత్స బయలుదేరనున్నారు.

కాగా, రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తుండగా, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. అభ్యర్థి ఎంపికపై ఆరు మంది సభ్యులతో చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేయగా.. అభ్యర్థి ఎంపికపై నేడు మరోసారి నాయకులు  సమావేశం కానున్నారు. బొత్స పై పోటీకి స్థానిక నాయకులు ముందుకు  రాలేదు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా   కొత్తగా దిలీప్ చక్రవర్తి పేరు తెరపైకి రాగా, ప్రచారంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ దూసుకుపోతున్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీకి మరింత బలం పెరిగింది. ఆరు వందలకుపైగా ఓటర్లతో ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39 మంది జెడ్‌పీటీసీల్లో ప్రస్తుతం 36 మంది జెడ్‌పీటీసీ ఉన్నారు. అల్లూరి జిల్లాకు చెందిన హుకుంపేట జెడ్‌పీటీసీ రేగం మత్స్యలింగం అరకు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావికమతం జెడ్‌పీటీసీ తలారి రమణమ్మ, సబ్బవరం జెడ్‌పీటీసీ తుంపాల అప్పారావు చనిపోయారు. ప్రస్తుతం ఉన్న జెడ్‌పీటీసీల్లో వైయ‌స్ఆర్‌సీపీకి 34 మంది, టీడీపీకి నర్సీపట్నం జెడ్‌పీటీసీ, సీపీఎంకి అనంతగిరి జెడ్‌పీటీసీ ఉన్నారు. మొత్తం 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు. 

Back to Top