న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్ విభాగానికి మాత్రమే నిధులు కేటాయించబోతున్నట్లు జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. 2017-18 ధరల ప్రాతిపదికపై పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి రెండవసారి సవరించిన అంచనా వ్యయం మొత్తం రూ.55,548 కోట్లను 2019 ఫిబ్రవరిలో జరిగిన సలహా సంఘం సమావేశం ఆమోదించినట్లు తెలిపారు. తదుపరి దీనిని పరిశీలించిన రివైజ్డ్ కాస్ట్ కమిటీ సవరించిన అంచనా వ్యయంలో కేవలం ఇరిగేషన్ విభాగానికి అయ్యే ఖర్చు మొత్తం రూ.35,950 కోట్లకు మాత్రమే ఆమోదం తెలుపుతూ మార్చి 2020న నివేదికను సమర్పించింది. దీనిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) తుది సిఫార్సుల అనంతరం ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ తీసుకోవడం జరుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు. 2014 ఏప్రిల్ 1 నుంచి పోలవరం ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్ విభాగం పనులకు అయ్యే వ్యయాన్ని నూటికి నూరు శాతం భరించడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తదనుగుణంగా పోలవరం పనుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చుకు సంబంధించిన బిల్లులను పీపీఏ, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) పరిశీలించి, సిఫార్సు చేసిన మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి రీయంబర్స్ చేస్తున్నట్లు చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి 11,600 కోట్ల రూపాయలను రీయంబర్స్ చేసింది. అదనంగా మరో 711 కోట్ల రూపాయల రీయంబర్స్‌మెంట్ కోరుతూ ఇటీవలే పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫార్సు చేసినట్లు మంత్రి చెప్పారు. కాచ్ ద రైన్ క్యాంపెయిన్ కింద ఏపీలో 7 లక్షల 97 వేల పనులు.. జలశక్తి అభియాన్: కాచ్ ద రైన్ క్యాంపెయిన్ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 7 లక్షల 97,502 పనులు నిర్వహించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. జలశక్తి అభియాన్ ప్రారంభించిన ఈ క్యాంపెయిన్ కింద జల సంరక్షణ, వర్షపు నీటి సంరక్షణ, సాంప్రదాయ నీటి వనరులు, చెరువుల పునరుద్దరణ, బోరు బావుల పునరుద్దరణ, వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్, అడవుల పెంపకం, శిక్షణా కార్యక్రమాలు, కిసాన్ మేళాల నిర్వహణ వంటి పనులను దేశ వ్యాప్తంగా చేపడుతున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.