తిరుపతి: తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు మొదటి ముద్దాయి సీఎం చంద్రబాబేనని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. తిరుపతిలో ఈ తరహా ఘటన ఎప్పుడూ జరగలేదు. మనం చూడలేదన్నారు. ఈ ఘటన ఎందుకు జరిగిందనేది ఆలోచన చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు కనీపం రూ. 50 లక్షల ఇవ్వాలి. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారు ఇంటికి వెళ్లేటప్పుడు రూ. 5 లక్షలు ఇవ్వాలని వైయస్ జగన్ డిమాండ్ చేశారు. గాయపడ్డ క్షతగాత్రులను తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో వైయస్ జగన్ పరామర్శించి.. అక్కడే మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ ఏమన్నారంటే.. – తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలోనే లేదు. తొక్కిసలాటకు ఇంత మంది బలి కావడం గతంలో ఎప్పుడూ చూడలేదు. కానీ, ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణాలు చూస్తే.. – ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం కొన్ని లక్షల మంది వస్తారు. – ఆరోజు స్వామి వారిని దర్శిస్తే, మహా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే లక్షల మంది తరలి వస్తారు. – ఆ దర్శనం కోసం టోకెన్లు ఇచ్చే కౌంటర్ల వద్ద ఎందుకు సెక్యూరిటీ కల్పించలేదు? – టీటీడీ అధికారులు మొదలు జిల్లా కలెక్టర్ వరకు అందరూ దీనికి బాధ్యులు. – చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో మూడు రోజులు 6వ తేదీ నుంచి 8వరకు పర్యటించారు. ఆరోజు మధ్యాహ్నం వరకు ఆయన కుప్పంలోనే ఉన్నారు. మొత్తం సెక్యూరిటీ ఆయన దగ్గరే ఉంది. – 8వ తేదీ రాత్రి 8.30 గం.కు టోకెన్లు మొదలు పెట్టారు. లక్షల మంది వచ్చినా, తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. – బైరాగి పట్టెడలోని రామానాయుడు స్కూల్‌లో ఏర్పాటు చేసిన టోకెన్ సెంటర్ వద్ద, భక్తులను ముందు పార్కులోనే ఉంచేసి, రాత్రి ఒకేసారి వదిలేశారు. – నిజానికి ఆ పార్కులో భక్తులకు కనీస సదుపాయాలు కల్పించలేదు. – పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులను కట్టడి చేసేందుకు తగిన సంఖ్యలో పోలీసులు లేరు. ఉన్న కొద్దిమంది పోలీసులు వారిని నియంత్రించలేకపోయారు. – ఇంత జరిగినా, సీఎం చంద్రబాబు పద్ధతి లేకుండా మాట్లాడారు. ఎఫ్‌ఐఆర్ కూడా తప్పులతడకగా నమోదు చేశారు. – టీటీడీ అనేది ఒక గొప్ప వ్యవస్థ. వైకుంఠ ఏకాదశి రోజున లక్షల మంది వస్తారు. – సీఎం చంద్రబాబు మొదలు, కలెక్టర్, ఎస్పీ, టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసులు.. అందరూ ఈ దుర్ఘటనకు బాధ్యులే. – ఇది సీఎం చంద్రబాబు సొంత జిల్లా. అయినా టీటీడీ బాధ్యతారహితంగా వ్యవహరించింది. – దుర్ఘటనలో ఇప్పటికే ఆరుగురు చనిపోయారు. ఉజ్జాయింపు లెక్కల ప్రకారం చూస్తే కనీసం 50 నుంచి 60 మంది గాయపడ్డారు. – గతంలో ఏనాడూ తిరుపతిలో ఇంత దారుణ ఘటన జరగలేదు. ఇది పూర్తిగా టీటీడీ, ప్రభుత్వ వైఫల్యమే. – తిరుపతికి లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా, వారికి ఏ విధంగా వసతులు కల్పించాలి? ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు కానీ, టీటీడీ ఛైర్మన్ కానీ ఆలోచించలేదు. – భక్తులకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. తాగడానికి మజ్జిగ కూడా సరఫరా చేయలేదు. – అన్ని తప్పులు చేసినా, ఏదో గొప్పగా చేశామని ఈరోజు చెబుతున్నారు. క్యూ లైన్లలో ఉన్న వారికి కనీసం ఆహారం లేదు. నీళ్లు కూడా ఇవ్వలేదు. – ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. ఘటనకు పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత. – ఘటనలో చనిపోయిన వారికి కనీసం రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. – గాయపడిన వారికి పూర్తి వైద్యం చేయడంతో పాటు, ఇంటికి పంపే సమయంలో కనీసం రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలి. ఇది మా డిమాండ్. – సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్, ఈఓ, ఏఈఓ, జిల్లా ఎస్పీ, కలెక్టర్.. వీరందరిదీ ఈ ఘటనకు బాధ్యులు. కాబట్టి వారందరిపై చర్య తీసుకోవాలి. ఇంకా, హోం మంత్రి, దేవాదాయ మంత్రుల బాధ్యత కూడా ఉంది. – ఇక వీరి ఎఫ్‌ఐఆర్ చాలా దారుణంగా ఉంది. – బీఎన్‌ఎస్ 194 సెక్షన్ పెట్టారు. అది పూర్తిగా తప్పు. సెక్షన్ 105 నమోదు చేయాలి. – చంద్రబాబు సీఎం అయ్యాక, టీటీడీ ప్రతిష్ట దెబ్బ తింటోంది. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. – శ్రీవారి లడ్డూ ప్రసాదంపైనా దుష్ప్రచారం చేశారు. ఇవాళ కూడా ఆయన చర్య వల్లనే ఈ ఘటన జరిగింది. – నిజానికి క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో టీటీడీకి ఎంతో పేరుంది. – కానీ ఈరోజు తిరుమలకు రావాలంటే, భయపడే పరిస్థితి వచ్చింది. – తమిళనాడులో శ్రీరంగం అనే క్షేత్రం ఉంది. అక్కడికి కూడా భక్తులు చాలా మంది వెళ్తారు. మరి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చూడండి. – చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదు. అందుకే తిరుమల ప్రసాదంపై కూడా ఆరోపణలు చేశారు. అబద్ధాలు ప్రచారం చేశారు. – పోలీసులు మొత్తం చంద్రబాబు సేవలోనే ఉన్నారు. ఆయన మూడు రోజులు కుప్పంలో మకాం వేస్తే, పోలీసులు మొత్తం ఆయన భద్రతలోనే ఉన్నారు. – దీంతో తిరుపతిలో తగిన సంఖ్యలో పోలీసులు లేరు. ఇది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. – అందుకే తిరుపతి తొక్కిసలాట ఘటనకు కచ్చితంగా సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్, అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీనే బాధ్యులు. – చంద్రబాబు నిర్వాకం వల్ల గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు 29 మంది చనిపోయారు. కేవలం ఆయన పబ్లిసిటీ పిచ్చి కోసం అంత మందిని బలి తీసుకున్నారు. – నేను ఇక్కడికి వస్తానని, వాస్తవాలు ప్రజలకు చెబుతానని భయపడి నేను ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలని చూశారు. – నేను ఆస్పత్రికి రాకుండా చేయాలని చూశారు. నన్ను ట్రాఫిక్‌లో ఆపి, నా కాన్వాయ్ ఆస్పత్రికి రావొద్దన్న కుట్ర చేశారు. – చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని తరలించాలని చూశారు. వారు ఎదురు తిరగడంతో ఊర్కున్నారు. – అప్పటికి కొందరు పేషెంట్లను బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. – ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదం. సీఎం మొదలు, టీటీడీ అధికారులు, ఛైర్మన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్ అందరూ బాధ్యులే. అందుకే వారందరిపై కచ్చితంగా చర్యలు చేపట్టాలి. – తొక్కిసలాటను తక్కువ చేసి చూపుతూ, తప్పుడు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బీఎన్‌ఎస్ 194–సెక్షన్‌కు బదులు బీఎన్‌ఎస్ 105– సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. – దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. – గాయపడిన వారికి మంచి వైద్యం అందించడంతో పాటు, డిశ్చార్జ్ సమయంలో కనీసం రూ.5 లక్షల చొప్పున సాయం అందించాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండు చేశారు.