కాకినాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పిఠాపురం చేరుకున్నారు. కాసేపట్లో వరద ప్రభావి ప్రాంతాల్లో వైయస్ జగన్ పర్యటించనున్నారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం పర్యటించనున్నారు. వరద బాధితులను పరామర్శించనున్న వైయస్ జగన్. పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైంది. ప్రధానంగా మూడు నియోజకవర్గాలపై ఏలేరు విరుచుకుపడి వివిధ వర్గాల ప్రజలు, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుతుందని ప్రభుత్వం ముందస్తు అంచనాకు రాలేకపోవడంతోనే ఇంతటి విపత్తు సంభవించిందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఏలేరు వరదతో ఒక సీజన్ మొత్తాన్ని కళ్లెదుటే చేజేతులా వదిలేసుకున్నామని ఈ ప్రాంత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఏలేరు విధ్వంసానికి జిల్లాలో పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లోని రైతులు ఏకంగా 35 వేల మంది కుదేలైపోయారు. ఏలేరు వరది తీవ్రత గడచిన పదేళ్లలో ఇంతలా ఎప్పుడూ చూడని రైతుల గుండెలను ఒక్కసారిగా పిండేసింది. ఒకటా, రెండా ఏకంగా 80 వేల ఎకరాలపై చిలుకు వరితో పాటు ఇతర వాణిజ్య పంటలను నిండా ముంచేసి రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది.