నా మతం మానవత్వం.. 

డిక్లరేషన్‌లో రాసుకోండి:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది

దేవుడి దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునేందుకు నోటీసులు

లడ్డూ వివాదంలో డైవర్షన్‌ కోసమే ఇవన్నీ చేస్తున్నారు

లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ బాబు అడ్డంగా దొరికిపోయారు

బాబు హయాంలో 15 సార్లు, మా హయాంలో కూడా 18 సార్లు నెయ్యి ట్యాంక‌ర్లు వెనక్కి పంపాం

కల్తీ నెయ్యి ప్రసాదాలకు వాడలేదని ఈ నెల 20న ఈవో చెప్పారు

భక్తుల్లో అనుమానపు బీజాలు వేయడం దుర్మార్గం కాదా?

తాడేపల్లి: నా మతం ఏమిటని అడుగుతున్నారు.. నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి అంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. నా కులం, మతం ఏంటో ప్రజలందరికి తెలుసు. నా మతం మానవత్వం. నాలుగు గోడల మధ్య నేను బైబిల్‌ చదువుతా. బయటకు వెళ్తే  అన్ని మతాలను గౌరవిస్తా. హిందుమత ఆచారాలను పాటిస్తా. ఇస్లాం, సిక్కు మత సంప్రదాయాలను గౌరవిస్తాన‌ని ఉద్ఘాటించారు. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలపై  అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

 రాష్ట్రంలో రాక్షస రాజ్యం:
    రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది. దేవుడి దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం నా రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదు. దేవుడి దర్శనానికి వెళ్తుంటే కూడా అడ్డుకుంటున్నారు. అందుకే ఇది రాక్షస రాజ్యం.ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులకు నోటీసులు ఇచ్చారు.
ఇక ఆ నోటీసులో ఏం రాశారంటే అంటూ.. చదివి వినిపించారు.
‘మాజీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారి తిరుమల తిరుపతి సందర్శనకు, సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున, మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో, మరియు మీ సొంత వాహనాల్లో బయలుదేరి తిరుపతి చేరుకుని, వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమంలో పాల్గొనడం, చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తున్న నోటీస్‌’.
    అంటే, జగన్‌ అనే వ్యకి మాజీ ముఖ్యమంత్రి. ఆయన తిరుమల తిరుపతి దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తుంటే, అందుకు మీకు పర్మిషన్‌ లేదు. మీరు వెళ్తే అరెస్టు చేస్తామని నోటీసులు ఇస్తున్నారు.
ఒక్కసారి ఆలోచనే చేయండి.
    ఏ ప్రపంచంలో ఉన్నాం. ఇది రాక్షస రాజ్యం కాదా? ఒకవైపున ఏమో, నన్ను వెళ్లనీయకుండా, వైయస్సార్‌సీపీ శ్రేణులు వెళ్లకుండా నోటీసులు ఇస్తున్నారు. మరోవైపున టీవీల్లో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులను రప్పిస్తున్నారు. ఇది పార్టీ నాయకత్వానికి తెలుసో? లేదో?
    వేల మంది పోలీసులను మొహరించారు. ఎందుకంతగా టాపిక్‌ డైవర్ట్‌ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు? టాపిక్‌ డైవర్షన్‌ కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు?.

చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌:
    తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలు అని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తున్నాయి.  ఆ కనిపించే నేపథ్యంలో, 100 రోజుల పాలన మీద డైవర్ట్‌ చేస్తూ, లడ్డూల టాపిక్‌ తీసుకొచ్చారు. అడ్డగోలుగా తప్పు చేసి, గుడి పవిత్రత దెబ్బతీస్తూ అడ్డంగా దొరికిపోయే సరికి, లడ్డూల టాపిక్‌ను డైవర్ట్‌ చేసేందుకు కొత్తగా డిక్లరేషన్‌ టాపిక్‌ తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు.
    ఒకసారి గమనించినట్లయితే, తిరుమల పవిత్రత, స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్భుద్ధితో, జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారైనట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్లుగా.. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా.. నిజంగా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్దాలు ఆడుతూ, అసత్యాలు పలుకుతూ.. స్వామి వారి పేరు ప్రఖ్యాతలను, తిరుపతి లడ్డూ విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం, సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రి చేస్తుంటే.. ఇంత కంటే దారుణం, అధర్మం ఎక్కడైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి.
    ఒకసారి వాటికి సంబం«ధించిన అన్ని విషయాలు చెబుతాను. చంద్రబాబు అనే వ్యక్తి ఏ రకంగా అబద్దాలు చెప్పి, రెక్కలు కట్టాడనేది ఆధారాలతో చూపిస్తా. దీన్ని రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలంతా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాను.

అది రొటీన్‌ ప్రాసెస్‌:
    తిరుమలలో లడ్డూల కోసం నెయ్యి కొనుగోల చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకోసారి రొటీన్‌గా, దశాబ్ధాలుగా జరుగుతోంది. ఆరు నెలలకు ఒకసారి ఈ–టెండర్‌ పిలుస్తారు. అర్హులు బిడ్‌ వేస్తారు. ఇప్పుడు కొత్తగా నియమాలు పెట్టలేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తిరుపతి లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ టేస్ట్‌ మరెక్కడా ఉండదు. ఆరు నెలలకోసారి ఈ–టెండర్‌. బిడ్లు వేస్తే, ఎల్‌–1 గా వచ్చిన వారికి టెండర్‌ ఖరారు చేస్తారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు.
    టీటీడీ బోర్డు ఒక ప్రసిద్ధి గాంచిన బోర్డు. అందులో సభ్యుల కోసం కేంద్ర మంత్రులు, చుట్టుపక్కల రాష్ట్రాల సీఎంలు కూడా రికమెండ్‌ చేస్తారు. వారి వారి రాష్ట్రాల్లో ప్రముఖులను సిఫార్సు చేస్తారు. అంత మంచి లక్షణాలు ఉన్న వారితో బోర్డు ఏర్పాటవుతుంది. వారంతా ప్రసిద్ధి పొందిన వారు. దేవుడికి ఇంకా సేవ చేయాలని, భక్తులకు మంచి చేయాలని నిర్ణయాలు తీసుకుంటారు. చెడు చేయాలన్నా చేయబోరు.
    అక్కడ నెయ్యి సరఫరా కోసం ఆరు నెలలకోసారి ఈ–టెండర్లు పిలుస్తారు. ఎల్‌–1గా వచ్చిన వారికి కూడా పూర్తి టెండర్‌ ఖరారు చేయరు. 65 శాతం వారికిచ్చి, మిగతా వారిని కూడా రేటు తగ్గించమని చెప్పి, వారికి టెండర్‌ ఇస్తారు. 

సరఫరాలో రొబస్ట్‌ పద్ధతి:
    తిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో కూడా రొబస్ట్‌ (ధృఢమైన) విధానం ఉంటుంది. నెయ్యి సరఫరా చేసేవారు, ప్రతి ట్యాంకర్‌తో ఎన్‌ఏబీఎల్‌ (నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ క్యాలిబ్రేషన్‌ ల్యాబరేటరీస్‌) సర్టిఫై చేసిన ల్యాబ్‌ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ తీసుకొస్తారు. అలా వచ్చిన నెయ్యిని కూడా ప్రతి ట్యాంకర్‌ నుంచి శాంపిల్‌ తీసి, మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్‌ అయితేనే, ట్యాంకర్‌ను ముందుకు పంపుతారు. ఒక్క టెస్టు ఫెయిల్‌ అయినా ట్యాంకర్‌ను వెనక్కు పంపిస్తారు.
    చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య 14 నుంచి 15 ట్యాంకర్లు అలా వెనక్కు పోయారు. అంటే ఎవరూ తప్పు చేయని విధంగా అక్కడ రొబస్ట్‌ విధానం ఉంది. మా ప్రభుత్వ హయాంలో కూడా 18 ట్యాంకర్లు వెనక్కు పంపారు. ఏ సరుకైనా సరే, క్వాలిటీ టెస్టులో ఫెయిల్‌ అయితే వెనక్కు పంపిస్తారు.

ఇప్పుడు ఏం జరిగింది?:
    ఇప్పుడు కూడా అదే జరిగింది. టీటీడీ ట్రస్ట్‌ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్‌ 12 నుంచి సరఫరా మొదలుపెట్టారు. అంటే, అప్పటికే చంద్రబాబుగారి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాతే నెయ్యి సరఫరా మొదలైంది. అలా జూన్‌ 12, జూన్‌ 21, జూన్‌ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టుల్లో పాస్‌ అయి, ముందుకు కదిలాయి. వాటిని లడ్డూల తయారీలో వాడారు.
    ఆ తర్వాత జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 12న మరో రెండు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి, టీటీడీ టెస్టుల్లో ఫెయిల్‌ కావడంతో, వెనక్కు పంపడానికి సిద్ధం చేశారు. మరోసారి ఆ శాంపిల్స్‌ పరీక్ష కోసం మామూలుగా మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐ (సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)కు పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌)కి పంపారు. ఇది టీటీడీ చరిత్రలో తొలిసారి. టీటీడీ పంపించిన శాంపిల్స్‌పై ఎన్‌డీడీబీ వారు జూలై 23న రిపోర్ట్‌ పంపారు. నెయ్యిలో కల్తీ ఉందన్న విషయం చెప్పారు. దాంతో ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అలా 4 ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీకి షోకాజ్‌ నోటీస్‌ కూడా ఇచ్చారు.

ఇప్పుడు నేను అడుగుతున్నాను:
    ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా, రెండు నెలల తర్వాత సెప్టెంబరు 18న, చంద్రబాబుగారు ఆ నెయ్యిని వాడారని ఉద్దేశపూర్వకంగా ఎందుకు అన్నారు?. ఇప్పుడు ఒకసారి, చంద్రబాబు నియమించిన టీటీడీ ఈఓ, ఆ నెయ్యి నాణ్యత గురించి జూలై 23న ఏమన్నారో చూద్దాం అంటూ.. ఆ వీడియో చూపారు.
    ఆ రెండు ట్యాంకర్లను రిజెక్ట్‌ చేశాం. షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చామని, వాటిలో వనస్పతి ఆయిల్‌ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్‌ క్లియర్‌గా ఈఓ చెప్పినా.. రెండు నెలల తర్వాత చంద్రబాబుగారు సెప్టెంబరు 18న ఏ రకంగా అబద్ధాలు మాట్లాడారో చూడండి.. అంటూ ఆ వీడియో కూడా ప్రదర్శించి చూపారు.
    ఘీకి బదులు జంతువుల కొవ్వు వాడారని, లడ్డూలు తయారు చేశారని, వాటిని భక్తులు తిన్నారని అన్నీ తెలిసినా, చంద్రబాబు అబద్దాలు చెప్పారు.

టీడీపీ ఆఫీస్‌లో కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌!:
    చంద్రబాబుగారు సెప్టెంబరు 18న ఆ ఆరోపణలు చేస్తే, ఆ మర్నాడే.. అంటే సెప్టెంబరు 19న తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను రిలీజ్‌ చేశారు. నిజానికి అది కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌. అయినా దాన్ని టీడీపీ ఆఫీస్‌లో రిలీజ్‌ చేశారు.
    ఆ వెంటనే, మర్నాడు, అంటే సెప్టెంబరు 20 టీటీడీ ఈఓ మళ్లీ ఏం మాట్లాడాడో చూద్దాం.. అంటూ వీడియో ప్రదర్శించారు.
    ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని తేలినందువల్ల, ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని చెప్పారు. అంతే కాకుండా, సెప్టెంబరు 22న ఈఓ, తాను స్వయంగా సంతకం చేసి, ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారని చెబుతూ.. అందులోని అంశాలు చదివి వినిపించారు.
    కల్తీ నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను వెనక్కు పంపాం. ఆ కంపెనీకి షోకాజ్‌ నోటీస్‌ కూడా ఇచ్చామని.. తమకు ఎన్‌డీడీబీ రిపోర్టు చాలా గోప్యమని అందులో ప్రస్తావించారు. అయినా దాన్ని, అంతకు ముందే తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో రిలీజ్‌ చేశారు.

అది అపవిత్రత కాదా?:
    మళ్లీ సెప్టెంబరు 22న మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, అవే పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కల్తీ నెయ్యి వాడారని చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి ప్రతిష్టను, శ్రీ వెంకటేశ్వరస్వామివారి ప్రసాద పేరు ప్రఖ్యాతలను, ఈ మాదిరిగా అబద్దాలతో తగ్గించడం, కుట్ర పూరితంగా వ్యవహరించడం.. అపవిత్రత కాదా?.

ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ డిస్‌క్లెయిమర్‌:
    పోనీ.. ఆ ఎన్‌డీడీబీ రిపోర్టు అయినా కచ్చితమైందా? అని చూస్తే, ఆ రిపోర్టులో వాళ్లే డిస్‌క్లెయిమర్‌ రాశారు.
    ‘నెయ్యిలో ఉండాల్సిన స్టాండర్డ్‌ వాల్యూ కన్నా.. శాంపిల్స్‌లోని స్టాండర్డ్‌ వాల్యూస్‌లో డీవియేషన్స్‌ ఉన్నాయి. అయినా, ఈ పరిస్థితుల్లో ఒక ఫాల్స్‌ పాజిటివ్‌ ఫలితం కూడా రావొచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే.. అంటూ.. పాల సేకరణ, ఆవులు, వాటి దాణ గురించి ప్రస్తావించారు. అలాగే ఆవులకు సరైన ఆహారం లేనప్పుడు, అవి సరిగ్గా తినకుండా బలహీనంగా ఉన్నప్పుడు తీసిన పాల నుంచి కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని రాశారు’.

పచ్చి అబద్ధాలు. అపవిత్రం కాదా?:
    ఇవన్నీ తెలిసినా చంద్రబాబు కావాలని అబద్దాలు ఆడుతూ, తిరుమల వెంకటేశ్వరస్వామివారి విశిష్టతను, ప్రసాదాల పవిత్రతను దగ్గరుండి, కావాలని అబద్దాలు చెప్పి, అనుమానపు బీజాలు ప్రసాదం స్వీకరించే ప్రతి ఒక్కరిలో లేపడం దుర్మార్గం కాదా? అపవిత్రం కాదా?
    నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తున్నావు. స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తున్నావు. జరగనిది జరిగినట్లుగా, జంతువుల కొవ్వుతో ప్రసాదం తయారు చేసినట్లుగా ఒక అబద్దాన్ని ప్రచారం చేస్తున్నావు. ధర్మమేనా?.

మీ హయాంలో ఎందుకు వాడలేదు?:
    నందిని బ్రాండ్‌ ఎందుకు వాడడం లేదని అంటున్నారు. మరి చంద్రబాబు పాలన సమయంలో 2015 నుంచి 2018 అక్టోబరు వరకు కెఎంఎఫ్‌కు చెందిన నందిని బ్రాండ్‌ నెయ్యి ఎందుకు లేదు? అప్పుడు కూడా టెండర్లు పిల్చారు కదా? నందిని వాళ్లు ఇష్టం వచ్చినప్పుడే టెండర్లలో పాల్గొంటారు. 

అప్పుడు ఇంత కంటే తక్కువ ధర:
    ఇంకొకరు అంటారు. రూ.320కి కిలో నెయ్యి ఎలా వస్తుందని అంటారు. మరి చంద్రబాబుగారి కూడా 2014–19 మధ్య నెయ్యిని ఏ ధరకు సేకరించారు? ఇప్పుడు కూడా అదే క్వాలిటీ నెయ్యి కదా? దశాబ్దాలుగా అదే క్వాలిటీ. అదే నెయ్యి. మరి చంద్రబాబు హయాంలో 2015లో కిలో నెయ్యిని రూ.276కి కొన్నారు. అదే 2019 జనవరిలో కిలో ఆవు నెయ్యిని రూ.324కు కొన్నారు. మరి ఇక్కడ రూ.320కి కొంటే తప్పేం జరిగింది?.

అదే చంద్రబాబు కుట్ర:
    మీ హయాం అంతా అవే రేట్లకు కొన్నారు. మరి ఇప్పుడు కూడా అవే ధరలు. చంద్రబాబు తన హెరిటేజ్‌ డెయిరీ కోసం, పాలు కార్టల్‌ ఫామ్‌ చేసి, నెయ్యి రేట్లు పెంచేసి, ఆ కార్టల్‌లో చంద్రబాబునాయుడు, హెరిటేజ్‌ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో, కొత్తగా రేట్లు పెంచడం కోసం మాట్లాడుతున్నాడు. అదే క్వాలిటీ నెయ్యి. అవే స్పెఫికేషన్స్‌. అప్పుడు ఇప్పుడూ ఒకటే. తిరుపతి లడ్డూ చాలా టేస్టు ఉంటుందని గొప్పగా చెప్పుకుంటాం. ఆ లడ్డూ అప్పుడూ, ఇప్పుడూ ఒకటే.
    చంద్రబాబుగారి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో, ప్రజలంతా కూడా ఆయనను వేలెత్తి చూపే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో.. లడ్డూ టాపిక్‌లో చంద్రబాబు చేసిన తప్పును ప్రశ్నించడం మొదలు పెట్టారో.. వారికి వాస్తవాలు తెలియడం మొదలైందో.. ఆ పెద్దమనిషి ఏం చేస్తున్నారు. 

నా డిక్లరేషన్‌ కోరడం ఏమిటి?:
    టాపిక్‌ డైవర్షన్‌ కోసం డిక్లరేషన్‌ అంటున్నాడు. జగన్‌ ఏమైనా కొత్తనా? రాజశేఖర్‌రెడ్డిగారు కొత్తనా? ఆయన ఏమిటో తెలియదా?
నా మతం ఏమిటో రాష్ట్రంలో కానీ, దేశంలో తెలియదా? నా కులం ఏమిటో తెలియదా? రాజశేఖర్‌రెడ్డిగారు సీఎంగా 5 ఏళ్లు వరసగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయన కొడుకునే కదా?
నేను గతంలో చాలాసార్లు వెళ్లాను కదా? సీఎం కాక ముందు కూడా వెళ్లాను కదా?.
    అంతెందుకు నా పాదయాత్ర మొదలుపెట్టే ముందు కూడా స్వామివారిని దర్శించుకున్నాను. 3648 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా, తిరుపతి నుంచి కొండ ఎక్కాను. స్వామివారిని దర్శించుకున్న తర్వాతే ఇంటికి వెళ్లాను. అప్పుడు ఉన్నది చంద్రబాబుగారి ప్రభుత్వం. నేను ప్రతిపక్ష నాయకుడిని. రెండుసార్లు స్వామివారిని దర్శించుకున్నాను కదా?.
    ఆ తర్వాత సీఎంగా వరసగా 5 ఏళ్లు, స్వామివారికి భక్తి శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాను కదా?
తొలిసారి ఎవరైనా వెళ్తుంటే, ఇలా అడగొచ్చు. కానీ 10, 11 సార్లు పోయిన తర్వాత, ఈరోజు నేను తిరుపతి వెళ్తానంటే. అడ్డుకుంటూ నోటీసులు ఇవ్వడం ఏమిటి?. డిక్లరేషన్‌ అడగడం ఏమిటి? మా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు నోటీసులు పంపడం ఏమిటి?.
    రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాను. 5 ఏళ్లు బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాను. ఎన్నోసార్లు స్వామి వారిని దర్శించుకున్నాను.

నా మతం మానవత్వం. అదే నా డిక్లరేషన్‌:
    ఈరోజు నేను వెళ్లకూడదట. కారణం నా మతం అంటున్నారు.
అసలు నా మతం ఏమిటని అడుగుతున్నాను. నాలుగు గోడల మధ్య నేను బైబిల్‌ చదువుతాను. తప్పేముంది? బయటకు పోతే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తాను. గౌరవిస్తాను. ఇస్లాంను అనుసరిస్తాను. గౌరవిస్తాను. సిక్కిజమ్‌ను అనుసరిస్తాను. గౌరవిస్తాను.
    నా మతం ఏమిటి అంటున్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్‌లో రాసుకుంటారేమో రాసుకొండి.
    దేశ రాజ్యాంగంలో ఏం చెప్పారు. నేను చదువుతాను వినండి.
‘ఇండియా ఈజ్‌ ఎ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌’.
సెక్యులర్‌ అంటే అర్ధం తెలుసా?. నీ మతం చెప్పకపోతే గుడిలోకి రావొద్దు అంటున్నావు. ఇది సెక్యులర్‌ దేశం అంటున్నాం.
    సీఎంగా పని చేసిన వ్యక్తి పరిస్థితి ఇలా ఉంటే, దళితుల పరిస్థితి ఏమిటి? దళితులను గుడిలోకి పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తాం?

చంద్రబాబును ఎందుకు సమర్థిస్తున్నారు?:
    మతం పేరుతో రాజకీయం చేయడం ఎంత దౌర్భాగ్యం? బీజేపీని అడుగుతున్నాను. తామే హిందుత్వానికి ప్రతినిధులం అంటారు. మిమ్మల్నే అడుగుతున్నాను.
    మీ కళ్ల ఎదుటే, మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే, శ్రీ వెంకటేశ్వరస్వామి విశిష్టతను, తిరుపతి లడ్డూ పేరు ప్రఖ్యాతలను, స్వామి వారి వైభవాన్ని, దగ్గరుండి అబద్ధాలు చెబతూ, జంతువుల కొవ్వు వాడకపోయినా, వాడి లడ్డూలు తయారు చేసినట్లుగా.. ఇన్ని ఆధారాలతో సహా, రుజువు అవుతున్నా.. అబద్ధాలతో దుష్ప్రచారం చేసి, వెంకటేశ్వరస్వామివారిని అపవిత్రం చేసిన ఈ వ్యక్తిని ఎందుకు మందలించడం లేదు? ఎందుకు వెనకేసుకొస్తున్నారు?.
    అంటే మీ వాళ్లు ఏం చేసినా ఫరవాలేదు. మిగిలిన వారు ఏం చేసినా తప్పే? ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇదెక్కడి హిందుత్వం?. హిందుత్వానికి మీకు టార్చ్‌ బేరర్స్‌ అంటారు. అందరూ ఆలోచించండి. నిజంగా హిందుత్వం ఏమిటంటే, మానవత్వం చూపడమే. అలా మానవత్వాన్ని చూపలేని వారు మంచి హిందువును అని చెప్పుకోలేరు.

తానే దోషి. తానే జడ్జీ. ఇదెక్కడి ధర్మం?:
    చంద్రబాబునాయుడే తప్పు చేస్తాడు. ఆయనే సిట్‌ వేస్తాడు. ఆయన చెప్పుచేతుల్లో ఉన్న అధికారులతో సిట్‌ అంటాడు. ఇదెక్కడి ధర్మం? ఇదెక్కడి పద్ధతి?. చంద్రబాబు ఈ మాదిరిగా హిందూ ధర్మం మీద దుష్ప్రచారం చేస్తూ, రాజకీయం చేయడం ధర్మమేనా? ఆలోచించండి.

ఇదే అందరికీ నా విజ్ఞప్తి:
    నేను గుడికి వెళ్లకపోయినా ఫరవాలేదు. కానీ, చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మన పార్టీ తరపున మీమీ ఊళ్లలో పూజలు చేయండి. తప్పు చేసింది మేం కాదు. చంద్రబాబు అని వేడుకొండి. అందుకే ఆ కోపాన్ని ప్రజలపై కాకుండా, చంద్రబాబుపై చూపమని వేడుకొమ్మని కోరుతున్నాను.
    ఒకవైపున మా నాయకులు, ప్రజాప్రతినిధులకు నోటీస్‌లు ఇస్తూ, హౌజ్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ కార్యకర్తలను రప్పించి, గొడవలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు.
అలా టాపిక్‌ను డైవర్ట్‌ చేసేందుకు, చంద్రబాబునాయుడు తాను చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నారు.

అందుకే నా పర్యటన వాయిదా:
    ఈ పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్లి, టాపిక్‌ డైవర్ట్‌ చేయడం ఇష్టం లేక, వెంకటేశ్వరస్వామిని ప్రేమించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా, టాపిక్‌ డైవర్ట్‌ కాకూడదనే ఉద్దేశంతో.. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని అబద్దాలతో, అవమానించి, అగౌరవపర్చాడో.. లడ్డూపై దుష్ప్రచారం చేశాడో.. చేసిన తప్పు ఆధారాలతోసహా కనిపిస్తున్న ఈ సత్యం బయటకు రావాలి.
    చంద్రబాబునాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. అది రాష్ట్ర ప్రజల మీదకు రావొద్దు. పాపం చేసిన చంద్రబాబు మీదే కట్టడి కావాలి.
దాని కోసం, టాపిక్‌ డైవర్ట్‌ కాకూడదన్న ఉద్దేశంతో నా పర్యటనను వాయిదా వేసుకున్నాను.

పూజలు చేయమని కోరుతున్నాను:
    రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్‌సీపీ అభిమానులే కాదు, ప్రజలందరిని కోరుతున్నాను. చంద్రబాబు చేసిన పాపం వల్ల, వెంకటేశ్వరస్వామికి కోపం వచ్చి రాష్ట్రం మీద చూపకుండా, కోపం కేవలం చంద్రబాబుమీదే చూపించే విధంగా పూజలు చేయండి.
    ఎందుకంటే, జరిగింది ఘోర అపచారం. వెంకటేశ్వరస్వామిని పలచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ.. జరగనిది జరిగినట్లుగా.. జంతువుల కొవ్వు వాడనిది వాడినట్లుగా, ఆ లడ్డూలు పంపిణీ చేసినట్లుగా.. పచ్చి అబద్దాలు ఆడుతూ, ఇంత ఘోరం చేసిన వ్యక్తి. ఆ పాపం కడగబడాలి. అందుకే అందరినీ కోరుతున్నాను. పూజలు చేయమని వేడుకుంటున్నాను.

ఏ మెస్సేజ్‌ ఇస్తున్నారు?:
    బీజేపీవారిలో సిన్సియారిటీ ఉంటే, ఇంత ఘోరం చేసిన చంద్రబాబును రిప్రిమాండ్‌ చేయకుండా, టీటీడీ పేరు ప్రఖ్యాతలు మంట కలిపిన ఈ వ్యక్తిని ఎలా ఉపేక్షిస్తున్నారు? ఎందుకు బుద్ధి చెప్పడం లేదు? ఎందుకు మందలించడం లేదు?. చేసింది మన వాడే అనుకుని వదిలేస్తే.. ఏ మెసేజ్‌ ఇస్తున్నట్లు?.
    మళ్లీ ఘోరమైన తప్పులు జరగొద్దు. అందుకు చంద్రబాబుకు తిట్లు పడాలి. మతాన్ని, దేవుణ్ని రాజకీయాల్లోకి తీసుకురాకుండా, ఆయనను మందలించాలి. సుప్రీంకోర్టు నుంచి ప్రధాని నుంచి పడాలి. అప్పుడైనా ఈ మనిషికి జ్ఞానం కలుగుతుందని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Back to Top