తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనమైందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పేదలకు ఇచ్చిన హామీలకు తగట్టుగా బడ్జెట్‌లో కేటాయింపులు జరగలేదు. ప్రతి పేద విద్యార్థిని సూపర్ స్టూడెంట్‌గా తీర్చిదిద్దాలని వైయస్ జగన్ తప్పించారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్‌తో తగిన కేటాయింపులు జరపలేదు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందంటూ ఆక్షేపించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆదిమూలపు సురేష్ ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు: విద్యావ్యవస్థ అస్తవ్యస్తం: – అధికారంలోకి వచ్చిన 5 నెలల తర్వాత నాలుగు నెలల కోసం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. ఎన్నికల్లో వారిచ్చిన హామీలు అమలు చేయబోవడం లేదన్నది తేటతెల్లం చేసింది. పథకాలకు చేసిన నామమాత్రపు, జీరో కేటాయింపులు దాన్ని రుజువు చేస్తున్నాయి. – హామీల అమలుపై కూటమి నాయకుల చిత్తశుద్ధి చూస్తే ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లుగా ఉంది. – చంద్రబాబు చెప్పే నాలెడ్జ్ ఎకానమీలో విద్యా వ్యవస్థకు స్థానం లేదా?. – డ్రాపవుట్స్ తగ్గించి, బడుల్లో చేరే వారిని పెంచాలనే (జీఈఆర్–గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) పెంచాలనే ఉద్దేశంతో తన మానస పుత్రికగా వైయస్ జగన్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకానికి ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వం చెప్పిన తల్లికి వందనం పథకం అమలు విషయంలో దారుణంగా విఫలమైంది. – నాడు అమ్మ ఒడి పథకంలో 83 లక్షల మంది పిల్లలకు మేలు చేస్తూ, 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో మొత్తం రూ.26 వేల కోట్లు జమ చేశాం. అంత మంది పిల్లలకూ మేలు చేస్తామంటూ, ప్రకటించిన తల్లికి వందనం పథకానికి రూ. 12,450 కోట్లు కావాల్సి ఉంటే అందులో సగం కూడా కేటాయించకపోవడం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడం, విద్యావ్యవస్థను నాశనం చేయడమే కాకుండా ఓటేసిన తల్లులను వంచించడమే. – నాడు–నేడు ద్వారా సుమారు 45 వేల గవర్నమెంట్ స్కూళ్లు, హాస్టళ్లు బాగు చేస్తే, ఇప్పుడు ఆ ఫలాలూ దూరం చేస్తున్నారు. – స్కూళ్లలో వసతుల లేక ఏ ఒక్క విద్యార్థి విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు కూడా బాగా చదువుకోవాలన్న సంకల్పంతో నాడు–నేడు కార్యక్రమంలో గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ బోర్డులు, టోటల్ ఫర్నీచర్, స్కూళ్లకు పెయింటింగ్, లైట్స్, ఫ్యాన్స్, రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, స్కూళ్లకు కాంపౌండ్స్, కిచెన్ వంటి అన్ని సదుపాయాలు కల్పించాం. – అదే విధంగా పిల్లలకు ఇంగ్లిష్ మీడియమ్‌లో బోధన, బైలింగ్వుల్ టెక్స్‌ట్‌బుక్స్, టోఫెల్ శిక్షణ, ఐబీ కరికులమ్ అమలు, 8వ తరగతి పిల్లలకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు, రోజుకో పౌష్టికాహార మెనూతో గోరుముద్ద, స్మార్ట్ టీవీలు.. ఇలా దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి, వేగంగా అడుగులు ముందుకు వేశాం. వాటిలో దేనికీ ఈ బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించలేదు. – డీఎస్సీ రాయడానికి ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల సహనాన్ని పరీక్షించేలా మరోసారి వచ్చే విద్యాసంవత్సరం అమలు చేస్తామని వారి ఆశలపై నీళ్లు చల్లారు. – 2019–24 మధ్య 15 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. 1998 డీఎస్సీ పోస్టుల్లో 4,059 మందికి ఉద్యోగం కల్పించాం. 2008 డీఎస్సీ పోస్టింగుల్లో 2193 మందికి న్యాయం చేశాం. – గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2018 డీఎస్సీ పోస్టింగుల్లో కేవలం 300 పోస్టులకు నియామకం చేసి వదిలేస్తే కోర్టు కేసులన్నీ క్లియర్ చేసి సుమారు 6,954 మందికి పోస్టింగులు ఇవ్వడం జరిగింది. – 2019 స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 602 మందికి పోస్టింగులు ఇవ్వడం జరిగింది. కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు 1200, 2024 డీఎస్సీ నోటిఫికేషన్‌లో 6100 పోస్టులతో కలిపి వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్లలో సుమారు 21,108 టీచర్ ఉద్యోగాల భర్తీకి అడుగులు పడిన మాట వాస్తవం కాదా?. – పేదరికం చదువుకు అడ్డు కాకూడదని దివంగత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే, ఆయన తనయుడు వైఎస్ జగన్ రైట్ టు ఇంగ్లిష్ ఎడ్యుకేషన్ అందించాలని విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు శ్రీకారం చుట్టారు. – విద్యాదీవెన, వసతి దీవెన కోసం మొత్తం సుమారు రూ.5 వేల కోట్లు పెండింగ్ ఉంటే.. బడ్జెట్‌లో చేసిన కేటాయింపులెన్ని? – గురుకులాలు, ట్రిపుల్ ఐటీల్లో కలుషితాహారంతో వేలాది విద్యార్ధులు ఆస్పత్రుల పాలయ్యారంటే ఎంత దారుణంగా పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారు!. – అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలను తీర్చిదిద్దాలన్న వైయస్ జగన్ ఆశయానికి తూట్లు పొడిచి విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఇది భావితరాలకు తీరని నష్టం చేస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గుర్తించాలి. వైయస్ జగన్ మీద కోపాన్ని పిల్లల మీద చూపించొద్దని హితవు పలుకుతున్నాం. – వాస్తవాలను వక్రీకరించి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, మరో శ్రీలంక అయిపోతోందని తప్పుడు ప్రచారం చేశారు. అలా మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేశారు. అయితే ఇది ఎంతో కాలం కొనసాగదని గుర్తుంచుకొండి.