ప్రశ్నించే స్వరం లేకుండా అణిచి వేస్తున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

అఘాయిత్యాలపై ప్రశ్నిస్తే..  తప్పుడు కేసులు

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

అన్ని వ్యవస్థలను నీరుగార్చి నాశనం చేస్తున్నారు 

సూపర్‌-6 లేదు సూపర్‌-7 లేదు

టీడీపీ అధికారిక వెబ్‌సైట్లో‌ చేసేవన్నీ ఫేక్‌ పోస్టులే

తప్పు చేసిన పోలీసులను సప్తసముద్రాల అవతల ఉన్నా వదలం: వైఎస్‌ జగన్‌​

రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి.. 
  

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి నెలకొన్నాయని.. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని ధ్వ‌జ‌మెత్తారు. ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు కాబట్టి ప్రశ్నించే స్వరం లేకుండా అణిచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా హామీల అమలు లేదని మండిపడ్డారు. ప్రతివర్గాన్ని మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం మోసం చేయని వారంటూ ఎవరూ ఏపీలో లేరని విమర్శలు గుప్పించారు. అన్ని వ్యవస్థలను నీరు గార్చి నాశనం చేస్తున్నారన్నారు.

అఘాయిత్యాలపై ప్రశ్నిస్తే..  తప్పుడు కేసులు. మద్యం మాఫియాపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. కరెంట్‌ ఛార్జీలపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. వరద సాయంపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. ఉచిత ఇసుకపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేస్తున్నారని అన్నందుకు.. తప్పుడు కేసు. అసలు జగన్‌ సృష్టించిన సంపదను ఎందుకు అమ్మేస్తున్నారు? అని ప్రశ్నిస్తే అక్ర‌మ కేసులు పెడుతున్నారు.  రాష్ట్రంలో వారం రోజులుగా జరుగుతున్న వైయ‌స్ఆర్‌సీపీ యాక్టివిస్టుల అరెస్టుల పర్వంపై గురువారం తాడేపల్లిలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 

 రాష్ట్రంలో చీకటి రోజులు:
– ఇలాంటి అన్యాయమైన పరిస్థితి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చూడలేదు. ఇవాళ రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి.
– ఎన్నికల్లో ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు? రెండింటికీ సంబంధం లేకుండా పోయింది. అందుకని ప్రశ్నించే గొంతు ఉండకూడదని భావిస్తున్నారు.
– అధికారంలోకి వస్తే సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ అన్నారు. 5 నెలలు గడిచాయి. సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ రెండూ లేవు. ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశారు.

అన్ని వ్యవస్థలు నాశనం:
– 5 నెలలుగా ఈ ప్రభుత్వం మోసం చేయని సెక్షన్‌ ఏదీ లేదు. ప్రతి సెక్షన్‌ను మోసం చేయడమే కాకుండా, అన్ని వ్యవస్థలను నీరుగార్చారు. వ్యవస్థలను నాశనం చేశారు.
– ప్రతి క్వార్టర్‌ ముగియగానే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలి. కానీ మూడు క్వార్టర్లు వచ్చాయి. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ .. విద్యాదీవెన ఇవ్వలేదు. పిల్లలు రోడ్డెక్కుతున్నారు. 
– కేవలం ఫీజు మాత్రమే కాకుండా, వసతి దీవెన ఇచ్చేవాళ్లం. విద్యా సంవత్సరం ముందు, ప్రతి ఏటా ఏప్రిల్‌లో ఇచ్చేవాళ్లం. ఇంకా విద్యా వ్యవస్థను నాశనం చేశారు. సీబీఎస్‌ఈ క్లోజ్‌ చేశారు. గోరుముద్ద పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది.
– అమ్మ ఒడి గాలికెగిరిపోయింది. విద్యా వ్యవస్థ నీరుగారిపోయింది.
వైద్య రంగాన్ని నాశనం చేశారు. ఆరోగ్యశ్రీ కింద బకాయిలు రూ.2400 కోట్లు దాటాయి.
– 108, 104 సర్వీసులు నడవడం లేదు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ గాలికెగిరిపోయింది. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో మందులు ఉన్నాయా? లేదా? పట్టించుకునే నాధుడే లేడు. 
– ప్రతి రంగంలో కూడా.. విద్య, వైద్యం, వ్యవసాయం.. అన్నింటా సేవలు లేవు. పారదర్శకత ఊసే లేకుండా పోయింది. మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చేశాయి.

ప్రభుత్వం టోటల్‌ ఫెయిల్‌:
– దాదాపు లక్షన్నర పెన్షన్లు తీసేశారు. కొత్త పెన్షన్ల నమోదు లేదు.
అలా అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిల్‌. గతంలో ఎప్పుడూ చూడని పరిస్థితి. 
– లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించిపోయింది. 5 నెలల్లో 91 అత్యాచారాలు. ఏడుగురు చనిపోయారు.
– సాక్షాత్తూ టీడీపీ కార్యకర్తలు ఆ పనులు చేస్తున్నా, కంట్రోల్‌ చేయకుండా, ప్రభుత్వం సపోర్ట్‌ చేస్తోంది.

అణిచివేత ధోరణి. ఇల్లీగల్‌ డిటెన్షన్స్‌:
– వరసగా అన్ని ఘటనలు జరుగుతుంటే, వాటిని ప్రశ్నిస్తున్న.. సమాజంలో ఉన్న మనలాంటి వాళ్లు మొదలుపెడితే.. సమాజస్పృహ ఉన్న వారు ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో చూడండి.
– ప్రశ్నించే స్వరం వినబడితే చాలు. ఇల్లీగల్‌ కేసులు. అరెస్టులు. ఇల్లీగల్‌ డిటెన్షన్స్‌.
– విజయవాడలో వరద సహాయ పనుల్లో ప్రభుత్వం ఫెయిలైందని ప్రశ్నిస్తే, కేసులు నమోదు.
– కోటి యాభై లక్షల మందికి ఫుడ్‌ మీద వందల కోట్లు ఖర్చు. క్యాండిళ్లు, మొబైల్‌ జనరేటర్లు, అగ్గిపెట్టెల ఖర్చు రూ.23 కోట్లు.
– ప్రశ్నిస్తే చాలు ఇల్లీగల్‌ డిటెన్షన్స్‌. మహిళలపై అత్యాచారాలు, హత్యలు.. ప్రశ్నిస్తే ఇల్లీగల్‌ డిటెన్షన్‌.
– ఇసుక ఫ్రీ అన్నారు. రేటు మాత్రం డబుల్‌. ఎవరి జేబులోకి ఇది వెళ్తోంది అంటే ఇల్లీగల్‌ డిటెన్షన్‌.
– ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మితే, దాన్ని ప్రశ్నిస్తే ఇల్లీగల్‌ డిటెన్షన్‌.
– కరెంటు ఛార్జీలు 5 ఏళ్లు పెంచబోమన్నారు. కానీ, ఇప్పటికే రూ.6 వేల కోట్ల భారం. వచ్చే నెల రూ.1100 కోట్ల భారం. ప్రశ్నిస్తే ఇల్లీగల్‌ డిటెన్షన్‌.
– అధికారంలోకి వస్తే, ప్రభుత్వ సంపద పెంచుతామన్నారు. ప్రశ్నిస్తే ఇల్లీగల్‌ డిటెన్షన్స్‌.
– మూడు పోర్టులు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. వాటినీ అమ్మేసే ప్రయత్నం. ప్రశ్నిస్తే ఇల్లీగల్‌ డిటెన్షన్‌.

అన్యాయంగా కేసుల నమోదు:
– ‘విద్య వద్దు. మద్యం ముద్దు’. ‘నాన్నకు ఫుల్‌. అమ్మకు నిల్‌’.. అని ఒక పిల్లవాడు పోస్ట్‌ చేస్తే.. ఇల్లీగల్‌ డిటెన్షన్‌. ఇందులో ఏం తప్పుంది? అయితే అది చంద్రబాబు, ఆయన అభిమానులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని కేసు నమోదు చేశారు.
– ‘జనసేన నేతలతో బలవంతంగా కాళ్లు పట్టించుకుంటున్న టీడీపీ నేతలు. ఇది అన్ని టీవీల్లో వచ్చింది. దాన్ని వారు పాపం ఫార్వర్డ్‌ చేస్తే, కేసు పెట్టారు.
– అన్యాయంగా కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు. వారం రోజులుగా దాదాపు 101 మందికి పైనే కేసు పెట్టారు.

సుప్రీంకోర్టు ఆర్డర్‌ బేఖాతరు:
– మామూలుగా ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు çసంబంధించి, సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 41–ఏ కింద నోటీసు ఇచ్చి విచారణ చేయాలని.
– నోటీసు ఇచ్చిన తర్వాత, నిజంగా అరెస్టు చేయాలంటే, ముందుగా వారెంట్‌ ఇష్యూ చేయాలి. తర్వాత మెజిస్ట్రేట్‌ పర్మిషన్‌ తీసుకోవాలి. ఇది సుప్రీంకోర్డు ఆర్డర్‌.
– ఏడేళ్లలోపు శిక్షపడే ప్రతి కేసు ఆ పద్ధతిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. కానీ, ఈరోజు ఏం చేస్తున్నారు? ఇల్లీగల్‌ డిటెన్షన్‌ చేస్తున్నారు.
– కేవలం 41–ఏ నోటీస్‌ ఇవ్వాలి. ఆ తర్వాత కూడా కావాలనుకుంటే, జడ్జి వద్ద వాదించాలి. అక్కణ్నుంచి ఆర్డర్‌ తీసుకురావాలి.
– కానీ, ఈరోజు ఏం చేస్తున్నారు? ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, రాత్రి పొద్దుపోయిన తర్వాత లేదా తెల్లవారుజామున ఇళ్ల నుంచి ఎత్తుకొస్తున్నారు.
– ఒక వ్యక్తి మీద ఏకకాలంలో పలు స్టేషన్లలో టీడీపీ సానుభూతిపరులతో ఫిర్యాదు చేయించి, అరెస్టు చేస్తున్నారు.
– ఒకవేళ వారు అందుబాటులో లేకపోతే, కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తీసుకొస్తున్నారు. నిజానికి ఆ అధికారం ఎవరికీ లేదు.
– నేరుగా సీఎం, ఆయన కొడుకు. ఇప్పుడు డిప్యూటీ సీఎం. డీజీపీ దగ్గరుండి ఇవన్నీ చేయిస్తున్నారు.
– వారికి వ్యతిరేకంగా ఉన్న స్వరాల మీద కేసులు పెడుతున్నారు. ఏమన్నా అంటే, తప్పుడు రాతలు రాస్తున్నారని అంటున్నారు. 

మరి వారినీ అరెస్టు చేయాలి కదా?:
– మరి తప్పుడు వార్తలపై మీకు అంత కోపం వస్తే, అదే మీరు జగన్‌మీద రాస్తున్నారు.
– రెండేళ్ల క్రితం మా అమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు బరస్ట్‌ అయితే, అది ఇప్పటిదని చూపుతూ, జగన్‌ వాళ్ల అమ్మను చంపాలని చూశాడని రాశారు.
– దీంతో అమ్మ మరో ప్రకటన ఇస్తే. అది ఫేక్‌అన్నారు. చివరకు మా అమ్మ విజయమ్మ వీడియో విడుదల చేసింది.
– మరి ఇందులో టీడీపీ వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు? ఎందుకు అరెస్టు చేయలేదు?. ప్రతి దాంట్లో వ్యక్తిత్వ హనన.
– ఆంధ్రజ్యోతిలో ఈరోజు రాశారు. కడప ఎస్పీకి నా భార్య ఫోన్‌ చేసిందని రాశారు. అది ఫేక్‌ కదా? మరి ఆం«ధ్రజ్యోతి రాధాకృష్ణను లోపల వేయాలి? వేస్తున్నారా?

పోలీసులూ మీ వృత్తిని కించపర్చకండి:
– అయ్యా డీజీపీ గారు, పోలీసులు.. మీకు ఒకటే చెబుతున్నా. మూడు సింహాలు మీ గుర్తు. మీ వృత్తిని కించపర్చకండి.
– మీ అ«ఘాయిత్యాలు చూస్తుంటే చాలా దారుణం. మీరు చేసే పనుల వల శాఖ పేరు మంటగలిసి పోతోంది.
– మీరు ఎంత దారుణంగా చట్టవిరుద్ధంగా అరెస్టు చేస్తున్నారంటే.. ఎంత దారుణం అంటే.. కొన్ని ఉదాహరణలతో కేసుల ప్రస్తావన.
– తెలంగాణలో ఉంటున్న వారిని కూడా అరెస్టు చేస్తున్నారు. నల్లగొండ, హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చారు.
– ఇప్పటి వరకు 101 మందిపై కేసు పెట్టారు. ఆ వివరాలు అప్‌లోడ్‌ చేయడం లేదు.

పదవీ వ్యామోహంతో దిగజారిన డీజీపీ:
– ఇది నిజంగా అరాచకం. పోలీసులు చట్టం, న్యాయంవైపు నిలబడాలి.
ఇప్పుడున్న డీజీపీ, మా ప్రభుత్వంలో మంచి పొజిషన్‌లో పని చేశారు. 
– కానీ, ఈరోజు పదవీ వ్యామోహం కోసం దారుణంగా దిగజారారు. పాలన గాడి తప్పి, లా అండ్‌ ఆర్డర్‌ దిగజారితే.. డీజీపీ అధికార పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నారు.
– గత ప్రభుత్వంలో పోలీసులు బాగా పని చేయలేదంటున్నారు. మరి ఆ ప్రభుత్వంలో ఆయన కూడా పని చేశారు కదా?
– మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు బాగా పని చేస్తున్నారా? దాదాపు 91 మంది అత్యాచారాలు జరిగాయి? ఎందుకు ఏడుగురు చనిపోయారు?
– చివరకు సోషల్‌ మీడియా యాక్టివిస్టులను కూడా ఇంత దారుణంగా, ఇల్లీగల్‌గా డిటెన్షన్‌ చేస్తున్నారు.
– సుప్రీంకోర్టు ఆదేశాలను వెటకారం చేస్తూ, ఎందుకు ఇల్లీగల్‌ డిటెన్షన్‌ ఎందుకు చేస్తున్నారు?

చూస్తూ ఊర్కోబోం. ఎక్కడున్నా రప్పిస్తాం:
– మీ ఇష్టానుసారం, మీ ఇష్టం వచ్చినట్లుగా మీ వ్యవహారం ఉంటే.. ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు.
– తప్పు చేస్తుంటే మేము చూస్తూ ఊర్కోబోం. ప్రతి పోలీస్‌ ఆఫీసర్‌ తప్పు చేసిన వారిపై ప్రైవేట్‌ కంప్లైంట్‌ చేస్తాం.
– ప్రతి బాధితుడు ప్రైవేట్‌ కంప్లైంట్‌ చేస్తాడు. వారికి మా పార్టీ అఫీషియల్‌గా సపోర్టు చేస్తుంది.
– అధికారం ఎల్లకాలం ఉండదు. జమిలీ అంటున్నారు. ఎన్నికలు త్వరలోనే రావొచ్చు. లేదా ఉండేది నాలుగేళ్లే.
– ఆ తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌ను దగ్గరుండి బయటకు తీస్తాం.
– ఏదో రిటైర్‌ అయి వెళ్లిపోతామనుకుంటున్నారో ఏమో.. రిటైర్‌ అయినా పిలిపిస్తాం.
– తిరుపతిలో సుబ్బారాయుడు ఉన్నాడు. ఆయన్ను చంద్రబాబు తెలంగాణ నుంచి పిలిపించుకున్నాడు. రిటైర్‌ కాగానే మళ్లీ తెలంగాణ వెళ్లిపోతామనుకుంటున్నాడేమో. అక్కడి నుంచి పిలిపిస్తాం.
– సప్త సముద్రాల అవుతల ఉన్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్‌ ఆఫీసర్‌కు చెబుతున్నాం. చూస్తూ ఊర్కోం. 
– చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. చేసిన తప్పులన్నీ బయటకు తీస్తాం. కోర్టు ఆర్డర్‌ ఖాతరు చేయకుండా, ఇల్లీగల్‌ డిటెన్షన్స్‌.. ఏవీ చూస్తూ ఊర్కోం.

ప్రతి కుటుంబం వద్ద రెడ్‌బుక్‌:
– వారొక్కరే కాదు, రెడ్‌బుక్‌ పెట్టుకోవడం. అది పెద్ద పని కాదు. ఇవాళ ప్రతి బాధిత కుటుంబం ఒక రెడ్‌బుక్‌ పెట్టుకుంటుంది.
– వారంతా వచ్చి తమ బాధ నాకు చెబుతారు. అప్పుడు నేను చూస్తూ ఊర్కోను. ఈ మాట నేను ప్రతి పోలీస్‌ సోదరుడికి చెబుతున్నాను. పోలీసులంటే గౌరవం ఉండాలి. 
– వ్యవస్థ బతకాలి. ఈరోజు వారుండొచ్చు. రేపు మనం రావొచ్చు.
– కానీ వ్యవస్థ అంటే గౌరవం ఉండాలి. వ్యవస్థ నీరు గారొద్దు. మన టోపీ మీద ఉన్న సింహాలకు గౌరవం ఇవ్వాలి. 
– ఈ మాదిరిగా రాజకీయ నాయకులు చెబుతున్నారని చెప్పి, తెలిసి తెలిసి తప్పు చేస్తూ ఉంటే, ప్రతి బాధితుడి ఉసురు తగులుతుంది. ఆ ఉసురు మంచిది కాదు.
– తప్పులు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తున్న ప్రతి పోలీస్‌ సోదరుడికి చెబుతున్నా.. ఇంకా తప్పులు చేయొద్దు.

డిప్యూటీ సీఎంకు ఆ ధైర్యం ఉందా?:
– సాక్షాత్తూ డిప్యూటీ సీఎం అనే వ్యక్తి.. లా అండ్‌ ఆర్డర్‌ ఈ స్థాయికి దిగజారింది అన్నారంటే.. ఆశ్చర్యం కలిగించే ఘటన. ఒక దళిత హోం మంత్రినే అంటారు.
– కానీ, నిజానికి లా అండ్‌ ఆర్డర్‌ ఎవరి వద్ద ఉంటుంది. సీఎం చంద్రబాబు వద్ద కదా? మరి ప్రశ్నిస్తే ఆయన్ను కదా అనాలి?
ఆమె దళితురాలు. ఏమన్నా పడుతుంది? అని అన్నావు.
– నీ సొంత నియోజకవర్గం, పిఠాపురంలో టీడీపీ నాయకుడు ఒక దళిత యువతిని డంప్‌యార్డు వద్దకు తీసుకెళ్లి, అత్యాచార యత్నం చేస్తే, నువ్వేం చేశావ్‌?
– చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు? ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం అంతకన్నా లేదు. ఏమన్నా అంటే సినిమా డైలాగ్‌లు. తోలు తీస్తానంటాడు.

– పోలీసులు వ్యవహరిస్తున్న తీరు.. న్యాయం, ధర్మం అనే పిల్లర్ల మధ్య పోలీసులు వ్యవహరించాలి.
– దురదృష్టవశాత్తూ కొందరు పోలీసులు చంద్రబాబు చెప్పినట్లు పని చేస్తున్నారు. కానీ, పోలీసులు న్యాయం, ధర్మం వైపు ఉండాలి.

సరస్వతి పవర్‌ ప్లాంట్‌. వాస్తవాలు:
– ఆ భూములకు సంబంధించి చెప్పాలంటే.. పవన్‌కళ్యాణ్‌ అక్కడికి మొన్న 5వ తేదీన వెళ్లాడు. అక్కడ సిమెంట్స్‌ కంపెనీ కోసం భూములు కొన్నాను. కంపెనీ పేరు సరస్వతి పవర్‌ ప్రాజెక్ట్‌.
– పవన్‌కళ్యాణ్‌ అక్కడికి వెళ్లడానికి ముందే, ఆయన ఆదేశాలతో లోకల్‌ ఎమ్మార్వో గత అక్టోబరు 26న అక్కడికి వెళ్లి, భూములు తనిఖీ చేసి, ఏమన్నారో చూద్దాం అంటూ.. ఫోన్‌లో వీడియో ప్రదర్శించారు.

– వెయ్యి చిల్లర ఎకరాలకు సంబంధించిన కధ ఆమె చెప్పింది. అవన్నీ పట్టా భూములని, అందులో కేవలం 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. 
– అయితే అది కూడా తీసుకోలేదని ఆమె స్వయంగా చెప్పారు. పైగా అందులో 2 ఎకరాలు కొండలు ఉన్నాయి. 
– దీనికి పవన్‌కళ్యాణ్‌ అక్కడికి పోవడం, ఏమేమో జరుగుతోందని మాట్లాడడం, విమర్శించడం.. ఆశ్చర్యం కలిగిస్తుంది.

– పక్కనే భవ్య సిమెంట్‌ వాళ్లు ఎకరా రూ.50 వేలకు కొన్నారు. రూ.50 వేల నుంచి రూ.90 వేల లోపు కొన్నారు.
– ఆ ధరకు వారు కొంటే, ఆ పక్కనే ఏడాది తర్వాత మనం ఎకరా రూ.3 లక్షలకు తక్కువకు కొనలేదు.
– గ్రామసభ పెట్టి, రేటు ఎంత కావాలని వారినే అడగమన్నాను. ఆ సభలో రైతులు ఎకరాకు రూ.2.75 లక్షలు కావాలంటే, నేను రూ.3 లక్షలు ఇవ్వమన్నాను. ఆ ధర ఇచ్చి కొన్నాం.

ఇంకా ఆ మనిషి అంటారు. ఏవో నీళ్లు అంట.
– నిజంగా నేను చెడ్డవాణ్ని అయితే.. ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి. మా దగ్గర అనంతపురం జిల్లాలో దివాకర్‌రెడ్డి ఉన్నారు. ఆయన తన ఇంట్లోని పనివాళ్ల పేరుతో కూడా భూమి తీసుకున్నాడు.
– కానీ, నేను రైతులను సంతోషపెడుతూ, వారు అడిగిన దానికంటే ఎక్కువ ధర ఇచ్చి భూములు కొన్నాను.

పవన్‌ ఇంకా నీళ్లు అంటాడు.
– ఔను. సిమెంట్‌ ఫ్యాక్టరీ పెడితే, అక్కడ పని చేసే వారికి, కంపెనీకి నీళ్లు వద్దా? నిజానికి స్టీల్‌ ప్లాంట్‌ మాదిరిగా సిమెంట్‌ కంపెనీకి నీళ్లు అంత అవసరం ఉండదు.
– అసలు ప్రభుత్వ డ్యూటీనే అది. ఎవరైనా కంపెనీ పెడితే నీరు, పవర్‌ ఇవ్వడం బాధ్యత.

– ఇంకా మైన్స్‌ లీజ్‌ గురించి కూడా పవన్‌ మాట్లాడారు. నీకు నాలెడ్జ్‌ ఉందో లేదో నాకు తెలియదు. నీవు మంత్రివి.
– 2015లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని సవరించింది. అందులో వివరాలు ఇవీ.. అంటూ గనుల లీజ్‌కు సంబంధించిన నియమ, నిబంధనలు చదివి వినిపించారు. ఎక్కడైనా 50 ఏళ్లకు గనులు లీజ్‌కు ఇస్తారు.

– నిజానికి 2014లో చంద్రబాబు సీఎం కాగానే, మైనింగ్‌ లీజ్‌ను క్యాన్సల్‌ చేస్తే, నేను కోర్టుకు వెళ్తే, ప్రభుత్వ నిర్ణయంపై కోర్టు 2015లో స్టే ఇవ్వడమే కాకుండా, 2019 నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చంద్రబాబు చేసింది తప్పు అని, అన్నీ తిరిగి ఇవ్వమని చెప్పింది.

పరిశ్రమలు రావొద్దని అంటున్నారు:
– పరిశ్రమలు రావాలని అంతా అనుకుంటారు. కానీ వీరేం చేస్తున్నారు. – కంపెనీలు రావొద్దని తరిమేస్తున్నారు. పరిశ్రమలు రాకూడదని అడుగులు వేస్తున్నారు.
– అక్కడ కడపలో సజ్జన్‌ జిందాల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మందుకు వచ్చి, భూమి పూజ కూడా చేశారు. ఆయన్ను ప్రోత్సహించాల్సింది పోయ, జెత్వానీని తీసుకొచ్చి, కేసులు పెట్టించారు. ఆమె వృత్తి రీత్యా నేరస్తురాలు. కానీ ఆమె ద్వారా జిందాల్‌ను బెదరగొట్టారు.
– అక్కడేమో ఆర్సిల్లర్‌ మిట్టల్‌ కంపెనీ వస్తోందని తప్పుడు ప్రచారం. కానీ ఒడిషా సీఎం చెప్పారు. ఆ కంపెనీ తమ దగ్గర ఆ కంపెనీ పెడుతున్నారని.
– 24 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ఫీల్డ్‌ కంపెనీ. పెట్టుబడి రూ.1.04 లక్షల కోట్ల పెట్టుబడి. వారు ఇప్పటికే ఒడిషాలో ప్లాంట్‌ పెడుతున్నారు.
– అక్కడ బీజేపీ ప్రభుత్వం. అక్కడ ఇప్పటికే పనులు మొదలయ్యాయి. 
– మరి అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా? పైగా రూ.1.60 లక్షల కోట్లు అట. అబద్ధాలకైనా హద్దు ఉండాలి కదా?.
– మైక్రోసాఫ్‌ వస్తోంది. బులెట్‌ ట్రెయిన్‌ వచ్చింది. ఒలింపిక్స్‌ మేమే నిర్వహిస్తున్నాం అని ప్రచారం. ఏమిటా మాటలు?

– ఒక పక్క జిందాల్‌ రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫౌండేషన్‌ కూడా వేస్తే, ఆయన్ను బెదరగొడుతున్నారు.
– నా సరస్వతి పవర్‌ పనులు ఎందుకు జరగలేదు? కారణం మీరు కాదా? కోర్టుకు వెళ్లింది మీరు కాదా? ఎవరైనా కంపెనీలను ప్రోత్సహించాలి.
– తన వాడైతే చాలు ప్రమోషన్‌. తనకు ఇంతో అంతో వస్తుంది అంటే ప్రమోషన్‌. తన వాడు కాకపోతే, దాన్ని ఆపేయాలి. రాకుండా చేయాలి. అక్కణ్నుంచి ఏదీ రాదంటే.. ఏదీ రాకూడదు. ఏమిటా ఆలోచన.

అసెంబ్లీ సమావేశాలు. వైఖరి:
– అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి, మీరే చెప్పండి. మొదటి సమావేశాల్లోనే స్పీకర్‌ను అడిగాం. అసెంబ్లీలో ఉన్నవి రెండే కూటమిలు. ఒకటి అధికార పార్టీ. మరొకటి మాది.
– మేము తప్ప మరే పార్టీ లేనప్పుడు, మా పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి కదా? దానికి ఒక నాయకుడు ఉంటే, ఆయన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలి కదా? మాకు 40 శాతం ఓట్‌ షేర్‌ వచ్చింది.
– మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగానూ, ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే మైక్‌ హక్కుగా వస్తుంది. అంటే లీడర్‌ ఆఫ్‌ ది హౌజ్‌ (సీఎం) తర్వాత, ప్రతిపక్ష నేతకు మైక్‌ ఇవ్వాలి. 
– అలా ఇస్తేనే ప్రజా సమస్యలు ప్రస్తావించే వీలుంటుంది. కానీ వారు అది కోరుకోవడం లేదు.
– ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకూడదు అనుకుంటున్నారు కాబట్టి.. మమ్మల్ని ప్రతిపక్ష నేతగా గుర్తించబోమని అంటున్నారు.
– అంటే మాకు మైక్‌ ఇవ్వాలన్న ఆలోచన వారికి లేదు. 175 మందిలో ఒక సభ్యుడిగా రెండు నిమిషాలు మాత్రమే ఇస్తారు. అది వారి లక్ష్యం. అందుకే అసెంబ్లీకి పోయి ఏం లాభం?

మీ సమక్షంలో.. మీరే సభ్యులుగా:
– అందుకే, అదే అసెంబ్లీ రోజుల్లో.. ఒకవేళ మేము సభలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఏ విధంగా అయితే మాట్లాడతామో.. అసెంబ్లీ బయట ప్రతిరోజూ, అదే హక్కు ఉపయోగించుకుంటూ, ప్రతి రోజూ ప్రతిపక్ష పాత్ర మీడియా సమక్షంలో పోషిస్తాం.
– ప్రజాస్వామ్యాన్ని గౌరవించే టీవీ ఛానళ్లను ఆహ్వానిస్తాం. వారి టైమ్‌ కోరుతాం. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తాం.
– ప్రతి రోజూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ప్రతి మూడో రోజు.. నేనే మీడియా ద్వారా, ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాను. 
– ప్రజా సమస్యలపై చంద్రబాబును నిలదీస్తాను. చేతనైతే సమాధానం చెప్పమని కోరుతాను.
– మీడియా ద్వారా, మీ అందరి సమక్షంలో, మీరే నా స్పీకర్లుగా.. ఇక్కడి నుంచే ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతాం.
– సభలో ఎవరికైనా అవకాశం ఇస్తున్నారా? నిరసన తెలిపే అవకాశం ఇస్తున్నారా?

– రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?
– గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే వీలు లేదు కాబట్టి, బాయ్‌కట్‌ చేయాలని నిర్ణయించాం.

Back to Top