బాబు పేరుకే సీఎం..చేసేది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

ఐదేళ్లలో నారా వారి సారా స్రవంతి కార్యక్రమం సక్సెస్‌  

కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ నిందితులకు బాబు రక్షణగా నిలిచారు

ఐదేళ్ల బాబు పాలనలో పొదుపు సంఘాలు బలహీనమయ్యాయి

పేదవాడికి గుండెనొప్పితో ఆసుపత్రికెళ్తే ఆరోగ్యశ్రీ కట్‌ అంటారు

ఐదేళ్లలో ప్రతి కులాన్ని చంద్రబాబు మోసం చేశారు

అనంతపురం: చంద్రబాబు పేరుకే ముఖ్యమంత్రి అని, ఆయన చేసేది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలను పశువుల్లా కొని రాజ్యాంగానికి బాబు తూట్లు పొడిచారని తెలిపారు. ఐదేళ్లలో ప్రతి కులాన్ని మోసం చేశారని మండిపడ్డారు. ఐదేళ్లలో నారావారి సారా స్రవంతి కార్యక్రమం బాగా జరిగిందని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. గ్రామానికో జన్మభూమి కమిటీ మాఫియాను తయారు చేశారని మండిపడ్డారు. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇచ్చే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 

ఇదే మడకశిర నియోజకవర్గంలో అప్పట్లో ఆ దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రూ. 250 కోట్లు మంజూరు చేసి మడకశిర బ్రాంచ్‌ కెనాల పనులు 80 శాతం పూర్తి చేశారు. మిగిలిన 20 శాతం పనులు కూడా ఐదు సంవత్సరాల చంద్రబాబు హయాంలో కనీసం పూర్తి చేయలేని అధ్వాన్నమైన పాలన ఎక్కడైనా ఉంటుందా.. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు ఒక్కసారి చూడండి. ఎన్నికలు వచ్చే సరికి 20 శాతం పనులు పూర్తికాకపోయినా రెండు చెరువులకు రెండు చెంబుల నీళ్లు పోసి తానే నీళ్లు తెచ్చానని ఫోజులు కొడుతున్నాడు. మడకశరలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, నీటి కోసం ప్రజలు ధర్నాలు చేస్తున్నా.. పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. 2016లో ఇదే మడకశిరకు సీఎం హోదాలో వచ్చి అనేక హామీలు ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఈయన ఇచ్చిన హామీల కథ దేవుడు ఎఉరుగ ముఖ్యమంత్రి హోదాలో ఎవరైనా మాట ఇస్తే అయిపోతుందని అనుకుంటాం. కానీ, ముఖ్యమంత్రి హోదాలో వచ్చి కూడా ఇచ్చిన హామీలు అమలు చేశాడా.. ఇదే మడకశిరలో పరిశ్రమల కోసం 16 వందల ఎకరాలు 2010లో సేకరించారు. ఇందులో పరిశ్రమలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని అడుగుతున్నా.. ఇదే చంద్రబాబు అమలాపురం, గుండిబండలో డిగ్రీ కాలేజీలు కట్టిస్తానని హామీ ఇచ్చాడు.. కాలేజీలు కట్టించాడా.. మడకశిరలో 50 పడకల ఆస్పత్రిని 100 పడకలు చేస్తానన్నాడు. నెరవేర్చాడా అని అడుగుతున్నా.. ఒక్కటీ అమలు చేయలేదు కానీ ఎన్నికలు వచ్చే సరికి దాన్ని వంద పడకలకు పెంచుతూ జీఓ జారీ చేశాడు కానీ, ఆ ఆస్పత్రిలో డాక్టర్లు కూడా లేరు. మడకశిరలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు కడతానని హామీ ఇస్తాడు.. 22 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌ రోడ్డులో కనీసం 2 కిలోమీటర్లు అయినా పూర్తయిందా.. 

చంద్రబాబు పాలనను ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే నియోజకవర్గంలో చింతపండు, పట్టుగుళ్లూ, వక్కలు అధికంగా ఇదే నియోజకవర్గంలో పండిస్తారు. చింతపండుకు, పట్టుగూళ్లకు, వక్కకు గిట్టుబాటు ధరలు వస్తున్నాయా.. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడి హయాంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. చంద్రబాబు పాలనను ఒక్కసారి గమనించండి. చంద్రబాబు పాలనలో గిట్టుబాటు ధరలు లేవు, రైతుల అప్పులు గతంలో రూ. 87,612 కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రూ. లక్షా 50 వేల కోట్లకు పెరిగింది. రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ పథకం పూర్తిగా ఎగరగొట్టాడు. చంద్రబాబు పాలనలో గవర్నమెంట్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ కాకపోవడం, కరెంటు, రాయల్టీ రేట్లకు పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఉద్యోగాలు తగ్గాయి. నిరుద్యోగం రెట్టింపు అయింది. బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ బాబు వచ్చాడు.. ఉన్న జాబులన్నీ ఊడగొట్టాడు. ఇంటికి రూ. 2 వేల భృతి అన్నాడు. ప్రతి నిరుద్యోగికి రూ. 1.2 లక్షలు ఎగ్గొట్టాడు. పొదుపు సంఘాలు బలహీనమయ్యాయి. అక్కచెల్లెమ్మల రుణాలు రూ. 14,200 కోట్లు ఉంటే ఇవాళ 26 వేల కోట్లకు ఎగబాకాయి. చంద్రబాబు పాలనలో అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ పథకం పూర్తిగా ఎగరగొట్టాడు. చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత అన్నాడు. కానీ, ఇసుక రవాణా చేస్తున్న ఎమ్మెల్యేను మహిళా ఎమ్మార్వో పట్టుకుంటే ఆ టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకొని ఆ అధికారిని ఈడ్చుకెళ్లాడు. 

చంద్రబాబు పాలనలో బాబు బ్యాచ్‌ విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ నడిపారు. అక్కలు, చెల్లెమ్మలకు వడ్డీలకు రుణాలు ఇచ్చి, ఆ రుణాలు చెల్లించలేకపోతే వారి మానాలతో ఆడుకున్నారు. వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఆ విజయవాడలో ఇంత ఘోరం చేసిన వ్యక్తులకు ఏ శిక్ష విధించారని నిలదీస్తున్నా. పదేళ్ల క్రితంలో పోల్చితే రైతులకు పంట దిగుబడి తగ్గింది, పంట సాగు విస్తీర్ణం కూడా తగ్గింది. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ భూములు ఇవ్వడం తగ్గింది.. వారి భూములు లాక్కోవడం ఎక్కువైంది. బీసీల మీద ప్రేమ అంటూనే బీసీ పిల్లలు చదువుకునేందుకు ఆస్తులు అమ్ముకునేలా చేస్తున్నాడు. చంద్రబాబు పాలనలో గవర్నమెంట్‌ బడులు తగ్గాయి. ముఖ్యమంత్రి అయి 6 వేల స్కూళ్లు మూసివేయించాడు. ప్రతి గ్రామంలో వీధి వీధికి నాలుగు మద్యం షాపులు తయారయ్యాయి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు.. గవర్నమెంట్‌ స్కూళ్లను మూసివేయించి నారాయణ స్కూళ్లను ప్రోత్సహిస్తున్నాడు. ఎల్‌కేజీ చదవాలన్నా.. సంవత్సరానికి రూ. 25 వేలు గుంజుతున్నారు. ఎన్టీఆర్‌ సృజల స్రవంతి అని ప్రతి గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్, రూ. 2కే నీరు అన్నాడు.. కానీ చేసిందేమిటంటే.. చంద్రబాబు పాలనలో నారావారి సారా స్రవంతి నడుపుతున్నాడు. చంద్రబాబు పాలనలో ఏం జరిగిందంటే బెల్టుషాపుల రద్దుపై తొలి సంతకం పెడతానని, వీధి వీధికి మద్యం షాపులు పెట్టించాడు. చంద్రబాబు పాలనలో పోలీస్‌ స్టేషన్లు పెరగలేదు కానీ, గ్రామానికి ఒకటి జన్మభూమి కమిటీ మాఫియాను తయారు చేశాడు. పెన్షన్‌ కావాలన్నా లంచం, రేషన్‌కావాలన్నా లంచం, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వంది పని జరగని పరిస్థితి తీసుకువచ్చాడు. 

చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతాడు.. కానీ 108కి ఫోన్‌ కొడితే ఆ వాహనం వస్తుందో లేదో తెలియని పరిస్థితికి వ్యవస్థను తీసుకువచ్చాడు. తన మంత్రి యనమల రామకృష్ణుడికి పంటి నొప్పి వస్తే సింగపూర్‌లో వైద్యం చేయిస్తాడు. పేదవాడు గుండెనొప్పికి పక్క రాష్ట్రంలో ఆపరేషన్‌ చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కట్‌ అని ఉత్తర్వులు జారీ చేయిస్తున్నాడు. చంద్రబాబు పాలనలో జరిగిందేమిటంటే ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు.. కరెంటు చార్జీలు బాదుడే బాదుడు, పెట్రోల్, డీజిల్‌ రేట్లు బాదుడే బాదుడు. ఈయన హయాంలో పన్నులు బాదుడే బాదుడు, ఆదాయం మాత్రం పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి. 

రాజధానికి అమరావతి అని పేరు పెట్టాడు. కానీ అక్కడ అమరేశ్వరుడి భూములు కొట్టేసే కార్యక్రమం చేశాడు. రాజధానిలో ఏం కట్టావు అని అడిగితే.. రాజధానిలో బాహుబలి సినిమా చూపించి అడుగో రాజధాని అని గ్రాఫిక్స్‌ చూపిస్తున్నాడు. పేరుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, చేసేది రియలెస్టేట్‌ వ్యాపారం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. అది మర్చిపోయి రూ. లక్షల కోట్లతో తన కొడుకు లోకేష్‌ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసుకున్నాడు. 

బాబు పాలనలో జరిగిందేమిటంటే.. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని రాజ్యాంగాన్ని తూట్లు పొడిచాడు. కానీ ఇవాళ 13 జిల్లాల్లో ప్రజలను చూసి ఓట్లు అడగడానికి ధైర్యం చాలడం లేదు. ఓట్ల కోసం ఢిల్లీ నుంచి నాయకులను తెచ్చుకుంటున్నాడు. చంద్రబాబు మేనిఫెస్టోలో 600 వాగ్దానాలు ఇచ్చాడు. ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు. పలానా కులం అనేది లేకుండా ప్రతి కులాన్ని మోసం చేశాడు. చివరకు 2014 ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో టీడీపీ వెబ్‌సైట్‌లో కనిపించకుండా దాచేశాడు. 

ఐదేళ్లలో చంద్రబాబు చేసిన కుట్రలు, మోసాలు ప్రజలు గమనించాలి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసం తప్ప మరొకటి చూశామా అని అడుగుతున్నా.. చంద్రబాబు పాలన ఇంత అన్యాయంగా ఉంది కాబట్టి ఈ మనిషి ఎన్నికలు జరిగేంత వరకు రోజుకు ఒక సినిమా చూపిస్తాడు. రోజుకో డ్రామా చూపిస్తాడు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా చూపిస్తాడు. జరుగుతున్న కుట్రలను గమనించి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకుంటే మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబు ఒక్కడితోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తో యుద్ధం చేస్తున్నాం. అమ్ముడుపోయిన అనేక టీవీ చానళ్లతో యుద్ధం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి చంద్రబాబు కుట్రల్లో భాగంగా ప్రతి గ్రామానికి మూటల మూటల డబ్బు పంపిస్తాడు, ప్రతి చేతిలో రూ. 3 వేలు ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తాడు. 

నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి కుటుంబంలోకి తీసుకొనిపోండి. నవరత్నాలతో మన బతుకులు మారుతాయి. మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో ఆనందం చూడవచ్చని గట్టిగానమ్ముతున్నా.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పురావాలి. రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తిప్పేస్వామి అన్నను నిలబెడుతున్నాను.. సౌమ్యుడిగా పేరుంది. మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ ఎంపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్‌ను నిలబెడుతున్నాను.. వీరిద్దరి ఆశీర్వదించాలని పేరు పేరునా విజ్ఞప్తి చేస్తున్నాను. చివరకు మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు. అనంత‌పురం జిల్లా చ‌రిత్ర‌లోనే ఎప్పుడు జ‌రుగ‌లేదేమో.. రెండు ఎంపీ సీట్లు బీసీల‌కు ఇచ్చిన ఘ‌న‌త వైయ‌స్ఆర్‌సీపీదే. 

రూ.3 వేల‌కు మోస‌పోవ‌ద్దు
ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఇచ్చే రూ.3 వేల‌కు మోస‌పోవ‌ద్దు. ఐదేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో రైతుల రుణాలు మాఫీ చేయలేదు. చంద్రబాబును నమ్మి రైతులు మోసపోయారు.  రైతులకు కనీస గిట్టుబాటు ధరకూడా రాలేదు. ఈనాడు సర్వం కోల్పోయి అన్నదాతలు రైతులకు చివరకు రైతు బీమా కూడా ఇవ్వలేదు. హెరిటేజ్‌ కోసం రైతులను దోచి దళారులను బాగు చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే మనం చివరి స్థానంలో ఉన్నాం.  రైతుల రుణాలు 85వేల కోట్ల నుంచి లక్షా 50వేల కోట్లకు పెరిగాయి. ఏపీలో రైతుల అప్పులు ఏస్థాయిలో ఉన్నాయో నాబార్డు నివేదికలు చెబుతాయి. ఇక పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేయలేదు. డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాల పథకాన్ని తీసేశారు. అసెంబ్లీలో మేము అడిగిన ప్రశ్నకు ..డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయబోమని అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. చంద్రబాబు ఇచ్చే హామీలు, ప్రలోభాలకు మోసపోకండి. 

కొద్ది రోజులు ఓపికపడితే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎన్ని లక్షలు ఖర్చు అయినా మీ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తా. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు. రైతులకు ప్రతి ఏడాది మే నెలలో పెట్టుబడి సాయం రూ.12,500. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75వేలు. డ్వాక్రా మహిళలకు చెబుతున్నా.. ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తాం. అవ్వా, తాతలకు రూ.3వేల వరకూ పింఛన్‌ ఇస్తాం. పసుపు-కుంకుమ డ్రామాకు మోసపోవద్దు. జగన్ రూ.2వేలు ఇస్తానని చెప్పకుంటే చంద్రబాబు ఇచ్చేవారా? ’ అని సూటిగా ప్రశ్నించారు.

ఏపీఎస్ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం 
ఏపీఎస్ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాన‌ని మాట ఇచ్చారు. 

Back to Top