తాడేపల్లి: మీ అందరి ప్రేమ సంపాదించిన వైయస్ జగన్‌ను చూసి గర్వపడుతున్నా..అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. నా బిడ్డను నడిపించుకోమని మీకే అప్పజెప్పా. నా బిడ్డను నడిపించిన మీ అందరిపైనా నా అణువణువునా కృతజ్ఞత ఉంది. మీ బిడ్డల్ని వైయస్ జగన్ చేతుల్లో పెట్టండి, వారికి ఉజ్వల భవిష్యత్ అందిస్తారని చెప్పారు. మీతో నా అనుబంధం ఈనాటిది కాదు, 45 ఏళ్ల అనుబంధం ఉంది. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి అంటూ వైయస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రస్థానమంతా జనంతో ముడిపడి ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. మహానేత వైయస్సార్ 73వ జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైయస్ఆర్‌సీపీ నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాలకు హాజరైన వైయస్ విజయమ్మ మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖరరెడ్డి అందరివాడు. మీ అందరి హృదయాల్లో వైయస్ఆర్ గారు సజీవంగా ఉన్నారని అన్నారు. ఆయనకు జగమంతా కుటుంబమే: రాజశేఖర్ రెడ్డిగారిని ప్రేమించిన ప్రతి హృదయానికి, రాజశేఖర్‌రెడ్డి గారిని బిడ్డలను, నన్ను అక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈరోజు రాజశేఖర్‌రెడ్డి గారి 73వ జయంతి. ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. నా ప్రజాప్రస్ధానంలోని ప్రతి మలుపు జనజీవనంతో ముడిపడి ఉందనేవారు. రాజశేఖర్‌రెడ్డిగారు నా వారే కాదు, మీ అందరి వాడు కూడా. జగమంత కుటుంబంగా మనిషి మనిషిని ఆయన ప్రేమించాడు. ఆయన చనిపోయిన 13 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని కోట్ల మంది హృదయాలలో సజీవంగా ఉన్నారు. అందుకే వచ్చాను: ఈ ప్లీనరీని మూడోసారి జరుపుకుంటున్నాం. మనం ఆరంభ దశలో ప్రణాళికాబద్ధంగా ప్లీనరీ జరుపుకున్నాం, రెండోసారి పోరాట దీక్షగా ప్లీనరీ జరుపుకున్నాం, ఈరోజు సగౌరవంగా మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, జగన్‌బాబు ప్రభుత్వం ఇది చేసిందని సగర్వంగా చెప్పుకుంటూ ఈ ప్లీనరీని జరుపుకుంటున్నాం. నా బిడ్డకు, మీ అందరినీ అభినందించడానికి, ఆశీర్వదించడానికి నేను ఇక్కడికి వచ్చాను. అక్కడి నుంచే ఈ పార్టీ పుట్టింది: దేశంలో ఎక్కడైనా రాజకీయ పార్టీలు అధికారం కోసమే పుడతాయి, కానీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ మాత్రం నల్లకాలువలో ఇచ్చిన మాట కోసమే పుట్టింది. మహానేత డాక్టర్ వైఎస్‌ఆర్ చనిపోయిన తర్వాత ఆయన లేరనే మాట విని ఎన్నో గుండెలు ఆగిపోయాయి, 700 మంది ప్రాణాలు విడిచారు. వారి కుటుంబాల ఆక్రందన నుంచి వారి మమకారాలను అర్ధం చేసుకుని ఈ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ పుట్టింది. రాజశేఖర్‌రెడ్డిగారు మన మధ్య నుంచి వెళ్ళిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నుంచి తండోపతండాలుగా వచ్చి మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన వారి అభిమానం నుంచి ఈ పార్టీ పుట్టింది. నా బిడ్డ తండ్రిని కోల్పోయాడు. తనకు ఆ బాధ తెలుసు కాబట్టి, చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి పగలనకా, రాత్రనకా, అర్ధరాత్రి, అపరాత్రి కూడా మీ అభిమానం, మీ ప్రేమ చూపి మేమున్నాం అని నా బిడ్డను దగ్గరకు తీశారు, ఆ అభిమానం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. దేశంలోని శక్తివంతమైన అధికార వ్యవస్ధలన్నీ తన మీద దాడి చేసినా మనం చేస్తున్నది మంచి, మనం చేస్తున్నది ధర్మం, మనం చేస్తున్నది న్యాయమని నమ్మి, ఎన్ని కష్టాలొచ్చినా లెక్క చేయకుండా, అరెస్ట్‌లు, భయం పుట్టించే రీతిగా చెప్పినా, ఏదీ లెక్క చేయకుండా, కష్టాల బాట ముందుందని తెలిసినా.. మీ కన్నీటిని తుడవడానికే ఈ పార్టీ పుట్టింది. వ్యవస్థలన్నీ దాడి చేసినా..: పార్టీ ఆవిర్భావం తర్వాత అన్యాయమైన, అక్రమమైన కేసులు వచ్చాయి. అన్ని వ్యవస్ధలతో దాడి చేశారు, అదే విధంగా ఉప ఎన్నికలు వస్తే ఇంటరాగేషన్ పేరుతో జైల్లో పెట్టారు, ఆస్తులు అటాచ్ చేశారు, షర్మిలమ్మ పాదయాత్ర, జగన్ పాదయాత్ర చేశారు. ఈ కుటుంబం ఎన్నో కష్టాలు, నిందలు ఎదుర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పొమ్మనలేక పొగబెడితే ఎంతో విలువలతో ఈ పార్టీ పురుడుపోసుకుంది. సంక్షేమం, అభివృద్ది, సామాన్యుడి కోసం, తన కష్టం చెప్పుకోలేని పేదల కోసం, వారి అవసరాలు తీర్చడం కోసమే ఈ పార్టీ పుట్టి ఎదిగింది. జగన్‌బాబు నాయకుడిగా అంచెలంచెలుగా ఓర్పు, సహనంతో, అచంచల విశ్వాసంతో, గుండె నిండా ధైర్యంతో, పేదల మీద మమకారంతో, రైతు మీద కొండంత ప్రేమతో, నేల తల్లి మీద గౌరవంతో ఒక్కో మెట్టు కాలినడకన ఎదిగాడని మీ అందరికీ చెబుతున్నా. అలా నాలుగున్నర దశాబ్ధాల సీనియర్ పొలిటీషియన్ గొంతు ఆరిపోయేటట్లుగా చేశాడు నా బిడ్డ. నిజాయితీగా ఆలోచించే వ్యక్తిత్వం: జగన్‌బాబు దృష్టిలో రాజకీయం అంటే అసత్యాల ప్రచారం కాదు. తన దృష్టి అంతా ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలని. అంత నిజాయితీగా ఆలోచించే వ్యక్తిత్వం నా బిడ్డది. అందుకే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో దాదాపు 90 శాతం ఏడాదిన్నర లోపే అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెబుతున్నా. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో రూ.1.60 లక్షల కోట్లు ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించింది. విప్లవాత్మక మార్పులు: ఇవాళ గడప గడపకూ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్తున్నారంటే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నామన్న ధైర్యం. అవ్వాతాతలకు ఒకటో తేదీనే పెన్షన్లు. సచివాలయాలు. వలంటీర్ వ్యవస్థ. రైతు భరోసా కేంద్రాలు. ఇంగ్లీష్ మీడియంలో బోధన. ప్రభుత్వ స్కూళ్లలో సమూల మార్పులు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు. అమ్మ ఒడి, ఆసరా, చేయూత పథకాలు.. దాదాపు 31 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణం. ఎన్నికల ముందు చెప్పినవే కాకుండా, చెప్పనివెన్నో ఇలా అమలు చేసిన జగన్, రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఆయన ఒక్కటైనా చెప్పుకోగలరా?: ఈ పాలన మానవత్వంతో, మనసుతో చేసే పాలన. ఒకరోజు రాజశేఖర్‌రెడ్డిగారి సమకాలికుడు, ఈరోజు జగన్‌బాబు చేతిలో ఓడిపోయి 23 సీట్లతో నిలబడిన నాయకుడు, 14 ఏళ్ళు సీఎంగా చేసిన నాయకుడు ఏ పధకమైనా అమలు చేశారా? తన బ్రాండ్‌గా కనీసం ఒక్క పథకాన్ని అయినా చెప్పుకోగలరా? చివరకు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కూడా పక్కనపెట్టిన పరిస్ధితి ఆయనది. ఎందుకంటే జనం నుంచి వచ్చిన జననేతలు, ఇతర కారణాల వల్ల వచ్చిన నేతలకు ప్రజా పరిపాలనలో చాలా చాలా తేడా ఉంటుంది. ఆ వయసులోనే ఎంతో ఉన్నతాశయం: జగన్ జననేత. రాజశేఖర్‌రెడ్డిగారి వారసుడు. ఆయకన్నా నాలుగు అడుగులు ముందుకు వేసి మంచి చేయాలనే తపన ఉన్న వ్యక్తి. మూడు దశాబ్ధాలకు కావాల్సిన విజన్ కలిగిన వ్యక్తిగా, మంచి చేసి ఓట్లడిగే నైతికత కల్గిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. నాకు ఒకటి గుర్తుకొస్తుంది. జగన్‌బాబు 9, 10 తరగతులు చదివేటప్పుడు అప్పట్లో రాజశేఖర్‌రెడ్డిగారు ఎప్పుడూ ఇంట్లో ఉండేవారు కాదు. మాతో గడిపిన సందర్భాలు చాలా తక్కువ. ‘అప్పుడు నేను జగన్‌బాబుతో అన్నాను. ఈ రాజకీయాలు మనకు వదు. మనం నాలుగు ఇండస్ట్రీలు పెట్టుకుని దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కావాల్సిన వారికి పది మందికి సేవ చేద్దాం. కాబట్టి ఈ లైఫ్ వద్దు అన్నాను. అందుకు జగన్‌బాబు అన్నాడు.. ఆ లైఫ్ కాదమ్మా నేను కోరుకునేది. నాన్న ఏ విధంగా నడుస్తున్నారో ఆ లైఫ్ కోరుకుంటున్నాను’ అని చెప్పాడు. గర్వపడుతున్నాను: అందుకే ఇవాళ మీ అందరి ప్రేమ, అభిమానం పొందిన నా కొడుకుని చూసి చాలా గర్వపడుతున్నా. జగన్‌బాబు తల్లిగా, రాజశేఖర్‌రెడ్డి గారి భార్యగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలిగా నా బిడ్డను చూసి గర్వపడుతున్నా. తన మనసుతో చేసే ఈ పాలనను నా కళ్ళారా చూస్తున్నాను. అయితే జగన్‌బాబుకు ఈ అధికారం వెనక చాలా కష్టం ఉంది. తన కష్టాలు, నిందలు, అవమానాలు గుర్తు చేసుకుంటే చాలా బాధనిపిస్తుంది. రాజశేఖర్‌రెడ్డిగారి కొడుకుగా అడుగుపెట్టి.. మీతో ఉంటాను, మీ మాటగా ఉంటానని ప్రజలకు చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు. మా కుటుంబం పడిన కష్టాలు, బాధలు దేశంలోనే ఎవరూ ఎదుర్కోలేదు. అణువణువూ మీకు నా కృతజ్ఞత: 2011లో మొదటి ప్లీనరీలో మీకు ఒక మాట చెప్పాను, నా బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నా. మీరే నడిపించుకోవాలని కోరాను. నా బిడ్డను మీరు చాలా గొప్పగా ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో నడిపించుకున్నారు. అందుకూ మీకు నా కృతజ్ఞతలు. ఇవాళ ఒక మాట చెబుతున్నా, రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం తమ బిడ్డలను జగన్‌బాబు చేతిలో పెట్టండి. ఆ బిడ్డల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని మీకు మాట ఇస్తున్నాను. అక్కచెల్లెమ్మలకు ఆర్ధికంగా, సామాజికంగా, విద్య, వైద్యం అన్ని విషయాలలో కూడా వారు ఎదిగేలా, తన తండ్రి కోరుకున్నట్లుగా వారిని లక్షాధికారులుగా నిలబెడతాడని, ఆ మాట నెరవేరుస్తాడని చెబుతున్నా. ఈ రోజు నాబిడ్డ మీ మనవడిగా, మీ కొడుకుగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా తన హృదయం తెరిచి మరి మీ కుటుంబ సభ్యుడిగా ఆచరిస్తున్నాడు. అయిదు వ్యవస్థలు ముఖ్యం: ఒక మనిషికి ఐదు వ్యవస్ధలు ఉండాలి. ఆహార భద్రత, ఆదాయ భద్రత, ఆవాస భద్రత, విద్య, వైద్యం. ఈ ఐదు ప్రతి ఇంటికి అందించడంలో శాచురేషన్ అనే విధానంలో అందరికీ అందేలా నా బిడ్డ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఈరోజు విద్య విషయంలో మోడల్ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం, జిల్లాకొక విశ్వవిద్యాలయం, మెడికల్ కాలేజీలు, విలేజ్ క్లీనిక్‌లు, కరోనా సమయంలో చూపిన తోడు, ఆసరా ఇలా విత్తనం వేశాడు. ఈ విత్తనం ఏ విధంగా చెట్టు అవుతుందో ఆరోజు తనను, తన ప్రభుత్వాన్ని నిలబెడతాయి. అభివృద్ధి అంటే..: అభివృద్ది ఎక్కడ జరుగుతుందన్న ప్రతిపక్షాలకు ఒక మాట చెబుతున్నాను. ప్రజల జీవనశైలిని పెంచడమే అభివృద్ది. రెండోది గత ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశాయి? ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు? ఏ పరిశ్రమ తీసుకొచ్చారు? ఏ విధంగా ప్రజలను ముందుకు నడిపారు? అని అడుగుతున్నా. దుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ తన ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు పూర్తి చేయలేకపోతే జగన్ బాబు వచ్చిన తర్వాత పూర్తి చేశాడు. రాజశేఖర్‌రెడ్డి గారు హైదరాబాద్‌లో 14 ఫ్లైఓవర్‌లు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, ఎయిర్‌పోర్ట్ కట్టారు. అలాంటి ప్రభుత్వం, అలాంటి నాయకత్వం మీకు జగన్ బాబు తప్పకుండా ఇస్తాడు. ఇంతవరకు జగన్‌బాబును మీరు కష్టాలలో కాపాడుకున్నారు, ఇక ముందు కూడా కాపాడుకుంటారని మీ అందరికీ చెబుతున్నా. మీ అందరి చేతిలో నా బిడ్డను పెడుతున్నా. మీరంతా నా జీవితంలో భాగం: ఇకపోతే ఇంకో విషయం కూడా మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఒక తల్లిగా నాపై ఉంది. ఎందుకంటే ఈ బంధం ఈనాటిది కాదు. మీకూ మాకు ఉన్న ఈ అనుబంధం 45 సంవత్సరాల అనుబంధం. రాజశేఖర్‌రెడ్డి గారు ఉన్నప్పుడు 32 సంవత్సరాలు అయితే. ఈ తర్వాత కూడా మీరు ఈ కుటుంబాన్ని వదలకుండా 13 సంవత్సరాలు కూడా ఈ కుటుంబంతో అనుబంధాన్ని కొనసాగించారు. నా జీవితంలో మీరు అందరూ భాగమయ్యారు. రాజకీయ జీవితంలో నేను ఏదైనా మీకు చెప్పాలి అనుకుంటే అది మీకు మాత్రమే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఉన్నది ఉన్నట్లుగా మీకు చెప్పాలని నిర్ణయించుకున్నా. రాజశేఖర్‌రెడ్డి గారిని పులివెందుల ప్రజలు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే, కడప ప్రజలు నాలుగు సార్లు ఎంపీగా ఎన్నుకున్నారు. కడప ప్రజలు అప్పటినుంచి ఇప్పటివరకూ కూడా మాతోనే ఉన్నందుకు మొట్టమొదటగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. నేను ఎప్పటికీ మరిచిపోను నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ.. ఈ కుటుంబం ఎప్పటికీ కడప ప్రజలకు రుణపడి ఉంటుంది. కడప ప్రజలు రాజశేఖర్‌రెడ్డి గారిని నాయకుడిని చేస్తే ఉమ్మడి రాష్ట్రం ఆయన్ను మహానాయకుడిని చేసింది, ఓ మహర్షిని చేసింది. రాజశేఖర్‌రెడ్డి గారు మనిషి మనిషిని ప్రేమించారు, ఎంతగా అంటే అమితంగా, ప్రతిక్షణం ఏం చేయాలి ఏం చేయాలని, నేను ఉన్నా లేకపోయినా ఆగకుండా మంచి జరగాలని ఎన్నో పధకాలు, ఎన్నో ప్రాజెక్ట్‌లు చేశారు. మరి మీరు కూడా అంతకంటే అమితంగా ఆయన్ను ప్రేమించారు, ఎంతగా అంటే ఆయన మిస్సింగ్ అంటే కొన్ని గుండెలు ఆగిపోయేంత ప్రేమ, ఎంతగా అంటే ఆయన రాడు ఇక లేడు అంటే ప్రాణాలు పోయేంత ప్రేమ. రాజశేఖర్‌రెడ్డి గారి పలకరింపు ఒక భరోసా, ఆయన మాట ఒక ఆదరణ, ఆయన చిరునవ్వు ఒక ధైర్యం, ఆయనకు మీకు ఉన్న సంబంధం ఒక అవినాభావ సంబంధం, అది అర్ధం కానిది, ఏ కెమిస్ట్రీకి కూడా అర్ధం కాదు. హిస్టరీలో ఏ ఒక్క రాజకీయనాయకుడిని కూడా 13 సంవత్సరాలు ఆయన్ను గుండెల్లో సజీవంగా ఉంచుకున్నారంటే మీకు ఆయనకు ఉన్న గొప్ప బంధం. ఆ బంధం, ఆ సంబంధం నాతో నా బిడ్డలతో కూడా మీరు ఇంతవరకూ నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మీరే అండగా నిల్చారు: రాజశేఖర్‌రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నెన్నో సమస్యలు, గొడవలు. ఆయన ఏ పార్టీకి 35 సంవత్సరాలు సేవ చేశాడో ఆపార్టీ మమ్మల్ని రోడ్డున వదిలేసింది. ఆయనతో పైకి వచ్చిన నాయకులు అందరూ కూడా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను వదిలేశారు. అప్పుడు మీరే నిలబడింది, ఆదరించింది, అక్కున చేర్చుకుంది. జగన్‌బాబు ఓదార్పు యాత్రకు వచ్చినా ఆయన్ను అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఉప ఎన్నికల సమయంలో జగన్‌బాబును అప్పటికప్పుడు ఇంటరాగేషన్ పేరుతో పిలిచి ఏ కారణం లేకుండా జైలుకు పంపితే ఆనాడు జగన్ కోసం నిలబడిన 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని గెలిపించడం కోసం ఆ రోజు నేను పాప ఉమ్మడి రాష్ట్రంలో క్యాంపెయిన్ చేస్తే ఏ ఒక్కరూ కూడా రోడ్లపై ఉండి ఇళ్ళలో లేకుండా మేమున్నామంటూ నిలబడ్డారు. 19 మందిలో 18 మందిని, ఎంపీ గొప్పగా గెలిచాడు, ఓడిపోయిన వారికి డిపాజిట్లు కూడా రాలేదు. అంతేకాదు జైలులో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధమైన ఆందోళన చెందవద్దని, ఈ కుటుంబం మీతో ఉందని చెప్పేందుకు జగన్‌బాబు పాదయాత్ర చేయమని షర్మిలమ్మని అడిగితే...షర్మిలమ్మ జగనన్న వదిలిన బాణంగా మీ దగ్గరకు వచ్చింది. షర్మిలమ్మ పాదయాత్రకు వెళ్ళే రోజు చాలా భాద, భయం వేసింది, ఎందుకంటే ఉన్నది ఇద్దరు బిడ్డలు, ఒకరు అన్యాయంగా చేయని తప్పుకు జైల్లో ఉంటే, ఇంకో బిడ్డ ఆడబిడ్డ రోడ్డు మీదకు వస్తుందే అని భయపడ్డా, కానీ మీ అందరి ప్రేమ, అభిమానం ఆ బిడ్డను 3,112 కిలోమీటర్లు నడిపించాయి. ఏ సంఘటన కూడా మా జీవితంలో మరిచిపోలేను. ఆ తర్వాత జగన్‌బాబు పాదయాత్రలో ఎన్నెన్నో భయంకరమైన సంఘటనలు, అవమానాలు, నిందలు, అయినా కూడా ఆ బిడ్డ 4,638 కిలోమీటర్లు ధైర్యంగా పాదయాత్ర చేశాడంటే మీ అందరి ప్రేమ నడిపించింది. మా కుటుంబమే రుణపడి ఉంటుంది: ఇలా ప్రతి సంఘనలో నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో మీరు ఉన్నారు. ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా జగన్‌బాబును ఒక్కసారిగా 175 మందికి 151 మందితో, 25 ఎంపీలకు గాను 22 మంది ఎంపీలతో గొప్పగా ఆ దేవుడు, మీరు తలకి ఎత్తుకున్నారు. మీకు అందరికీ మా కుటుంబం రుణపడి ఉంటుంది. నా బొందిలో ప్రాణమున్నంతవరకూ మిమ్మల్ని నేను మర్చిపోను. అక్కడ నా కూతురు: ఇకపోతే మా కుటుంబం చాలా గొప్ప కుటుంబం, చాలా అభిమానం గల కుటుంబం, మా సంస్కారాలు కూడా గొప్పవే. మా అనుబంధాలు గొప్పవి కాబట్టి తన అన్నకు ఇక్కడ ఏ కష్టం కలగకుండా ఉండాలని, ఏ ఇబ్బంది రాకూడదని, తెలంగాణ కోడలిగా తెలంగాణలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని షర్మిలమ్మ ఏర్పాటు చేసుకుంది. వాళ్ళ నాన్న ఆశయాలను నెరవేర్చాలని, వాళ్ళ నాన్న ప్రేమించిన జనంకు నిజాయితీగా సేవ చేయాలని, తన జన్మకు కూడా ఒక సార్ధకత ఉండాలని ఆమె తెలంగాణలో ప్రయత్నం చేస్తుంది. నేను తోడుగా నిలవాలి: ఈరోజు ఆ బిడ్డకు నేను అండగా, తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజశేఖర్‌రెడ్డి భార్యగా, ఆమెకు తల్లిగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉందని మీ అందరికీ చెబుతున్నా. ఇక్కడ జగన్‌బాబుకు, అక్కడ షర్మిలమ్మకు, ఇక్కడ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అక్కడ షర్మిలమ్మ పార్టీకి ఒకే సమయంలో మద్దతు పలకడం గురించి, రెండు పార్టీలలో సభ్యత్వం ఉండవచ్చా అని చాలా ఆదుర్ధాగా, ఉన్నవి లేనివి కల్పించి ఏదో జరిగిపోతున్నట్లుగా ఎల్లోమీడియాలో గొప్పగొప్పగా మాట్లాడారు, రాశారు. ఈ కుటుంబం నుంచి రాయడానికి చాలా ఉత్సుకత ఉన్నవాళ్ళు ఉండడం మన దురదృష్టకరం. తల్లిగా ఇంతకాలం ఈ విమర్శలను ఖాతరు చేయలేదు. ఇద్దరికీ తల్లినే..: ఇద్దరికీ తల్లినే, ఇద్దరి భవిష్యత్ బాగుండాలనే చేతనైనంత సహకారం నేను అందించాను. ఇద్దరికీ తల్లిగా అక్కడా ఇక్కడా ఉన్నాను, ఎందుకంటే రాజశేఖర్‌రెడ్డి గారు తెలుగువారి గుండెచప్పుడు. కానీ ఇంతవరకూ జరిగింది ఒక ఎత్తు ఇక జరగబోయేది ఒక ఎత్తు. రాజకీయ ఎన్నికల యుద్దం రాబోతుంది. తెలంగాణలో మన కంటే ముందుగానే ఎన్నికలు వస్తాయి, కాబట్టి తెలంగాణలో షర్మిలమ్మ ప్రాతినిధ్యం వహిస్తుంది, తెలంగాణ ప్రయోజనాల గురించి షర్మిలమ్మ మాట్లాడుతుంది. మరి అలాగే జగన్ బాబు కూడా, ఈ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడాల్సిన అవసరం, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జగన్ బాబు ప్రభుత్వం ఏపీ ప్రయోజనాల గురించి, విభజన సంబంధ సమస్యల గురించి ఏపీ సీఎంగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనకు కచ్చితంగా ఒక స్టాండ్ ఉంటుంది. అది అవసరం కూడా, ఇక్కడ మీ అందరి అవసరం కూడా. మరి అదే సమయంలో ఇద్దరికీ వేరు వేరు విధానాలు ఉండక తప్పదు, రాజశేఖర్‌రెడ్డి గారి హావభావాలు, ఆయన ఆప్యాయతలు ఇద్దరూ వారసత్వంగా పుణికిపుచ్చుకున్న బిడ్డలు జగన్ బాబు, షర్మిల. ఈ రోజు వారు వేర్వేరు రాష్ట్రాలకు ప్రజాప్రతినిధులు, వేర్వేరు పార్టీలకు, వేర్వేరు ప్రయోజనాలకు ప్రతినిధులు, అయినా ఇలాంటి పరిస్ధితి వస్తుందని నేను కానీ మీరు కానీ ఊహించలేదు, కానీ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. కానీ ఎదైనా కానీ దైవ నిర్ణయంగా, మంచి కోసం, ప్రజా హితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని నేను నమ్ముతున్నా. ఇలాంటి సందర్భాలలో రెండు రాష్ట్రాల మధ్య ప్రయోజనాల విషయంలో కొన్ని అంశాలలోనైనా వక్రీకరణలకు, బురదచల్లే రాజకీయాలకు తావులేకుండా అటు షర్మిలమ్మ, ఇటు జగన్‌బాబు రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలు, వారి పార్టీ ప్రయోజనాలు ఉండక తప్పదనేది మనకు అర్ధమవుతుంది. అందుకే బాధ్యతలు వీడుతున్నా: జగన్‌బాబు ముఖ్యమంత్రిగా తన సత్తా చాటుకుని, మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ఇక్కడ పరిపాలన చేస్తుంటాడు. ఇకముందు కూడా తను చేసిన మంచి పనుల వల్ల దేవుని దయతో, మీ అందరి సహకారంతో తిరుగులేని మెజార్టీతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా తను ఉంటాడన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. ఈ పరిస్ధితుల్లో నేను రెండు రాష్ట్రాలలో తల్లిగా ఇద్దరికీ అండగా ఉన్నా ఇద్దరిపై విమర్శలు చేసేవారు ఉంటారు. కానీ ప్రజలు ఎప్పుడూ రాజశేఖర్‌రెడ్డి గారి భార్యగా ఎక్కడికి వెళ్ళినా యాక్సెప్ట్ చేస్తారు. కానీ కొంతమంది చేసే విమర్శలకు తావు ఇవ్వకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో, మరి వక్రీకరణకు, కుటుంబం మధ్య అంతరాలు ఉన్నాయన్న ప్రచారాలకు తావులేకుండా ఈ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ, ఈ పార్టీ ప్రచారం చేస్తున్నానన్న విమర్శలకు తావు లేకుండా గౌరవ అధ్యక్షురాలి పదవిలో, ఈ పార్టీలో ఇలా కొనసాగడం సరికాదనే నిర్ణయానికి వచ్చాను. ఇంకా చెప్పాలంటే..: మొన్నటికి మొన్న చూశాం, నేను రాయని, నేను చేయని సంతకంతో నేను రాజీనామా చేసినట్లు లేఖను సోషల్ మీడియాలో జగన్‌బాబుకు వ్యతిరేకంగా రిలీజ్ చేశారు. ఎంత పిచ్చి రాతలంటే, ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే వారి దిగజారుడుతనం కనిపించింది, ఆ లెటర్ చూస్తే నాకు నిజం చాలా బాధవేసింది. ఈ నాయకులకు కానీ, ఈ లేఖలు రాసేవారికి కానీ ఈ కుటుంబమే కాదు ఎవరి కుటుంబమైనా తల్లి లేదు, చెల్లి లేదు, ఆడవారు లేదు, మగవారు లేదు, రకరకాల నిందలు, రకరకాల వినకూడని, చేయకూడని మాటలు మాట్లాడడం. మరి నేను రాయని, నేను చేయని సంతకాన్ని ఎలా రిలీజ్ చేస్తారని కూడా అడుగుతున్నా. ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండడం కోసం నేను ఈ పార్టీ నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ షర్మిలమ్మ అక్కడ ఒంటరిపోరాటం చేస్తుంది, ఆమెకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది, రాజశేఖర్‌రెడ్డి గారి భార్యగా, ఆమె తల్లిగా ఆమెకు నిలబడాల్సిన అవసరం ఉందని నా మనస్సాక్షి చెబుతుంది. ఎందుకంటే కష్టాలలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా, సంతోషంలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉంటే అక్కడ కూడా నా రక్తం పంచుకున్న బిడ్డకు నేను అన్యాయం చేసినదాన్ని అవుతానని నా మనస్సాక్షికి నాకు నచ్చడం లేదు. కాబట్టి నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా, అభ్యంతరం కాకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా సవినయంగా మీ అందరికీ చెబుతున్నా. ఆమోదిస్తారని.. ఆదరిస్తారని..: ఇందుకు నన్ను క్షమించమని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాజకీయం అంటే వక్రీకరణలు, దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు ఇవి కాదు, రాజశేఖర్‌రెడ్డి గారి లాగా చివరి నిముషం వరకూ మీరు సేవచేసి చనిపోయే నాయకులులా కావాలి. అప్పుడూ చెప్పాను, ఇప్పుడు చెబుతున్నా, రాజశేఖర్‌రెడ్డి గారు లేని లోటు నాకు ఎవరూ తీర్చలేరు, మీకయితే ఇక్కడ జగన్‌బాబు తీర్చుతాడు, అక్కడ షర్మిలమ్మ తీరుస్తుంది. మీ చేతులకు అప్పగించాను, మీరు వారికి బలం కావాలి, వారు మీకు బలం, అండ అవుతారు. ఇవాళ, ఇకముందు వేరే రాష్ట్రంలో షర్మిలమ్మకు రాజకీయంగా అండగా ఉన్నా, తల్లిగా జగన్‌బాబుకు, ఇక్కడి ప్రజల మనసులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా..