తిరుపతి జిల్లా: తిరుపతిలో టీడీపీ గూండాల అరాచకం పరాకాష్టకు చేరింది. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. మున్సిపాలిటీల్లో మెజారిటీ లేకపోయినాసరే అధికార దుర్వినియోగంతో గద్దెనెక్కాలని దౌర్జన్యాలు, దాడులతో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు తెరతీసింది. డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం తిరుపతి నగరం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌ల మధ్య కోరం లేక ఎన్నిక నేటికి( మంగళవారం) వాయిదా పడింది. కూటమి నాయకులకు ఎలాంటి మెజారిటీ లేకపోవడంతో కుట్రలకు పాల్పడుతున్నారు. ఎక్స్ అఫిషియో హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం వైయస్ఆర్‌సీపీ తరపున ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను టీడీపీ నేతలు.. అర్థరాత్రి కిడ్నాప్ చేశారు. ఫోన్ చేసినా స్పందించని పోలీసులు 45వ డివిజన్ కార్పోరేటర్ అనీష్ అనీష్ భార్య డాక్టర్ మమతను కూడా కిడ్నాప్ చేసి బెదిరించాలని కూటమి నేతలు ప్రయత్నం చేశారు. సమాచారం తెలసుకున్న వైయస్ఆర్‌సీపీ నాయకులు వెంటనే అనీష్ రాయల్ సతీమణి మమతను ఆర్‌సీ రోడ్డులోని రాయల్ నగర్‌లో పార్టీకి చెందిన నాయకుడి ఇంట్లో సురక్షితంగా ఉంచారు. ఆ సమాచారం తెలుసుకున్న కూటమి నేతలు సోమవారం అర్ధరాత్రి ఆ ఇంటి వద్దకు వెళ్లి తలుపులు కొట్టారు. దీంతో భయపడ్డ మమత పోలీసులకు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో భూమన అభినయ్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. వెంటనే అభినయ్ రెడ్డి, నాయకులు అక్కడకు చేరుకున్నారు. కూటమి నాయకులు వారిని అడ్డుకుని కార్లను ధ్వంసం చేశారు. అభినయ్ డ్రైవర్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్, పార్టీ నాయకుడు కౌసిక్‌లపై దాడి చేయగా, అభినయ్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ నాయకులు ఇంట్లోకి వెళ్లిపోయారు. తర్వాత అభినయ్ రెడ్డి ఎంపీ గురుమూర్తికి ఫోన్ చేశారు. వెంటనే ఎంపీ గురుమూర్తి, కొంతమంది వైయస్ఆర్‌సీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ సమాచారంతో పోలీసులు రాగా, మమతను సురక్షితంగా భూమన కరుణాకర రెడ్డి ఇంటికి చేర్చారు. ప్రశాంతతకు మారుపేరైన తిరుపతి నగరాన్ని అరాచకాలకు అడ్డగా అధికార పార్టీ నేతలు మార్చారని స్థానికులు మండిపడుతున్నారు.