విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల రాష్ట్రంలో స్కూల్ విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడారు. ‘తల్లికి వందనం పథకానికి చంద్రబాబు సర్కార్ ఎగనామం పెట్టడం దారుణం. ఎన్నికల ముందు ప్రతీ బిడ్డకు రూ.15000 చొప్పున ఇస్తామన్న మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి. తల్లికి వందనం పేరుతో తల్లి, బిడ్డలకు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా చంద్రబాబు లక్షలాది మంది తల్లులకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని తెచ్చారని గుర్త చేశారు. ఇప్పుడు చంద్రబాబు నిర్వాకం వల్ల మళ్ళీ డ్రాప్ ఔట్స్ పెరిగే అవకాశం ఉంది. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నను తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.