కూటమి నేతలపై 420 కేసులు పెట్టాలి

రాష్ట్ర మహిళలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి

కూటమి నయవంచనను భరించే స్థితిలో మహిళలు లేరు

వైయస్ఆర్‌సీపీ  అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఫైర్

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల

సూపర్ సిక్స్ వాగ్ధాన పత్రాలపై కూటమి నేతలు సంతకాలు చేశారు

అధికారంలో ఉండి వాటిని అమలు చేయడం లేదు

ఇదేనా మీ సంతకాలకు ఉన్న విలువ?: నిలదీసిన ఆరె శ్యామల

తాడేపల్లి: ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన కూటమి నేతలపై 420 కేసులు పెట్టాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల డిమాండ్ చేశారు. హామీల అమలులో విఫలమైన చంద్రబాబు రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వ నయవంచనను భరించే స్థితిలో మహిళలు లేరని అన్నారు.  

మళ్ళీ మళ్ళీ మోసం..

ఎన్నికల సమయంలో అధికారమే పరమావధిగా చంద్రబాబు అమలు చేయలేని హామీలతో ప్రజలను నమ్మించాడు. రాజకీయాలలో శుష్కవాగ్ధానాలు చేయకూడదు అనే విషయాన్ని ఏనాడు చంద్రబాబు పట్టించుకోలేదు. అక్కచెల్లెమ్మలను మళ్ళీ మళ్ళీ నమ్మించి మోసం చేస్తున్నాడు. ఆయన చేసిన హామీలు నిలబెట్టుకోలేకపోగా జగన్ గారు ఇస్తున్న పథకాలను నిలిపివేసి మహిళలకు తీవ్ర ద్రోహం చేశాడు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో పెద్ద ఎత్తున బ్రాండింగ్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్‌ తో సహా కూటమి నేతలు ఈ హామీలను ఒక పేపర్ లో రాసి, సంతకాలు చేసి మరీ ప్రజలకు వాగ్ధానం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత వీటి ఊసే లేదు. ఆరోజు మీరు పెట్టిన సంతకాల విలువ ఇదేనా? 

 గ‌ద్దె దించేందుకు మ‌హిళ‌లు సిద్ధం:

కూటమి ప్రభుత్వం ఎందుకు పదేపదే మహిళలను మాయమాటలతో నమ్మించి మోసం చేస్తోంది? ఇది అన్యాయం కాదా? కూటమి నేతలు చేస్తున్న మోసాలకు మీ పైన 420 కేసు పెట్టవచ్చు. కూటమి నాయకులకు ఇటువంటి మోసాలు కొత్తకాదు. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలకు ఆశ కల్పించి, అధికారంలోకి వచ్చిన తరువాత యథావిధిగా ఎగ్గొట్టారు. ఆనాడు వారు ఇచ్చిన హామీల పత్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్రమోదీ ఫోటోలు కూడా ఉన్నాయి. అమాయక మహిళలకు ఏం చెప్పినా నమ్ముతారు, తేలికగా మోసం చేయవచ్చు అని అనుకుంటున్నారు. మహిళలు ఈ రోజు మీ మాటలపై అమలు ఏదీ అని నిలదీసేందుకు సిద్దంగా ఉన్నారు. మిమ్మల్ని గద్దె దించేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి ఏపీలోని మహిళల పక్షాన ఎక్స్ వేదికగా చంద్రబాబును నిలదీశారు. 

తల్లికి వందనం పేరుతో దగా:

తల్లికి వందనం పేరుతో మహిళలను దగా చేశారు. ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు. గతంలో జగన్ గారు అమ్మ ఒడి పేరుతో ఇస్తున్న దానిని కూడా నిలిపివేశారు. మీరు ఇవ్వాల్సిన తల్లికి వందనంను ఎగ్గొట్టారు. మీ పైన నమ్మకం ఉంచిన తల్లులకు ఈ రోజు ఏం చెబుతారు? స్కూల్ కు వెడుతున్న విద్యార్ధుల భవిష్యత్తుకు మీరేం దారి చూపిస్తారు? ఈ రోజు జగన్ గారు అధికారంలో ఉండి ఉంటే ఇలా జరిగేదా అని తల్లులు ఆలోచిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికీ వెళ్ళి నీకు పదిహేను... నీకు పదిహేను అంటూ స్కూల్ కు వెళ్లే పిల్లలను చూపి, వారి తల్లులను మాయ చేశారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న రామానాయుడు ఆనాడు తల్లికి వందనం మీద ఎలా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ప్రతి గ్రామానికి వెళ్ళి ఏ విధంగా ప్రచారం చేశారో, ఆ దృశ్యాలు నేటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మీకు ఆ డబ్బులు వస్తాయంటూ బాండ్ కూడా రాసి ఇచ్చామంటూ ఆయన భారీగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పేదలు దీనిపై నోరు మెదపడటం లేదు.

అమ్మ ఒడి కింద రూ.26.067 కోట్లు ఇచ్చారు 

వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది విద్యార్ధులకు మేలు చేసేలా రూ. 26,067 కోట్లు అయిదేళ్ళలో అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని నిలిపివేశారు. ఇప్పుడు తాజా కేబినెట్ లో ఈ ఏడాది తల్లికి వందనం అమలు చేయడం లేదని చెప్పేశారు. మీకు నిజంగా మహిళలకు ఇచ్చిన మాట మీద చిత్తశుద్ది ఉంటే, అదే మహిళల ముందుకు వచ్చి తల్లికి వందనం ఇవ్వడం లేదని చెప్పాలి. మమ్మల్ని క్షమించండి అని అడగాలి. కూటమి నాయకులు ఏపీలోని మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి.
 

ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు...:

ఎన్నికల సమయంలో ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలన్నదే కూటమి నేతల లక్ష్యం. ఏరు దాటిన తరువాత తెప్ప తగలేశారు అనే సామెతను నిజం చేస్తూ నేడు కూటమి నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారు. ఆడబిడ్డ నిధి పేరుతో 19-59 ఏళ్ళ వయస్సు ఉన్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్నారు. ఇందుకు అర్హులైన వారు రాష్ట్రంలో 2.7 కోట్ల మంది ఉన్నారు. వీరికి మీరు ఇస్తానన్న లెక్క ప్రకారం మొత్తం రూ.37,313 కోట్లు ఇవ్వాల్సి ఉంది. తల్లికి వందనం కింద 83 లక్షల మంది విద్యార్ధులకు గానూ ఏడాదికి మొత్తం రూ.12,450 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మీరు ఇస్తామన్న మూడు సిలెండర్ల దీపం పథకం కింద మొత్తం ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉన్న వారు రాష్ట్రంలో 1,54,47,061 మంది ఉన్నారు. మీరు ఇస్తానన్న మూడు సిలెండర్లకు గానూ ఏడాదికి రూ. 4,115 కోట్లు అవసరం అవుతాయి. కానీ మీ బడ్జెట్ లో ప్రకటించింది సుమారు రూ.800 కోట్లు. అంటే మీరు కేవలం ఒక్క సిలెండర్ మాత్రమే ఇవ్వాలనే నిర్ణయంతో ఉన్నారని అర్థం చేసుకోవాలా? అలాగే ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఊదరగొట్టారు. దసరా, దీపావళి, క్రిస్మస్, కొత్త సంవత్సరం అన్నారు. ఇప్పుడు ఏప్రిల్ నెల నుంచి అంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమలులో ఇన్ని వాయిదాలు ఎందుకు? 

లోకేష్‌..జాబ్ క్యాలెండర్ ఏదీ?

కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని ఈ ఆరు నెలల్లో నెరవేర్చలేదు. ఆనాడు నారా లోకేష్ మాట్లాడుతూ 2025 జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాము, డేట్, టైం రాసిపెట్టుకోండి అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. ప్రతి సంవత్సరం ఇలా ప్రకటిస్తామని కూడా అన్నారు. గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మేం సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు చెప్పినట్లు డేట్, టైం రాసిపెట్టుకున్నాం. ఎక్కడా ఆ జాబ్ క్యాలెండర్? ఎప్పుడు దానిని ప్రకటిస్తారు? రాష్ట్రంలో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయి, వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారు, ఎప్పుడు నోటిఫికేషన్ ప్రకటిస్తారు, ఎప్పుడు వాటి భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తారు, ఎప్పుడు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇస్తారూ అని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నారా లోకేష్ గారూ వారికి సమాధానం చెప్పండి. ఉద్యోగం ఇవ్వలేక పోతే నిరుద్యోగులకు భృతి ఇస్తామని కూడా చెప్పారు. ఎక్కడా నిరుద్యోగ భృతి?

మహిళా సంక్షేమం వట్టి మాట

మహిళా సంక్షేమం గురించి ఎన్ని మాటలు చెప్పారో మరిచిపోయారు. స్వయం సహాయక బృందాలకు రూ.3 నుంచి రూ.10 లక్షలకు వడ్డీ లేని రుణాలను పెంచి ఇస్తామని చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పీ4 పథకం, అంగన్ వాడీ కార్యకర్తలు, వాలంటీర్లకు న్యాయం చేస్తానని అన్నారు. పెళ్ళికానుక, పండుగ కానుకలు అంటూ చెప్పారు. ఏ ఒక్కటీ అమలు చేసే ఉద్దేశమే కనిపించడం లేదు. మీ హామీలకు రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నాయి. 
 

సంపద అంతా చంద్రబాబుకే

చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి అంటే రాష్ట్ర ప్రజలకు అని అనుకున్నాం. కానీ తమకే ఆ సంపద అని తెలియదు. దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా గుర్తింపు పొందిన చంద్రబాబును ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ప్రతి దాన్నీ ప్రైవేటీకరించడమే సంపద సృష్టా? నిరుపేదలకు ఆరోగ్యభద్రతను ఇచ్చే ఆరోగ్యశ్రీని వైయస్ జగన్ గారు బలోపేతం చేస్తే, నేడు చంద్రబాబు దానిని ప్రైవేటీకరిస్తున్నాడు. పేదలు అంటే గౌరవం లేదు, ఇచ్చిన హామీలను అమలు చేయాలనే బాధ్యత లేదు. ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం అధికారంను అనుభవిస్తూ 'సీజ్ ద షిప్' అంటూ డైలాగులు చెప్పడానికే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను ముందు సీజ్ చేయండి.  ప్రజల తరుఫున వైయస్ఆర్సిపి ప్రశ్నిస్తుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను తెలుసుకుంటున్న ప్రజలు తిరిగి వైయస్ జగన్ గారిని అధికారంలోకి తీసుకురావడం ఖాయమ‌ని శ్యామ‌ల పేర్కొన్నారు..

Back to Top