తాడేపల్లి: విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని చూస్తే కూటమి నాయకుల కడుపులు మండిపోతున్నాయని, ఎలాగైనా ఆ విగ్రహాన్ని తొలగించి స్వరాజ్ మైదాన్ ప్రాంతాన్ని లూలూ గ్రూప్‌కి ఇచ్చేయాలన్న కుట్ర జరుగుతోందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశమంతా అంబేడ్కర్ రాజ్యాంగంతో పాలన జరుగుతుంటే ఏపీలో మాత్రం రెడ్ బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత... ప్రపంచ మేధావి, పేద బడుగు వర్గాలకు మేలు చేసిన అంబేడ్కర్ విగ్రహానికి కూడా కూటమి నేతలు నివాళులు అర్పించని విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ పేరును దుండగలు తొలగించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. తాజాగా రెండు రోజుల క్రితం అంబేద్కర్ పేరు కూడా తొలిగించి రాజ్యాంగ నిర్మాతను ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... విడతల వారీగా ఆయన విగ్రహాన్ని తొలగించే కుట్రకు తెరలేపారా అనే అనుమానాలు కలుగుతున్నాయని జూపూడి ఆందోళన వ్యక్తం చేశారు. మహనీయుడు అంబేడ్కర్ విగ్రహాన్ని అడవుల్లో పెట్టాలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో వైయస్ జగన్ పేరును తొలగించినప్పుడే వైయస్ఆర్‌సీపీ నాయకులు, అంబేడ్కర్ వాదులు పోలీసులకు, నేషనల్ ఎస్సీ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తే... విగ్రహం ఏర్పాటు చేసిన వారి పేరునే ఉంచాలని ప్రభుత్వానికి చెప్పినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న కారణంగానే తాజాగా అంబేడ్కర్ పేరును కూడా తొలగించే ధైర్యం చేశారని ఇది కచ్చితంగా ప్రభుత్వ ఉదాసీనతేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ వ్యతిరేక విధానాలకు టీడీపీ, జనసేన వత్తాసు అంబేడ్కర్ వ్యతిరేక.. బీజేపీ విధానాలకు జనసేన, టీడీపీ నాయకులు వత్తాసు పలుకుతూ ఆయన పేరును శాశ్వతంగా ప్రజల మనసు నుంచి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. విజయవాడ నడిబొడ్డున రాజ్‌భవన్, కలెక్టర్ కార్యాలయం పక్కనే ప్రభుత్వ కార్యాలయాల మధ్యన ఉన్న అంబేడ్కర్ విగ్రహం విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటే.. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు. తక్షణమే ఈ ఘటనకు కారణమైన ఆకతాయిలను పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అంబేడ్కర్ వాదుల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.