గాలివీడు ఘటనపై విచార‌ణ జ‌రిపించాలి

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డికోట‌ శ్రీకాంత్‌ రెడ్డి

అన్నమయ్య: గాలివీడు ఎంపీడీవో ఘటనలో పూర్తి స్థాయి విచారణ జరపాలని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డికోట‌ శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎంపీపీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతోనే సమస్య పెద్దది అయ్యిందని చెప్పారు. కాల్‌డేటా తీసుకుని విచారిస్తే వాస్తవాలు ఏంటనేది తెలుస్తుంది అంటూ కామెంట్స్‌ చేశారు.

మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ మీడియాతో మాట్లాడుతూ..‘గాలివీడు ఎంపీడీవో ఘటనలో పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఎంపీడీవో కార్యాలయ అధికారులు పిలిస్తేనే సుదర్శన్‌రెడ్డి అక్కడికి వెళ్లారు. ఎంపీపీ అయిన తన తల్లి సంతకం కావాలని ఎంపీడీవో కార్యాలయ అధికారులు కోరారు. ఎంపీపీకి చెందిన సామాగ్రి లోపల ఉందని, తాళాలు తీయాలని ఆయన అడిగారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. దాన్ని రాజకీయం చేస్తున్నారు.

ఎంపీడీవో రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతోనే సమస్య పెద్దదైంది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ హింసను ప్రోత్సహించకూడదు. ఘటన జరగకముందే టీడీపీ నేతలు అక్కడకు ఎలా చేరారు. వారు ఎంపీడీవో కార్యాలయం వద్ద చేసిన హంగామాపై విచారణ చేయాలి. ఈ ఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్ని వివరాలు తెలుకోవాలి. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయన్ను కోరుతున్నాను. ముందు కాల్‌డేటా తీసుకుని విచారిస్తే వాస్తవాలేంటనేది తెలుస్తుంది. నిజ నిర్ధారణ జరిపిన తర్వాతే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్స్‌ చేశారు. 

Back to Top