తాడేపల్లి: ఎల్లో మీడియా అండతో నిత్యం వైయస్ఆర్‌సీపీపై పచ్చి అబద్దాలతో కూడిన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏపీటీపీసీ మాజీ ఛైర్మన్ కనుమూరి రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. నాటి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై వదంతులు, అపోహలు సృష్టించేలా నిత్యం అసత్యాలను ప్రచారం చేయడం ద్వారానే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందని ఆయన దుయ్యబట్టారు. అవన్నీ అసత్యాలని తేలిందని గుర్తు చేసిన రవిచంద్రారెడ్డి, వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తమ పార్టీకి, ప్రజలకు క్షమాపణ చెప్పి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తేల్చి చెప్పారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రవిచంద్రారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటంలో పవన్ హంగామా: నాడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లి–మంగళగిరి రోడ్డు విస్తరణలో భాగంగా ఇప్పటంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలు తొలగించాలని నోటీసులిచ్చి, గడువు కూడా ఇచ్చారు. గ్రామస్తులు స్పందించకపోవడంతో, గడువు తర్వాత వాటిని తొలగించారు. దీంతో ఆ చర్యను తీవ్రంగా తప్పు పడుతూ ఆనాడు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ర్యాలీగా, ఒక కారు టాప్‌పై కూర్చుని వచ్చారు. గ్రామంలో రోడ్లను ఆక్రమించి కట్టిన షెడ్లు, ప్రహరీలనే కూల్చినా, ప్రభుత్వం రైతుల ఇళ్లు కూల్చిందంటూ ఆరోపించి, తెగ హడావిడి చేశారు. ఇక ఎల్లో మీడియా యథావిథిగా ఏదో బ్రహ్మాండం బద్దలైపోయినట్లు పెద్ద ఎత్తున అసత్యాలను ప్రచారం చేసింది. అప్పటికీ కొందరు రైతులు మాకు ప్రభుత్వం ముందుగానే నోటీసులు ఇచ్చిందని చెప్పినా పవన్ కళ్యాణ్ తన రాజకీయ డ్రామాను ఆపలేదు. దీంతో ఆయన హడావిడి చూసి ఈసడించుకున్న కొందరు గ్రామస్తులు మాకు ఎవరి సానుభూతి అవసరం లేదంటూ ఫ్లెక్సీలు కూడా ప్రదర్శించారు. కానీ ఓ 14 మంది రైతులు మాత్రం తమకు నోటీసులు ఇవ్వకుండానే రోడ్డు విస్తరణ చేపట్టారంటూ హైకోర్టులో కేసులు వేశారు. కేసు విచారించిన హైకోర్టు, అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించి, రైతులకు ముందస్తు నోటీసులు అందాయని, వారు వేసిన పిటిషన్ తప్పంటూ, కేసులు కొట్టేయడంతో పాటు, వారికి లక్ష చొప్పున జరిమానా విధించింది. దాన్ని సవాల్ చేస్తూ, ఆ రైతులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. కేసు విచారించిన సుప్రీంకోర్టు, కింద హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ, రైతుల చర్యను తప్పు బట్టింది. అయితే జరిమానా లక్ష కాకుండా రూ.25 వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాడు తాను చేసిన తప్పుడు పనికి, అసత్య ఆరోపణలకు పవన్‌కళ్యాణ్ ఇప్పుడైనా సిగ్గుపడాలి. అనుచితంగా రైతులను రెచ్చగొట్టి, ఒక అబద్దపు నిందను ప్రభుత్వంపై వేసినందుకు తక్షణం క్షమాపణ చెప్పాలి. (..అని డిమాండ్ చేసిన రవిచంద్రారెడ్డి, నాడు ఇప్పటంలో పవన్‌కళ్యాణ్ చేసిన హంగామా, హడావిడి వీడియో ప్రదర్శించారు) https://x.com/YSRCParty/status/1870035178116325491 విశాఖతీరంలో డ్రగ్స్ అంటూ గోబెల్స్ ప్రచారం: ఇంకా ఎన్నిలకు ముందు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టేందుకు డ్రగ్స్‌తో కూడిన కంటెయినర్ షిప్ ఒకటి విశాఖకు వచ్చిందని పెద్ద ఎత్తున గోబెల్స్ ప్రచారం చేశారు. బ్రెజిల్ నుంచి నౌక ద్వారా వచ్చిన కంటైనర్‌లో 25 వేల కేజీల డ్రగ్స్ ఉన్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మరో అడుగు దిగజారిన ఆయన, ఆనాడు బ్రెజిల్ ప్రభుత్వాధినేతకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పిన, వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈ కంటైనర్ల వ్యవహారంలో బాధ్యుడు అంటూ అర్థంలేని విమర్శలు చేశాడు. దానికి వంత పాడుతూ, ఎల్లో మీడియా కూడా నానా హంగామా చేసింది. అలా అంతా కలిసి రాష్ట్రానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించారు. కాగా, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసిన సీబీఐ, విశాఖకు కంటెయినర్‌తో వచ్చిన షిప్‌లో ఎలాంటి డ్రగ్స్ లేవని క్లీన్ చీట్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. పైగా వారి అధీనంలోని దర్యాప్తు సంస్థే డ్రగ్స్ ఆరోపణలు అవాస్తవాలు అని నిర్ధారించిన తరువాత అయినా చంద్రబాబు తాను చేసిన తప్పుడు ఆరోపణలకు సిగ్గుతో తల దించుకోవాలని రవిచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అంతే కాకుండా అంత పచ్చిగా నిందించినందుకు వెంటనే తమ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు నిజం చెప్పే అలవాటు లేదు: ఆనాడు మా నేత స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి పలు సందర్భాల్లో చంద్రబాబు నైజం గురించి చెబుతూ.. ఆయనకు నిజం చెప్పే అలవాటు లేదనే వారు. ఇది నిజం. కేవలం అబద్ధాలే పునాదులుగా, ఎల్లో మీడియా దన్నుగా చంద్రబాబు అధికారంలోకి వస్తున్నారు. తాజాగా సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి, ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారు. ఈ ఆరు నెలల్లో ఆ హామీలను విస్మరించడంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. అందుకే చంద్రబాబు చేస్తున్న ప్రతి మోసాన్ని ప్రజల గొంతుకగా మేం ప్రశ్నిస్తాం. చంద్రబాబు అబద్దాలను, మోసపూరిత విధానాలను ఎండగడతామని కనుమూరి రవిచంద్రారెడ్డి వెల్లడించారు.