నిప్పుగారు రప్పరప్పా మని ప్రచారం చేస్తున్నారు. నిండు ఎండలో మండిపోతూ ప్రసంగాలు చేస్తున్నారు. ఊపుమీద మాట్లాడుతూ మనసులోని బాధను వెళ్లగక్కేస్తున్నారు. * ప్రజలు వద్దంటే ఒక నమస్కారం పెట్టేస్తా* అని పుసుక్కున అనేశాడు నిప్పు నాయుడు. అంతే.... అప్పటి దాకా విసుగ్గా కూర్చుని, గాలిలేక, ఊపిరాడక, చేతికిచ్చిన కరపత్రాలతో విసురుకుంటున్న జనాలంతా ఒక్కసారి లేచి నిలబడ్డారు. రెండు చేతులూ పెకెత్తి నమస్కారం పెట్టేసారు. కాస్త పొట్టిగా ఉండి వేదికపై వాళ్లకి కనిపించం అనుకున్నవాళ్లు కుర్చీలపైకి ఎక్కి మరీ చేతులెత్తి నమస్కారం పెట్టడం మొదలెట్టారు. నమస్కారం నమస్కారం. నమస్కారం. నమస్కారం అంటూ ప్రతి ఒక్కరూ గొంతు చించుకుని అరవడం మొదలు పెట్టారు. సభ అంతా ప్రజలు పెట్టే నమస్కారాలతో మారుమోగిపోతోంది. ఎవ్వరూ నమస్కారం పెట్టడం ఆపడం లేదు. ఇదేంటయ్యా పిఏ ఇలా అందరూ ఒక్క ఉదుటున నిలబడి నమస్కారం పెడుతున్నారు. నా మీద అంత అభిమానం ఒక్కసారి పొంగుకొచ్చిందేంటి? ఏమయ్యుంటుంది?? ఉక్కిరిబిక్కిరౌతూ.... ఆశ్చర్యపోతూ అడిగాడు నిప్పు నాయుడు. అదా సార్ నమస్కారానికి ప్రతి నమస్కారం మన తెలుగువాళ్ల సంస్కారం కదండీ. అందుకే అందరూ అలా పెడుతున్నారు చెప్పాడు పిఏ. అంటే అర్థం కాక అడిగాడు నిప్పు. అదేనండీ మీరిప్పుడే అన్నారు కదా *ప్రజలు నన్ను వద్దంటే నమస్కారం పెడతా* అని...మీ నమస్కారానికి ఇప్పుడే వాళ్లు ప్రతి నమస్కారం పెట్టి మీ నిర్ణయానికి తమ మద్దతు, కృతజ్ఞతలు చెబుతున్నారన్నమాట. ఎప్పుడు మీరు రాజకీయాలకు, ఈ రాష్ట్రానికీ, ఈ ప్రజలకు నమస్కారం పెట్టి వెళ్లిపోతారాఅని వాళ్లంతా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టున్నారు సర్ వినయంగా వివరించాడు నిప్పు నాయుడి పిఏ. మండుటెండలో మండి మసై పోయాడు నిప్పు నాయుడు...మళ్లీ తెలుగు ప్రజలకు కనిపించనేలేదు...