టీటీడీ గోశాలలో ఆవుల మృత్యుఘోషపై టీడీపీ రాజకీయం

నిజాలు నిరూపించాలని టీడీపీ అధ్యక్షుడు పల్లా సవాల్

సవాల్‌కు స్పందించి వెళ్ళేందుకు సిద్దమైతే పోలీసులతో అడ్డుకున్నారు

గోమరణాలను నిరూపిస్తామనే భయంతోనే గృహనిర్భందం

మండిపడ్డ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ టీటీడీ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి

సవాల్ చేసిన టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తోకముడిచారు

టీడీపీ ఎమ్మెల్యేలతో ఫోన్‌లో గోశాలకు రావాలంటూ కవ్వించారు

కనీసం అయిదుగురినైనా పంపాలన్నా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అంగీకరించలేదు

జిల్లా ఎస్పీతో అబద్దాలు చెప్పించారు

మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం

గోశాలలో ఏడాదిలో 191 గోవులు మరణించాయని అంగీకరించిన టీటీడీ

ఒక్క గోవు కూడా చనిపోలేదన్న సీఎం చంద్రబాబు

22 ముసలి గోవులు మాత్రమే మరణించాయన్న టీటీడీ చైర్మన్

43 గోవులు చనిపోయాయన్న టీటీడీ ఈఓ

వారు చెబుతున్న సంఖ్య కన్నా ఎక్కువగానే గోవులు మృతి చెందాయి

జిల్లా ఎస్పీ మధ్యవర్తిత్వం వహిస్తే టీడీపీ వారి సమక్షంలోనే నిరూపిస్తాను

మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్

తిరుపతి: టీటీడీ గోశాలలో గోవుల మరణాలపై టీడీపీ రాజకీయం చేస్తోందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గోవుల మృతిని నిరూపిస్తారా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విసిరిన సవాల్‌ను స్వీకరించి, గోశాలకు వెడుతున్న తనను పోలీసులతో బయటకు రానివ్వకుండా గృహనిర్భందం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సవాల్ చేసిన పల్లా శ్రీనివాసరావు తోకముడిచి పత్తా లేకుండా పోయారని అన్నారు. ఒకవైపు ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా వందల మంది పోలీసులను మోహరించారు, మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు గోశాలకు వెళ్ళి మేము రావడం లేదని చిల్లర రాజకీయం చేయడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు. సాధుపుంగవులు, హిందూధార్మికవేత్తల సమక్షంలో టీడీపీ వారికి గోవుల మరణాలపై వాస్తవాలను నిరూపించేందుకు సిద్దంగా ఉన్నామని సవాల్ చేశారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

బయటకు రాకుండా ఇంటి ముందు పోలీసుల హంగామా

తెలుగుదేశం అధికారిక ఎక్స్‌ వేదికగా ఆ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన పోస్ట్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది, రేపు ఉదయం పదిగంటలకు తిరుమల గోశాలకు రావాలి, వాస్తవాలు తేల్చుకుందామని సవాల్ చేశారు. ఆయన సవాల్‌ను స్వీకరించాను. నిజాలను నిరూపించేందుకు వస్తున్నానని ప్రకటించాను. దీనితో అర్థరాత్రి నుంచే నాతో పాటు మా మేయర్, ఇతర వైయస్ఆర్‌సీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహనిర్భందంలోకి తీసుకున్నారు. యాబై మందికి పైగా పోలీసులు, ముగ్గురు సీఐలు, చంద్రగిరి డీఎస్పీ కూడా నా ఇంటి వద్దే పోలీస్ పహారాలో ఉన్నారు. ఇంటి నుంచి బయటకు రావద్దని ఆంక్షలు విధించారు. పల్లా శ్రీనివాసరావు చాలెంజ్‌ను స్వీకరించి, నిజనిర్థారణకు వెళ్ళేందుకు సిద్దమైతే నన్ను అడ్డుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మాజీ మంత్రి రోజా, ఎంపీ గురుమూర్తితో పాటు పలువురు నాయకులు బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తే, పోలీసులు మమ్మల్ని అడ్డుకుని, బలవంతంగా తోసివేశారు. దీనికి నిరసనగా రోడ్డుపై బైటాయించి నిరసన తెలియచేశాము. దీనిపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ అయిదుగురు మాత్రమే రావడానికి అనుమతి ఇచ్చాం. కానీ వారు నలబై మంది రావడానికి ప్రయత్నించడం వల్లే అడ్డుకున్నామని ప్రకటించారు. తెలుగుదేశ పార్టీ నుంచి కూడా కొద్దిమందికే అనుమతి ఇచ్చి, పంపించామని జిల్లా ఎస్పీ పచ్చి అబద్దం చెప్పారు. 

కనీసం అయిదుగురికి అనుమతి అడిగినా ఇవ్వలేదు

తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంతో పాటు నేను మొత్తం అయిదుగురం మాత్రమే గోశాల వద్దకు వెడతామని, అనుమతి ఇవ్వాలని ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలీసులను కోరుతూనే ఉన్నాం. కానీ పోలీసులు మాత్రం తెలుగుదేశం శాసనసభ్యులు అక్కడికి వెళ్ళి, వెనుదిరిగిన తరువాత మీ ఒక్కరికి మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఇవ్వన్నీ వందలాది మంది పోలీసుల సమక్షంలోనే జరిగింది. మమ్మల్ని బయటకు రానివ్వకుండా నిర్భందించి, అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. చంద్రగిరి, కాళహస్తి ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధుల ముందు నాకు ఫోన్ కాల్ చేశారు. 'మీ కోసం గోశాల వద్ద చాలా సేపటి నుంచి వేచి ఉన్నామని, మీరు రాలేదంటూ' మాట్లాడారు. పోలీసులు మమ్మల్ని నిర్భందించడం వల్ల రాలేకపోతున్నామని బదులిస్తే, దానిని సదరు ఎమ్మెల్యేలు మీ పక్కన ఒక్క పోలీస్ కూడా లేరు, మీరు కావాలనే అబద్దాలు చెబుతున్నారంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. మీరు మాట్లాడేది తప్పు, మా చుట్టూ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మీరు మాకు ఎస్కార్ట్ ఇప్పించనట్లయితే నిజాలను మీకు చూపించేందుకు సిద్దంగా ఉన్నామని వారికి చెప్పడం జరిగింది. ఆ తరువాత టీడీపీ ఎమ్మెల్యేలు మేం ఎస్కార్ట్ పంపిస్తున్నామని చెప్పినా, ఎంతసేపటికీ ఎస్కార్ట్ మాత్రం రాలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని స్థానికంగా మమ్మల్ని అడ్డుకుంటున్న పోలీసులకు చెప్పి, మమ్మల్ని వెళనివ్వాలని కోరాం. అయినా కూడా వారు మాకు అనుమతి ఇవ్వలేదు. 

ఎప్పుడైనా సరే నిజాలను వెల్లడించేందుకు మేం సిద్దం

నాకు ఎవరైతే సవాల్ విసిరారో, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నా చాలెంజ్‌ను స్వీకరించకుండా తోకముడిచారు. పైగా తెలుగుదేశం, జనసేన నాయకులు మమ్మల్నేదో వారి చాలెంజ్‌ను స్వీకరించకుండా భయపడి పోయామనే విధంగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. రేపు, లేదా ఎల్లుండి, మరెప్పుడు అయినా సరే వారు చెప్పిన సమయానికి కనీసం అయిదు మందికి మాత్రమే అనుమతి ఇచ్చినా, వారికి నిజాలను చూపించేందుకు సిద్దంగా ఉన్నాం. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. టీటీడీ ఈఓ 43 ఆవులు, చైర్మన్ 22 ఆవులు చనిపోయాయని వేర్వేరుగా ప్రకటించారు. స్తానిక ఎమ్మెల్యే 40 గోవులు చనిపోయాయని చెప్పారు. సీఎం చంద్రబాబు ఒక్క ఆవు కూడా చనిపోలేదని చెప్పారు. ఇందులో ఏది నిజమో ప్రజలకు వెల్లడించాలి. నేను ఏ మాట అయితే గతంలో చెప్పానో అదే మాటకు కట్టుబడి ఉన్నాము. ధార్మికసంస్ధల ప్రతినిధుల సమక్షంలో ఇప్పటి వరకు చనిపోయిన ఆవుల కళేబరాలను బయటకు తీయించాలి.

191 ఆవులు చనిపోయాయని టీటీడీ ప్రకటన

గత ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 191 ఆవులు మరణించాయని టీటీడీ గోశాల ఫాం మేనేజర్ ద్వారా టీటీడీ ఈఓ చెప్పించారు. ఇంత కంటే ఎక్కవగాన చనిపోయారనేదే మా వాదన. దీని ప్రకారం జూన్ నుంచి ఇప్పటి వరకు 170 ఆవులు చనిపోయాయని అధికారికంగా టీటీడీ ప్రకటించింది. టీడీపీ ప్రతినిధిలా ఈఓ మాట్లాడుతూ పురుగుల మందును దాణాగా పెట్టారని, విజిలెన్స్ నివేదిక వచ్చిందని చెప్పారు. ఆనాడు గోశాలలో పశువుల దాణాపై వచ్చిన ఫిర్యాదులపై వైయస్ జగన్ గారి ప్రభుత్వ హయాంలో టీటీడీ ఈఓగా ఉన్న జవహర్‌రెడ్డి గారు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆయన స్వతాహగా పశు వైద్య నిపుణుడు గోశాలను సంస్కరించాలనే ఉద్దేశంతో విజిలెన్స్ విచారణ వేయడతో పాటు 550 మేలుజాతి  గోవులను తీసుకురావాలని రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాతల చేత కొనుగోలు చేయించి, శ్రీవారికి విరాళంగా రైలు మార్గంలో తీసుకువచ్చారు. ఎన్డీడీపీతో మాట్లాడి మేలుజారి పశువుల పునరుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. 98 శాతం ఆవుదూడలను ఉత్పత్తి చేసేందుకు 48 కోట్ల రూపాయల విరాళంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇదీ శ్రీవారి పట్ల, గోవుల పట్ల మాకు ఉన్న గౌరవం. ఈ పదినెలల కాలంలో అనేక ఆచారాలకు భిన్నంగా కొండపై కార్యక్రమాలు జరుగుతున్నాయి. అరాచకాలు, హింసాత్మక సంఘటనలు జరిగాయి. అయిదు రోజుల కిందట శివ అనే జీపు డ్రైవర్‌ను కొండపై దారుణంగా హత్య చేశారు.సుమారు డెబ్బై ఏళ్ళ తరువాత ఇటువంటి దారుణం కొండపైన జరిగింది. చెప్పులేసుకుని మహాద్వారం వరకు భక్తులు వచ్చారు. బిర్యానీలు తిన్నారు. బెల్ట్ షాప్ పట్టుబడింది. తాగి కొట్టుకున్నారు. ఇలాంటి అనేక అపచారాలు జరుగుతుంటే పట్టించుకోకుండా ఉన్నారు. 

స్వామివారి ఊరేగింపులో పాల్గొనే వృషభం మరణించింది

స్వామి వారి ఊరేగింపులో ఉండే వృషభం కూడా చనిపోయింది. స్వామి వారి వద్ద పూజలు అందుకునే గోవు కూడా చనిపోయింది. వాస్తవాలను వెల్లడిచేసేందుకు సాధుపుంగవులు, హిందూ ధార్మికవేత్తల సమక్షంలో చనిపోయిన గోవుల కళేబరాలను వెలికితీసి, వాస్తవాలను ప్రజలకు చూపించడానికి సిద్దం. గతంలో చంద్రబాబు నాపైన టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు అనేక ఆరోపణల చేశారు. నిరూపించాలని ఆమరణ దీక్ష చేసినా ఆయన స్పందించలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వాస్తవాలను చూపించాలన ప్రయత్నిస్తే పోలీసులు ఉక్కుపాదంతో మమ్మల్ని అడ్డుకుంటున్నారు. నా మీద బీఆర్ నాయుడి చానెల్ టీవీ5, ఏబీన్ టీవీలు నాస్తికుడని, క్రైస్తవుడని, నీచుడని ఇష్టం వచ్చినట్లు నిందలు వేశారు. గత మూడు నెలలుగా టీటీడీ చేస్తున్న అరాచకాలను ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. టీటీడీ చరిత్రలో ఎక్కువ సార్లు ట్రస్ట్‌బోర్డ్ సభ్యుడు, చైర్మన్ అయిన వ్యక్తిని నేను. స్వామి వారి కరుణ లేకపోతే ఎవరైనా కొండపై ఎవరికైనా ఇటువంటి అవకాశం లభిస్తుందా?  సాహీవాల్ ఆవు రైలుకింద పడి చనిపోతే దాని చెవులకు ఉన్న టీటీడీ ట్యాగ్‌ను కట్ చేసిన ఘనులు. నేను చూపించన ఫోటోలు మార్ఫింగ్ చేసినవి కావు, నిజమైనవే. 

మీడియా సమావేశంలో  ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ...

గోశాలలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డికి ఫోన్ చేసి మేం వెయిట్ చేస్తున్నాం, మీరు ఇంకా రాలేదని అడిగారు. పోలీసులు అడ్డుకుంటున్నందున రాలేకపోతున్నామని ఆయన చెప్పారు. ఇది విన్న నేను, అభినయ్‌రెడ్డి ఇంటి వెనుక ద్వారం నుంచి పోలీసులను తప్పించుకుని గోశాలకు వెళ్లాం. నన్ను మాత్రమే గోశాలలోకి అనుమతించారు. అభినయ్‌రెడ్డిని అరెస్ట్ చేసి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా టీడీపీ ఎమ్మెల్యేలను సూటగా ప్రశ్నించడం జరిగింది. ఒకవైపు గోశాలకు రావాలని కోరుతూ, కరుణాకర్‌రెడ్డి ఇంటి ముందు మాత్రం పోలీసులను పెట్టి అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించడం జరిగింది. సవాల్ చేసి పల్ల శ్రీనివాస్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం లేదు. సమస్యను పక్కదోవ పట్టించేందుకే టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు.

Back to Top