పల్నాడు: దాచేపల్లి పోలీసు స్టేషన్‌కు సీఐ బేడీలు వేసి చరిత్ర సృష్టించారని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి దాచేపల్లి స్టేషన్‌కు తరలించగా, ఆమె కోసం స్టేషన్‌కు వెళ్లిన వైయస్ఆర్‌సీపీ నేతలను అడ్డుకునేందుకు సీఐ పోలీస్ స్టేషన్‌కు బేడీలు వేసిన తీరును మహేష్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం మీడియాకు విడుదల చేశారు. కాసు మహేష్ రెడ్డి ఏమన్నారంటే.. ఈ ప్రెస్‌మీట్ పెడుతున్నందుకు నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఒక పల్నాడు బిడ్డగా సిగ్గుతో తల దించుకోవాలో దిక్కు తోచడం లేదు. టీడీపీ కూటమి పాలనలో పల్నాడు జిల్లాలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. దాచేపల్లి పోలీసుల చర్యలు వింతగా ఉన్నాయి. నిన్న రాత్రి సోషల్ మీడియా యాక్టివిస్టు కృష్ణవేణిని హైదరాబాద్‌లో అరెస్టు చేసి దాచేపల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఎందుకు అరెస్టు చేశారో తెలుసుకునేందుకు వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆ పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లారు. మా పార్టీ నాయకులు వెళ్లే సరికి పోలీస్ స్టేషన్‌కు తలుపులు వేశారు. ఆ తలుపులకు బేడీలు వేసి దాచేపల్లి పోలీసులు మహిళా కార్యకర్తను దాచారు. శిక్షపడనప్పుడు ముద్దాయిలకు బేడీలు వేసిన ఘటనలు చూశాం కానీ, పోలీసులే, వాళ్ల పోలీసు స్టేషన్‌కే బేడీలు వేయడమన్నది దేశ చరిత్రలో ఇదే మొట్టమొదటి సారి వినడం, చూడటం కూడా. ఇంత కన్నా సిగ్గుచేటు అధికారులకు, ఈ ప్రభుత్వానికి ఉంటుందా?. ఇలాంటి చర్యల పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి.ఇంత గొప్ప పని చేసిన దాచేపల్లి సీఐ చరిత్రను ఇటీవలే వైయస్ జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అతనిపై అన్ని రకాల ఎంక్వైరీలు ఉంటాయి. ఇప్పటికే ఆ సీఐ వైయస్ఆర్‌సీపీకి చెందిన నలుగురు, ఐదుగురు కార్యకర్తలను కొట్టాడు. హై కోర్టులో అతనిపై కేసు వేశాం. తంగేళ్ల లాంటి ఊర్లలో రూ.30, 40 లక్షలు కావాలని సీఐ డిమాండ్ చేసినట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే సొంత పోలీసు స్టేషన్‌కే బేడీలు వేశాడు. ఇటువంటి గొప్ప చర్య చేసినందుకు నేనైతే డిమాండ్ చేస్తున్నాను. బేడీలు వేసిన సీఐకి రేపు ఇండిపెండెంట్ డేకు కచ్చితంగా అవార్డు ఇవ్వాలి. ఇలాంటి పోలీసు ఆఫీసర్ ఎక్కడా కనబడడు, దొరకడు కూడా. పైగా వైయస్ఆర్‌సీపీ నాయకులు పోలీసు స్టేషన్‌కు రాకూడదని సీఐ అంటున్నాడు. ఎందుకు రాకూడదు. పోలీసు స్టేషన్ అన్నది ప్రభుత్వ కార్యాలయం. ఎవరైనా రావొచ్చు. వైయస్ఆర్‌సీపీ వాళ్లు రావద్దని స్టేషన్‌కు బోర్డు పెట్టండి మా పార్టీ వాళ్లు రారు. వీటన్నింటిపై రేపు మా ప్రభుత్వం వచ్చాక విచారణ జరుపుతుంది. సొంత పోలీసు స్టేషన్‌కు బేడీలు వేసిన ఈ సీఐని డీజీపీ, ఈ ప్రభుత్వం ఎలా శిక్షిస్తుందో సమాధానం చెప్పాలి.