విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రభుత్వ అండతో కూటమి పార్టీలు తమ అవినీతి సంపాధన కోసం పరిశ్రమలపై వేధింపులకు పాల్పడుతున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తైనాల విజయ్‌కుమార్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. కూటమి పార్టీ నేతల అరాచకాలతో రాష్ట్రంలోని పరిశ్రమల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఈ సందర్బంగా బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిందాల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలన వేధించి రాష్ట్రం నుంచి సాగనంపారని, ఇప్పుడు కడప జిల్లాలోని సిమెంట్ పరిశ్రమలను మూయించే కార్యక్రమం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... సీఎం చంద్రబాబు ఎక్కడ మాట్లాడిన రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా ఉన్నాయి, పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టబడులు పెట్టేందుకు వస్తున్నాయని, వేల కోట్లుతో కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం చూస్తే ఉన్న పరిశ్రమలనే మామూళ్ళ కోసం, కాంట్రాక్ట్‌ల కోసం బెదిరించి, రౌడీయిజంతో భయబ్రాంతులకు గురి చేసి పారిపోయేలా కూటమి పార్టీల నాయకులు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో ముడుపుల కోసం పరిశ్రమలను మూయించారు. తాజాగా కడప జిల్లాలో సిమెంట్ పరిశ్రమపై జరిపిన దౌర్జన్యం అందరూ చూశారు. మూడు నాలుగు నెలల కిందట విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కర్మాగారం వద్ద ఫ్లైయాష్ కోసం చేసిన గొడవ అందరికీ తెలుసు. కృష్ణపట్నంలో పవర్ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్‌పై ఎలాంటి దౌర్జన్యం చేశారో తెలుసు. ఎచ్చెర్లలో ఉన్న మద్యం ఫ్యాక్టరీని ప్రతి లోడ్ లారీకి మామూళ్ళు ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఏ విధంగా దౌర్జన్యం చేశారో చూశాం. ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. జిందాల్ యాజమాన్యం ఈ దేశంలోనే ప్రముఖ పరిశ్రమల సరసన గుర్తింపు పొందిన సంస్థ. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వారిపై జరిపిన వేధింపులతో వారు మహారాష్ట్రకు వెళ్ళిపోయి అక్కడ మూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎక్కడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పరిశ్రమలను వేధిస్తున్న వారిపై ఎక్కడా చట్టపరమైన చర్యలు లేవు. ముఖ్యమంత్రి మాత్రం పరిశ్రమలకు అనుకూలమైన ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు ఫ్ల్రెండ్లీ వాతావరణంను ఎలా సృష్టిస్తారు. అధికారంను అడ్డం పెట్టుకుని అందరిపైనా జులుం ప్రదర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను అందరూ గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వ అలసత్వం, దుర్మార్గమైన ఆలోచనల వల్ల రాబోయే తరాలు చాలా ఇబ్బంది పడతాయి. రాష్ట్రంలో పరిశ్రమలను బతకనివ్వరా? రాష్ట్రంలో పరిశ్రమలను తమ అవినీతి దాహంతో కూటమి పార్టీల నేతలు బతకనివ్వడం లేదు. ప్రతి పరిశ్రమను నెలవారీ మామూళ్ళు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు. తమ మాట వినకపోతే ఆ పరిశ్రమలపై దాడులు చేస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అశాంతిని కలిగిస్తున్నారు. ఈ వేధింపులను తట్టుకోలేక పరిశ్రమలను మూతపడితే, దానిపై ఆధారపడిన వారి జీవితాలకు ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఇటువంటి అరాచక పరిస్థితులను చూస్తూ కూడా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది? ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న వారిపైన ఎక్కడైనా చర్య తీసుకుందా? దీనికి బదులుగా ఆయా పరిశ్రమలపై దాడులు చేసిన వారికి వాటాలు పంపకంపై కూటమి ప్రభుత్వ పెద్దలే పంచాయతీలు చేస్తున్నారు. పరిశ్రమలపై దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం ఎక్కడైనా చర్య తీసుకుందా? పైగా వాటాలను పంచడానికి పంచాయతీలు చేస్తున్నారు. రైతాంగాన్ని గాలికి వదిలేశారు రాష్ట్రంలో రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. మిర్చిరైతులను ఆదుకుంటాం, కేంద్రంకు లేఖ రాశాం, కేంద్రం సహకారంలో మద్దతుధరకు కొనుగోలు చేస్తామని చంద్రబాబు ఎంతో అట్టహాసంగా చెప్పారు. మార్కెట్ ఇంట్రవెన్షన్ చేసి కనీసం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేశారా? మిర్చి రైతులు రోడ్డు మీదికి వచ్చి ఆందోళనలు చేస్తుంటే కనిపించడం లేదా? పొగాకు రైతులు సైతం మద్దతు ధర లేక అల్లాడుతున్నారు. వ్యవసాయం శుద్ద దండగ అనే నినాదాన్ని చంద్రబాబు సార్థకం చేసుకుంటున్నారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదు ఉపాధి హామీ పథకం కింద ఎనబై రోజుల నుంచి కూలీలు చెల్లించడం లేదు. వేసవిలో పనులు లేక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఏదీ మీ కార్యాచరణ? ప్రతిదానిపైనా డైవర్షన్ పాలిటిక్స్. ఒకవైపు పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారు. దాదాపు రూ.1.48 లక్షల కోట్లు పదినెలల్లో చేయడం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ ఎప్పుడూ చేయలేదు. ప్రజలపై ఈ భారాన్ని మోపినట్లు కాదా? ఏ ప్రభుత్వ శాఖలోనూ జవాబుదారీతనం కనిపించడం లేదు. హామీల అమలులో పెన్షన్లను మాత్రమే అమలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ వేలకొద్ది పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను మంజూరు చేయడం లేదు. విద్యార్ధులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. రాష్ట్రంలో ప్రజలంతా నిరాశానిస్పృహల్లో ఉన్నారు. ఉత్తరాంధ్రలోని చక్కెర ఫ్యాక్టరీని చూస్తే బకాయిలు చెల్లింపులు లేవు, రైతుల గోడు పట్టించుకోవడం లేదు. ప్రశ్నించిన వైయస్ఆర్‌సీపీ నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలను రాజకీయ కారణాలతో అడ్డుకుంటున్నారు. తప్పును ఎత్తి చూపితే ఎదురుదాడి తిరుపతి గోశాలలో గోవుల మరణాలపై కరుణాకర్‌రెడ్డి వాస్తవాలను బయటపెడితే దానిని నిర్ధారించుకుని, సరిచేసుకోవాలి. అంతేకాని వాస్తవాలు చెప్పారని వారిని సవాల్ చేయడం, దమ్ముంటే నిరూపించాలంటూ ఎదురుదాడి చేయడం ఎంత వరకు సమంజసం? గోశాలలో ఆవుల మరణాలు నిజమేనని టీటీడీ ఈఓనే అంగీకరించారు. ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలే తప్ప, కరుణాకర్‌రెడ్డి ఇంటి ముందు పోలీసులతో భీభత్సం సృష్టించడం, ఆయనపై పరుష పదజాలంతో దూషణలకు పాల్పడటం ఎంత వరకు సమంజసం? ఇదేనా అధికారపార్టీకి ఉన్న సంయమనం. తప్పు జరిగితే సరిదిద్దుకోవాలి, దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? చివరికి సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్షసాధింపు చర్యలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. చట్టం ఎక్కడైనా నిస్పక్షపాతంగా పనిచేస్తోందా? కూటమి ప్రభుత్వం కారణంగా చట్టం అంటే ప్రజలకు గౌరవం, భయం లేకుండా పోయింది. వ్యవస్థలను నాశనం చేయడం మంచిది కాదు. విశాఖలోని రూ.1500 కోట్ల విలువైన భూమిని లులూ సంస్థకు కారుచౌకగా కట్టబెడుతున్నారు. దీనిని ఎత్తి చూపినా ప్రభుత్వంలో చలనం లేదు. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రక్రియ పారదర్శకంగా జరగాలి విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిస్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్‌ను కోరాం. ఇప్పటికే వైయస్ఆర్‌సీపీ నుంచి గెలిచిన కార్పోరేటర్లక విప్ జారీ చేయడం జరిగింది. విప్ ధిక్కరించిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. పార్టీ నుంచి కొందరు ఫిరాయించినా, మాకు కౌన్సిల్‌లో బలం ఉంది. ఓటింగ్‌కు వైయస్ఆర్‌సీపీ దూరంగా ఉంటుంది. మాకు మెజారిటీ ఉంది. మా మేయర్ నాలుగేళ్ళపాటు నిజాయితీగా పాలన సాగించారు. అటువంటి బీసీ మహిళపై టీడీపీ కుట్రతో పదవిని దక్కించుకునేందుకు అవిశ్వాసం పెట్టింది.