అమరావతి నిర్మాణంలో అంతులేని దోపిడీ

కాంట్రాక్ట్‌ల ముసుగులో పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ

మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల నుంచి 8 శాతం కమిషన్లు

రూ.వేల కోట్ల అప్పలతో ప్రజల నెత్తిన భారం

మండిపడ్డ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

అనుకూల సంస్థలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు

దేశంలో ఎక్కడా లేని విధంగా రేట్లు పెంపు

నిర్మాణ పనుల్లో పరాకాష్టకు చంద్రబాబు అవినీతి

పారదర్శక విధానాలకు పాతర

రివర్స్‌ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాలకు స్వస్తి

పెంచుకో... పంచుకో.. దాచుకో... విధానంలో చంద్రబాబు

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరారవు ధ్వజం
 

తాడేపల్లి: రాజధాని అమరావతి నిర్మాణంలో అంతులేని దోపిడికి సీఎం చంద్రబాబు తెగబడ్డాడని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణ సంస్థల టెండర్లలో పెద్ద ఎత్తున ప్రజాధనంను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. తమకు కావాల్సిన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక రేట్లకు టెండర్లను కట్టబెట్టారని ధ్వజమెత్తారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల రూపంలో వారికి ముందస్తు చెల్లింపులు చేసి దాని నుంచి ఎనిమిది శాతం కింద ముడుపులు అందుకున్న ఘనుడు చంద్రబాబేనని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

రాజధాని అమరావతి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం ‘పీ–2’ అంటూ ముందుకెళ్తోంది. అదే ‘పెంచుకో. పంచుకో’. అంటే నిర్మాణ వ్యయాన్ని అడ్డగోలుగా పెంచడం. సిండికేట్లతో మిలాఖాత్‌ అవ్వడం, వారికే పనులు అప్పగించడం చేస్తున్నారు. 2014–19 మధ్య కూడా వేల కోట్లు ఖర్చు చేసినా, పనులు ఎక్కడా కొలిక్కి తేలేదు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి దేశంలో ఎక్కడా లేని విధంగా ఖర్చు చేశారు. మళ్లీ ఇప్పుడు శాశ్వత భవనాలు అంటూ, వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటన్నింటి వల్ల, ఇక్కడి రైతులకు కూడా మేలు జరగడం లేదు. ప్రతి పనిలో దోపిడి చేయడం కోసం, భవనాలు మాత్రమే కాకుండా రోడ్ల నిర్మాణ వ్యయాన్ని దారుణంగా పెంచేస్తున్నారు. టెండర్లలో పారదర్శకత, ప్రభుత్వ ఖజానాను కాపాడుకోవడం కోసం గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం.. గతంలో ఎప్పుడూ ఎవరు చేయని విధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో పాటు, జ్యుడీషియరీ ప్రివ్యూ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే నిర్మాణ పనుల్లో యథేచ్ఛ దోపిడికి మార్గం వేసుకుంటూ, ఆ రెండింటినీ రద్దు చేసింది.

రూ.3200 కోట్లు కమిషన్లుగా దండుకున్నారు 

రాజధాని నిర్మాణ పనుల్లో సిండికేట్ వ్యవస్థను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడు. ప్రభుత్వ పెద్దలకు దగ్గరైన వారికే పనులు అప్పగించేలా, ఆ సంస్థల సిండికేట్‌ ఏర్పాటు చేయడం, వాటికి మాత్రమే పనులు అప్పగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడిక్కడ నియమ, నిబంధనలు మారుస్తూ పనులు అప్పగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, రాజధాని టెండర్లు పిలవక ముందే సన్నిహితులకు చెందిన తొమ్మిది కాంట్రాక్టు సంస్థలతో కుమ్మక్కయ్యారు. అలా రాజధాని నిర్మాణ పనుల్లో రూ.9 వేల కోట్ల ప్రజాధనానికి ’టెండర్‌’ పెడుతూ, ఒక్క మొబిలైజేషన్‌ అడ్వాన్సుల్లోనే రూ.3,200 కోట్లకుపైగా ముఖ్యనేత జేబులో వేసుకున్నారు. భవన నిర్మాణాల్లోనే కాకుండా, రోడ్ల నిర్మాణంలోనూ అంచనాలను అసాధారణ స్థాయికి తీసుకెళ్లారు. కిలోమీటరు రోడ్డుకు గరిష్టంగా రూ.64 కోట్లు, భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు గరిష్టంగా రూ.10.043 చొప్పున టెండర్లు ఖరారు చేశారంటే ఏ స్థాయిలో దోపిడి జరుగుతుందో అర్ధమవుతుంది.ఇప్పటికే రూ.40,497 కోట్ల పనులు అధిక ధరలకు తొమ్మిది కాంట్రాక్టు సంస్థల పరం చేయగా, దాని వల్ల ఖజానాపై రూ.1,231 కోట్లకుపైగా భారం పడుతోంది.

రివర్స్‌ టెండరింగ్‌ ఉంటే దాదాపు రూ.4వేల కోట్లు ఆదా అయ్యేది

గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాదిరిగా రివర్స్‌ టెండరింగ్, జ్యుడీషియల్‌ ప్రివ్యూ విధానాలు అమలు చేసి ఉంటే కనీసం రూ.3,500 కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు ఆదా అయ్యేవి. అప్పు తెచ్చిన నిధులతో దోపిడీకి పాల్పడుతూ రాష్ట్రాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం అత్యంత దారుణం. చంద్రబాబు అవినీతి వ్యవహారానికి ఇది పరాకాష్ట. రాజధాని నిర్మాణం కోసం ప్రాథమికంగా రూ.77,249 కోట్లు అవసరమని, ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి అట్టహాసంగా ప్రజెంటేషన్‌ ఇస్తూ చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు ప్రజెంటేషన్‌ పట్ల ఆర్థిక సంఘం సభ్యులు చాలా సంతృప్తి వ్యక్తం చేశారంటూ, ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకున్నారు. రాజధానిలో నిర్మాణా కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.31 వేల కోట్లు అప్పు తేగా, ఇంకా రూ.46,249 కోట్ల అప్పు అవసరమని సీఎం చంద్రబాబు ఆర్థిక సంఘానికి చెప్పారు. అప్పు కింద తెస్తున్న ప్రతి రూపాయికి వడ్డీతో కలిపి చెల్లించాలి కాబట్టి, ఆ డబ్బును ఎవరైనా ఆస్తుల కల్పన కోసం ఖర్చు చేస్తారు. కానీ కూటమి ప్రభుత్వం ఆ పని చేయకుండా యథేచ్ఛగా దోపిడి చేస్తోంది.

కాంట్రాక్ట్‌ల ముసుగులో దోపిడీ

రాజధాని పనుల్లో దోపిడి కోసం సన్నిహితులకు చెందిన తొమ్మిది కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేత సిండికేట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.40,497 కోట్ల విలువైన 63 ప్యాకేజీల పనులను సిండికేట్‌ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఆ మేరకు పనులు అప్పగిస్తూ సిండికేట్‌ కాంట్రాక్టర్లతో సీఆర్‌డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్‌) ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. ఆ వెంటనే అగ్రిమెంటు విలువలో 10 శాతం అంటే, రూ.4,049 కోట్లను మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ముట్టజెప్పాయి. అందులో ఎనిమిది శాతం అంటే రూ.3,239 కోట్లు ముఖ్యనేత వసూలు చేసుకున్నారు. నిజానికి ఈ ప్రాంతంలో అత్యాధునిక హంగులతో భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు ఉంటుంది. ఇంకా అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. పైగా ఇక్కడ ఇసుక ఉచితం. ఈ లెక్కన రాజధానిలో భవనాల నిర్మాణ వ్యయం తగ్గాలి. కానీ వ్యయాన్ని భారీగా పెంచేసి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులను చదరపు అడుగుకు రూ.10,042 చొప్పున అప్పగించడం, కూటమి ప్రభుత్వ దోపిడికి అద్దం పడుతోంది. మిగతా భవనాల నిర్మాణ పనుల్లోనూ అదే తీరు కొనసాగుతోంది.

కావాల్సిన వారికే పనులు కట్టబెట్టారు

రాజధాని పనుల టెండర్లలో సిండికేట్‌ కాంట్రాక్టు సంస్థలు మినహా ఇతరులు బిడ్లు దాఖలు చేస్తే టెక్నికల్‌ బిడ్‌లోనే ఆ సంస్థపై అనర్హత వేటు వేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌కు జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నులతో కాకుండా రూ.7,298 కోట్ల విలువైన పనులు ఇప్పటికే అప్పగించారు. అలాగే సీఎంకు అత్యంత సన్నిహితుడైన మరొకరు కృష్ణారెడ్డికి చెందిన మేఘా సంస్థకు జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నులతో కాకుండా రూ.7,022 కోట్ల విలువైన పనులను అప్పగించేశారు. నిత్యం టీడీపీని జాకీ పెట్టి లేపే ఈనాడు పత్రిక యజమాని కిరణ్‌ సోదరుడు వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.6,031 కోట్లు విలువైన పనులు కట్టబెట్టారు. ఎన్‌సీసీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏవీ రంగరాజు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆ సంస్థకు శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం సహా రూ.6,910 కోట్ల విలువైన పనులు అప్పగించారు. ఎల్‌ అండ్‌ టీ సంస్థకు శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణంతో పాటు రూ.1,427 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. నారా లోకేశ్‌ తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్‌కు అత్యంత సన్నిహితుడు ఎం.వెంకట్రావు. ఆయనకు చెందిన ఎంవీఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థకు రూ.796 కోట్ల విలువైన పనులు అప్పగించారు. చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన బీఎస్‌సీపీఎల్‌ సంస్థకు రూ.779 కోట్ల విలువైన పనులు అప్పగించారు. చంద్రబాబు, నారా లోకేష్, ఇద్దరికీ ఆప్తుడైన కనకమేడల వరప్రసాద్‌కు చెందిన కేఎంవీ ప్రాజెక్ట్స్‌కు రూ.429 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. 

ఎన్‌హెచ్‌ కన్నా రాజధాని రేట్లకు ఎక్కువ వ్యయమా?

దేశంలో జాతీయ రహదారులు నిర్మించే ప్రాదికార సంస్థ (నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా–నహాయ్‌) కి.మీ.కు సగటున రూ.20 కోట్ల చొప్పున ఆరు వరుసలతో కూడిన జాతీయ రహదారులు నిర్మిస్తోంది. కానీ అమరావతిలో అదే ఆరు వరుసల రహదారి నిర్మాణ వ్యయం చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఈ–13 రహదారిని ఎన్‌హెచ్‌–16 వరకూ పొడిగిస్తూ 7.29 కిలోమీటర్ల ఆరు వరసల రహదారి వ్యయం ఏకంగా రూ.466 కోట్లు. అంటే కి.మీ రోడ్డు నిర్మాణ వ్యయం అక్షరాలా రూ.64 కోట్లు. అంటే, జాతీయ రహదారికి కి.మీకు అయ్యే వ్యయం కంటే, కి.మీ ఈ–13 రహదారి వ్యయం రూ.44 కోట్లు అధికం.

సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో ఇన్ని అప్పులా? 

రాజధాని నిర్మాణం కోసం రూ.77,249 కోట్లు అవుతాయని సీఎం చంద్రబాబు చెబుతున్నా, వాస్తవంగా అవన్నీ పూర్తయ్యే సరికి వ్యయం తప్పకుండా లక్ష కోట్లు దాటుతుందని అంచనా. మాట్లాడితే రాజధాని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అని చెబుతారు. కానీ, ఇక్కడ ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి అప్పు రూపంలో వస్తోంది. మరి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది. ఈ ఐకానిక్‌ భవనాల నిర్వహణ వ్యయం ఎంత అవుతుంది? ఇవాళ ప్రభుత్వం చేస్తున్న ప్రతి రూపాయి అప్పు, ప్రజలు తీర్చాల్సిందే. అంటే ప్రజలపై ఎంత భారం పడబోతోంది? ఒక్క మాటలో చెప్పాలంటే అప్పు చేసి పప్పు కూడు అన్నదానికి మరో అర్ధం చెబుతూ.. అప్పు చేసి దోపిడి అన్నట్లుగా ప్రభుత్వ వ్యవహారం మారింది.

Back to Top