గుంటూరు: ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్ట్ చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏంటి? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న పాలేటి కృష్ణవేణిని ములాకత్ ద్వారా పరామర్శించిన వైయస్ఆర్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతి రెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. అనంతరం, మాజీ అంబటి మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి పోలీసులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్.. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదులో కృష్ణవేణిని అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయం వరకు స్టేషన్‌లోనే ఉంచి కనీసం ఆహారం కూడా ఇవ్వలేదు. కృష్ణవేణి పట్ల సీఐ భాస్కర్ అసభ్యంగా మాట్లాడాడు. తాము చెప్పినట్టు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించాడని ఆమె చెబుతోంది. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు పెడతానని సీఐ బెదిరించాడట. కృష్ణవేణి బంధువులు పోలీస్ స్టేషన్‌కు రాకుండా సీఐ స్టేషన్ గేట్లకు బేడీలు వేశాడు. తనను సీఐ భాస్కర్ వేధించారని కృష్ణవేణి మేజిస్ట్రేట్‌కి వాంగ్మూలం ఇచ్చింది. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలి. సీమ రాజా, కిరాక్ ఆర్పీ.. మంత్రి నారా లోకేష్ పెంచుతున్న రోబోలు. మాపైన అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు సీమ రాజా, కిరాక్ ఆర్పీపై మేము పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసులు కట్టరు. వాళ్లని లోకేష్ పోషిస్తున్నాడు కనుక వాళ్లపై కేసులు కట్టడం లేదు. గతంలో పెద్దిరెడ్డి సుధారాణిని 50 రోజులకు పైగా జైలుకు పంపారు. పార్టీ నాయకుల పేర్లు చెప్పమని సీఐ తనను హింసించాడని కృష్ణవేణి చెప్తోంది. మహిళల జోలికి వస్తే ఒప్పుకోనని చెప్పే చంద్రబాబు ఇప్పుడేం చేస్తాడో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.