కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి

అడ్డదోవలో అవిశ్వాసంపై గెలిచి... నైతికంగా ఓడిపోయారు

విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంలో బయటపడ్డ కూటమి కుట్రలు

మండిపడ్డ వైయస్ఆర్‌సీపీ నేతలు

వైయస్ఆర్‌సీపీ విశాఖ సిటీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన  ఉత్త‌రాంధ్ర జిల్లాల రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్‌ కుర‌సాల క‌న్న‌బాబు, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌, ఎమ్మెల్సీలు కుంభా ర‌విబాబు, వ‌రుదు క‌ళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ, తైనాల విజయ్‌కుమార్ త‌దిత‌రులు

ప్రలోభాలు, బెదిరింపులతో వైయస్‌ఆర్‌సీపీ కార్పోరేటర్ల ఓట్లు

పార్టీ విప్ ఉల్లంఘించిన 27 మందిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు

ఒత్తిళ్ళకు తలొగ్గక పార్టీకి అండ‌గా నిలిచిన 32 మంది కార్పొరేట‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు

చావు బ‌తుకుల మ‌ధ్య వారు మేజిక్ ఫిగ‌ర్ చేరుకున్నారు

ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్ఆర్‌సీపీ నేతలు 

విశాఖపట్నం: విశాఖపట్నం మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీలు అడ్డదోవలో గెలిచి, నైతికంగా మాత్రం ప్రజల ముందు ఓటమి పాలయ్యారని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నాబాబు, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌, ఎమ్మెల్సీలు కుంభా ర‌విబాబు, వ‌రుదు క‌ళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ, తైనాల విజయ్‌కుమార్‌లు అవిశ్వాస తీర్మానం తరువాత విశాఖపట్నం సిటీ పార్టీ కార్యాలయంలో  మీడియాతో మాట్లాడుతూ ఈ అవిశ్వాస తీర్మానం సాక్షిగా కూటమి పార్టీల కుట్రలు, కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయని అన్నారు. అధికార బలంతో వైయస్ఆర్‌సీపీ కార్పోరేటర్లను ప్రలోభాలకు గురిచేసి, బెదిరింపులతో భయపెట్టి తమకు అనుకూలంగా ఓటు వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూని చేశారని ‌తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

 ఈ మీడియా సమావేశంలో ఎవరెవరు ఏం మాట్లాడారంటే....

మేజిక్ ఫిగర్‌ కోసం దిగజారిపోయారు: మాజీ మంత్రి కురసాల కన్నబాబు

కేవ‌లం కుట్ర‌లు, కుతంత్రాల‌ను న‌మ్ముకుని విశాఖ మేయ‌ర్ స్థానాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని కూట‌మి పార్టీలు  నెల‌రోజులుగా అడ్డ‌దారులు తొక్కాయి. కోరుకున్న‌ట్టుగానే 74 మంది కార్పొరేట‌ర్ల బ‌లంతో ఈ మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకున్నామ‌ని సంబ‌ర ప‌డుతున్నారు. చావు బ‌తుకుల మ‌ధ్య వారు మేజిక్ ఫిగ‌ర్‌ను చేరుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చావుత‌ప్పి క‌న్న‌లొట్ట‌ పోయిన‌ట్ట‌యింది. అన్ని ప్ర‌య‌త్నాలు చేసినా 74 కే ప‌రిమితం అయ్యారు. కూట‌మి పార్టీలు ఎన్ని ఒత్తిళ్లు చేసినా, బెదిరింపులు దాడులు చేసినా పార్టీకి అండ‌గా నిలిచిన వైయ‌స్సార్సీపీ కార్పొరేట‌ర్ల‌కు చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా. మ‌హిళా కార్పొరేట‌ర్లు చూపించిన తెగువ‌కు ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నా. పార్టీకి అండ‌గా నిలిచిన ప్ర‌తి ఒక్క కార్పొరేటర్‌కి రాబోయే రోజుల్లో స‌ముచిత స్థానం ఉంటుంది. వైయ‌స్సార్సీపీలోనే ఉన్న కార్పొరేట‌ర్ల అంతు చూస్తామ‌ని ఇప్ప‌టికీ బెదిరిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర‌కు అలాంటి సంస్కృతిని తీసుకురావొద్ద‌ని హెచ్చ‌రిస్తున్నా. విశాఖ మేయ‌ర్ స్థానాన్ని ద‌క్కించుకునేందుకు కూట‌మి పార్టీలు తొక్కిన అడ్డ‌దారులు చూస్తే, 1995లో చంద్ర‌బాబు వైస్రాయ్ హోట‌ల్ ఉదంతాన్ని మించి దారుణంగా ఉంది. రాజ‌కీయాల్లో విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త ముఖ్య‌మని చెప్పే  నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ అయితే.. తమకు అధికారం ద‌క్కించుకోవ‌డం కోసం విలువ‌లు విశ్వ‌స‌నీయ‌త‌తో ప‌నిలేదు.. అనుకూల మీడియా ఉంటే చాలు దేన్న‌యినా మార్చేయ‌చ్చ‌ని న‌మ్మే నాయ‌కుడు చంద్ర‌బాబు. మేయ‌ర్ స్థానం జ‌న‌ర‌ల్ రిజ‌ర్వు అయినా యాద‌వ కులానికి చెందిన ఒక బీసీ మ‌హిళ‌ల‌కు నాడు వైయ‌స్ జ‌గ‌న్ మేయర్‌గా అవ‌కాశం క‌ల్పిస్తే.. చంద్ర‌బాబు మాత్రం కుట్ర‌లు కుతంత్రాల‌కు తెరతీసి బీసీ మ‌హిళ‌ల‌ను ప‌ద‌వీచ్యుతురాలిని చేశాడు. గ‌తంలో ఒక‌టో రెండో మున్సిపాలిటీల్లో టీడీపీ విజ‌యం సాధిస్తే వాటిని కూడా కనుసైగ‌తో గెలుచుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ఎవ‌ర్నీ ప్ర‌లోభపెట్టొద్ద‌ని ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను గౌర‌వించాల‌ని వైయస్ జగన్ మాకు చెప్పారు. అలాంటిది కూటమి అధికారంలోకి వ‌చ్చాక కేవ‌లం 10 నెల‌ల ప‌ద‌వి కోసం తొక్క‌ని అడ్డదారులు లేవంటే, జ‌గ‌న్ పాల‌న‌కు చంద్ర‌బాబు వైఖ‌రికి తేడాను గ‌మ‌నించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నా. ప‌ద‌వి మీద త‌ప్ప విశాఖ కార్పొరేష‌న్ మీద ఈ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లేదు. మూడున్న‌ర‌ నెల‌లుగా క‌మిష‌న‌ర్‌ని నియ‌మించ‌లేని అస‌మ‌ర్థ ప్ర‌భుత్వం ఇది. 

కూట‌మి నేతలు ప్ర‌జ‌ల విశ్వాసాన్ని కోల్పోయారు: మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌ 

గ్రేటర్ విశాఖ మేయ‌ర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం కోసం 74 మంది స‌భ్యులు అవ‌స‌ర‌మైతే అతిక‌ష్టం మీద ఆ ఫిగర్‌ను అందుకోగలిగారు. నిన్న‌మొన్న‌టి దాకా కూటమి పార్టీలు తమ వ‌ద్ద 80 నుంచి 85 మంది కార్పోరేటర్లు ఉన్నారంటూ చేసిన ప్ర‌చారమంతా ఉత్త‌దేన‌ని తేలిపోయింది. గ‌త నెల 21న అవిశ్వాస తీర్మానం మీద లేఖ ఇచ్చిన‌ప్పుడే వారికి ఆ బ‌లం లేద‌ని అంద‌రికీ తెలుసు. ఏదొరకంగా మా స‌భ్యుల‌ను ప్ర‌లోభ‌పెట్టి, బెదిరించి, భ‌య‌పెట్టి లాక్కోవ‌చ్చ‌నే ఆలోచ‌న‌తోనే అవిశ్వాసం కోసం లేఖ ఇచ్చార‌ని అర్థ‌మ‌వుతుంది. ఇలా అడ్డ‌దారిలో గెలిచిన కూట‌మి పార్టీ నాయ‌కులు నిజం గెలిచింది, ధ‌ర్మం గెలిచింది, న్యాయం గెలిచింది అంటూ పచ్చి అబద్దాలను వల్లేవేస్తున్నారు. సొంత స‌భ్యుల బ‌లంలేకోపోయినా అడ్డదారిలో గెలిచి, న్యాయం, ధ‌ర్మం గురించి మాట్లాడ‌టం హాస్యాస్ప‌ద‌ం. వారు గెలిచింది కేవ‌లం మేయ‌ర్ పీఠం మాత్ర‌మే. విశాఖ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని, విశ్వాసాన్ని వారు కోల్పోయారు. దాదాపు  27 మంది వైయ‌స్సార్సీపీ కార్పొరేట‌ర్ల‌ను సంత‌లో ప‌శువుల‌ను కొన్న‌ట్టు కొన్నారు. వ్యాపారాల‌ను నాశ‌నం చేస్తామ‌ని బెదిరించి కొంత‌మంది లాక్కున్నారు. మా కార్పొరేట‌ర్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌నే ఉద్దేశంతో క్యాంపులను పెడితే మున్నార్‌లో ఉన్న మా స‌భ్యుల హోట‌ల్ మీద దాడి చేసి ద‌ళిత మ‌హిళా కార్పొరేట‌ర్‌ను కిడ్నాప్ చేయాల‌నే కుట్ర చేశారు. ఎంపీ సీఎం ర‌మేష్ కి చెందిన హెలిక్యాప్ట‌ర్ ద్వారా  మున్నార్ నుంచి కొచ్చిన్‌కి అక్క‌డ్నుంచి స్పెష‌ల్ ప్లైట్‌లో త‌ర‌లించాల‌ని చూశారు. ఆమె రూమ్‌లో ఒంట‌రిగా ఉండ‌గా రాత్రి 1.30 గంట‌ల స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, స్థానికులు, కేర‌ళ పోలీసుల‌తో క‌లిసి వెళ్లి కిడ్నాప్ చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన విద్యావంతురాలైన యాద‌వ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మ‌హిళ అయిన గొల‌గాని హరివెంక‌ట కుమారికి వైయ‌స్ జ‌గ‌న్ మేయ‌ర్‌గా అవ‌కాశం క‌ల్పిస్తే, ఆమెను ప‌ద‌వి నుంచి తొల‌గించడానికి చంద్ర‌బాబు చేయ‌ని దారుణాలు లేవు.  విశాఖ‌ను కార్పొరేట్ల‌కు దోచిపెట్ట‌డానికి కూట‌మి ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుంది. మేయ‌ర్ పీఠం కూడా ఉంటే విశాఖ‌లో చెత్త‌ను కూడా అమ్ముకోవ‌చ్చ‌ని నీచ‌స్థితికి ఈ ప్ర‌భుత్వం దిగజారిపోయింది. విప్‌ను ఉల్లంఘించిన కార్పోరేటర్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.

నైతిక విజ‌యం వైయస్ఆర్‌సీపీ దే: మాజీ ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ 

మేయ‌ర్ పై అవిశ్వాస తీర్మానంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నైతిక విజ‌యం సాధించింది. సొంత బ‌లం లేదు కాబ‌ట్టే అవిశ్వాస తీర్మానం కోసం కూట‌మి నాయ‌కులు నెల‌రోజులు స‌మ‌యం తీసుకున్నారు. అధికార బ‌లంతో, డబ్బుంద‌న్న అహంకారంతో స్పెష‌ల్ ఫ్లైట్‌లు తీసుకుని ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేశారు. ఎలాగైనా మేయ‌ర్ పీఠాన్ని కైవ‌సం చేసుకోవాల‌న్న ఆశతో మా పార్టీ కార్పొరేట‌ర్ల‌పై రౌడీలు గూండాలతో బెదిరింపులకు దిగారు. డీజీపీ నుంచి కానిస్టేబుళ్ల వ‌రకు అధికారాన్ని ఉప‌యోగించారు. అధికార పార్టీ అధ్య‌క్షుల నుంచి కార్య‌క‌ర్త వ‌ర‌కు అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను వాడుకున్నారు. అయినా పార్టీకి అండగా నిలిచిన కార్పొరేట‌ర్ల‌కు మ‌న‌సారా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా. మ‌లేసియాలో ఒక కార్పొరేట‌ర్ మిస్ అయ్యార‌ని తెలియ‌గానే కూట‌మి నాయ‌కుల‌కు చెమటలు పట్టాయి. మేయ‌ర్‌గా బీసీ మ‌హిళ ఉన్నా కూట‌మి పార్టీ నాయ‌కులు ఓర్వ‌లేక‌పోతున్నారు.  

ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేశారు - ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి  

కూట‌మి పాల‌న చూస్తుంటే ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామా? రాజ‌రికంలో ఉన్నామా ? అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ప్ర‌జాస్వామ్యాన్ని, విలువ‌ల‌ను అప‌హాస్యం చేసేలా మేయ‌ర్ అవిశ్వాస తీర్మానం ప్రక్రియ జ‌రిగింది. మా పార్టీ నుంచి గెలిచిన కార్పొరేట‌ర్ల‌ను భ‌య‌పెట్టి, ప్ర‌లోభపెట్టి ఓటేయించుకున్నారు. రాజ‌కీయంగా వాళ్ల‌కు వాళ్లే స‌మాధి క‌ట్టుకున్నారు. అధికారంలోకి వ‌చ్చాక ఎదుట పార్టీ నాయ‌కుల‌ను తీసుకోబోమ‌ని చెప్పి, కేవ‌లం 10 నెల‌ల మేయ‌ర్ పీఠం కోసం మా కార్పొరేటర్ల‌ను పెట్ట‌ని ఇబ్బంది లేదు. ద‌మ్ము ధైర్యం ఉంటే మా పార్టీ నుంచి తీసుకున్న 27 మంది కార్పొరేట‌ర్ల‌తో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తుల మీద గెలిపించి, మేయర్ పదవిని దక్కించుకోవాలి. బీసీ మ‌హిళ‌ను దించిన పార్టీలుగా తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన చ‌రిత్ర‌లో మిగిలిపోతాయి. అధికారంలో ఉన్నా లేక‌పోయినా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వైయస్ఆర్‌సీపీ  పోరాడుతూనే ఉంటుంది. 

కూటమి పార్టీలను ప్ర‌జ‌లు చీద‌రించుకుంటున్నారు: ఎమ్మెల్సీ కుంభా ర‌విబాబు 

చంద్ర‌బాబు జీవితమంతా కుట్ర‌లు కుతంత్రాల మ‌యం. అధికారం కోసం దిగజారిపోవ‌డం, ప్ర‌లోభాలకు గురిచేయ‌డం ఆయ‌న నైజం. మేయ‌ర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేనాటికి గెలుస్తామ‌న్న ధీమా వారిలోనే లేదు. అందుకే నెల‌రోజులు స‌మ‌యం తీసుకుని వారి కుట్ర‌ల‌కు ప‌దును పెట్టారు. అధికారాన్ని విచ్చ‌ల‌విడిగా ప్ర‌యోగించి విజ‌యం సాధించారే కానీ, ప్ర‌జ‌లు మాత్రం కూట‌మి పార్టీల‌ను చీద‌రించుకుంటున్నారు. వైయస్ఆర్‌సీపీ కి అండ‌గా నిలిచి ఓటేసిన కార్పొరేట‌ర్ల‌ను అభినందిస్తున్నా. వారికి పార్టీలో మంచి భ‌విష్యత్తు ఉంటుంది. ఈరోజు కుట్ర‌లు, కుతంత్రాలు, డ‌బ్బు గెలిచింది. ప్ర‌జాస్వామ్యం గెలిచింద‌ని కూట‌మి నాయ‌కులు చెప్పుకోవ‌డం సిగ్గుచేటు. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు వారికి రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లే చ‌క్క‌న గుణ‌పాఠం చెబుతారు. 

పార్టీ ఫిరాయించిన 27 మంది కార్పోరేటర్లను అనర్హులుగా ప్రకటించాలి:మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ విప్ తైనాల విజ‌య్ కుమార్‌ 

రాష్ట్రంలో వైస్రాయ్ హోట‌ల్ రాజ‌కీయాలే నేటికీ న‌డుస్తున్నాయి. విశాఖ ప్ర‌జలంతా  తీవ్ర‌మైన ఇబ్బందుల్లో ఉంటే 10 నెల‌ల మేయ‌ర్ పీఠం కోసం దిగ‌జారి రాజ‌కీయాలు చేశారు. నాలుగేళ్లుగా మేయ‌ర్‌గా నిజాయితీతో ప‌నిచేస్తున్న బీసీ మ‌హిళ‌ను దించ‌డం దారుణం. వైయస్ఆర్‌సీపీ  నుంచి గెలిచిన కార్పొరేట‌ర్లంద‌రికీ విప్ జారీ చేశాం. 27 మంది విప్‌ను ధిక్క‌రించారు. వారిపై ఎన్నిక‌ల అధికారికి ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. ఏడు రోజుల్లో వారిని డిస్‌క్వాలిఫై చేయాల‌ని లేఖ‌లో కోరాం. అధికారులు ప‌ట్టించుకోక‌పోతే న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యిస్తాం.

Back to Top