తాడేపల్లి: చంద్రబాబు అరాచకాలను వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ‘‘చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘‘ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్ పదవి ఏరకంగా వస్తుంది? ..బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది?’’ అంటూ వైయస్ జగన్ ప్రశ్నించారు. ‘‘మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీకాలం పూర్తవుతుందని తెలిసీ, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా, ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబూ.. మీకులేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారు. ఇన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీవైపు, ప్రజలవైపు నీతి, నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబుగారి కుటిల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న మా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్సాప్ చెప్తున్నా’’ అని వైయస్ జగన్ పేర్కొన్నారు.