రాజధాని నిర్మాణ పనుల్లో.. రూ.9,000 కోట్ల ప్రజాధనానికి ’టెండర్’!

సిండికేట్లతో మిలాఖత్‌.. ఒక్క మొబిలైజేషన్‌ అడ్వాన్సుల్లోనే రూ.3,200 కోట్లకుపైగా ముఖ్యనేత జేబులోకి  

రాజధాని టెండర్లు పిలవక ముందే సన్నిహితులకు చెందిన తొమ్మిది కాంట్రాక్టు సంస్థలతో కుమ్మక్కు 

అంచనాల్లోనే వంచన.. కి.మీ. రోడ్డుకు గరిష్టంగా రూ.64.01 కోట్లు, భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు గరిష్టంగా రూ.10,042.86 చొప్పున టెండర్లు 

ఇప్పటికే రూ.40,497.55 కోట్ల పనులు అధిక ధరలకు తొమ్మిది కాంట్రాక్టు సంస్థల పరం.. ఖజానాపై రూ.1,231.42 కోట్లకుపైగా భారం 

జ్యుడీషియల్‌ ప్రివ్యూ–రివర్స్‌ టెండరింగ్‌ విధానం అమలు చేసి ఉంటే  కనీసం రూ.3,500 కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు ఆదా అయ్యేవంటోన్న అధికారవర్గాలు 

పనుల అగ్రిమెంటు విలువలో పది శాతం రూ.4,049.75 కోట్లు మొబిలైజేషన్‌ అడ్వాన్సు కింద కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపు.. అందులో 8 శాతం తిరిగి వసూలు చేసుకున్న ముఖ్యనేత 

అప్పు తెచ్చిన నిధులతో దోపిడీకి పాల్పడుతూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడంపై ఆర్థిక నిపుణుల ఆందోళన 

ఆర్థిక బిడ్‌ దశలో మరో రూ.1,960.36 కోట్ల విలువైన గెజిటెడ్, ఎన్‌జీవోల క్వార్టర్స్‌ పనుల టెండర్లు 

టెండర్ల దశలో రూ.4,688.82 కోట్ల విలువైన సచివాలయం ఐకానిక్‌ టవర్ల పనుల టెండర్లు 

మరో రెండు రహదారుల విస్తరణకు రూ.553.12 కోట్లతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ.. టెండర్ల దశలో ఉన్న పనులూ 
సిండికేట్‌లోని తొమ్మిది సంస్థలకే అప్పగించే దిశగా అడుగులు 

అన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటికే రూ.47,699.85 కోట్ల విలువతో టెండర్లు పిలిచిన సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ 

రాజధాని పనులకు ప్రాథమికంగా రూ.77,249 కోట్లు అవసరమని ఆర్థిక సంఘానికి చెప్పిన సీఎం చంద్రబాబు 

ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.31 వేల కోట్లు రుణం సమీకరణ.. ఇంకా రూ.46,249 కోట్ల రుణం సమీకరించాల్సి ఉందని ఆర్థిక సంఘానికి వెల్లడించిన సీఎం

 

అప్పు చేసి పప్పు కూడు తినకూదదంటారు పెద్దలు..! 
ఎందుకంటే చేసిన అప్పును వడ్డీతో కలిపి చెల్లించాలి కాబట్టి..!  
అప్పుగా తెచ్చిన డబ్బులను ఆస్తుల కల్పన కోసం కాకుండా జల్సాలకు ఖర్చు చేస్తే ఇల్లు గుల్లవుతుంది కాబట్టి! 
రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ పెద్దలు రాజధానికి రుణ పాశం బిగిస్తున్నారు!  
అప్పు చేసి మరీ జేబులు నింపుకొంటున్నారు!  
రాజధాని అమరావతి నిర్మాణ పనులే అందుకు నిదర్శనం.  

రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే రూ.31  వేల కోట్లు అప్పులు తెచ్చిన కూటమి సర్కారు  మరో రూ.46,249 కోట్ల రుణం కోసం  ప్రయత్నిస్తోంది. అలా అప్పు తెచ్చిన నిధులతో  చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి సిండికేట్‌ కాంట్రాక్టర్లకు  అధిక ధరలకు కట్టబెడుతోంది. కాంట్రాక్టు  అగ్రిమెంట్‌ విలువలో పది శాతం మొబిలై జేషన్‌ అడ్వాన్సు ముట్టజెప్పి అందులో  8 శాతాన్ని ముఖ్యనేత నాకింత..! అంటూ  వసూలు చేసుకుంటున్నారు. జ్యుడీషియల్‌  ప్రివ్యూ–రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి పాత రేసి..  అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో  కలిసి దోచేస్తూ రాష్ట్రాన్ని  సంక్షోభంలోకి  నెట్టడంపై ఆర్థిక నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధాని పనుల టెండర్లలో ఈ సిండి ‘కేటు’ దందా తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే!! 

అమరావతి: రాజధాని ప్రాంతంలో 2014లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు కాజేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు రాజధాని నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున దోపిడీకి తెర తీశారు. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించక ముందే సన్నిహితులకు చెందిన తొమ్మిది కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేత సిండికేట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.40,497.55 కోట్ల విలువైన 63 ప్యాకేజీల పనులను సిండికేట్‌ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. 

ఆ మేరకు పనులు అప్పగిస్తూ సిండికేట్‌ కాంట్రాక్టర్లతో సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఏడీసీఎల్‌ (అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) అగ్రిమెంట్‌ (ఒప్పందం) చేసుకున్నాయి. ఆ వెంటనే అగ్రిమెంటు విలువలో పది శాతం అంటే రూ.4,049.75 కోట్లను మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ముట్టజెప్పాయి. అందులో ఎనిమిది శాతం అంటే రూ.3,239.80 కోట్లను ముఖ్యనేత వసూలు చేసుకున్నారు!  

అధిక ధరలకు కట్టబెట్టి.. 
రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నుంచి రూ.5 వేల కోట్లు.. వెరసి రూ.31 వేల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెచ్చింది. 

రాజధాని నిర్మాణ పనులకు రూ.77,249 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశామని.. మరో 46,249 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తున్నామని ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు చెప్పారు. అప్పు తెచ్చిన నిధులతో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు. పనుల అంచనాలను భారీగా పెంచేశారు. అధిక ధరలకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానాపై తీవ్ర భారం మోపారు. 

» ప్రస్తుత ఎస్‌ఎస్‌ఆర్‌(స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్స్‌) ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్లకు మించదు. ప్రస్తుత ధరల ప్రకారం మట్టి తవ్వకానికి క్యూబిక్‌ మీటర్‌కు రూ.వంద చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 10 నుంచి 11 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ తవ్వకానికి కి.మీ.కి రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్లకు మించి వ్యయం కాదని రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ రాజధాని వరద ముంపు నివారణ పనుల్లో 0.4 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన నీరుకొండ రిజర్వాయర్‌ నిర్మాణ పనులకు రూ.470.74 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. 

ఆ పనిని రూ.487.41 కోట్లకు(3.54 శాతం అధిక ధరకు) ఎన్‌సీసీ సంస్థకు అప్పగించారు. జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్‌ చేయనున్నారు. అంటే 0.4 టీఎంసీల సామర్థ్యం కలిగిన నీరుకొండ రిజర్వాయర్‌ పనులను రూ.555.41 కోట్లకు కట్టబెట్టినట్లు స్పష్టమవుతోంది. అంచనా వ్యయాన్ని రూ.305.41 కోట్లు పెంచేసినట్లు వెల్లడవుతోంది.  

» దేశంలో ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా) కి.మీ.కి సగటున రూ.20 కోట్ల చొప్పున ఆరు వరుసలతో కూడిన జాతీయ రహదారులను నిర్మిస్తోంది. కానీ అమరావతిలో ఆరు వరుసల రహదారి నిర్మాణ పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. ఈ–13 రహదారిని ఎన్‌హెచ్‌–16 వరకూ పొడిగిస్తూ 7.29 కి.మీ.ల పొడవున ఆరు వరుసలతో నిర్మించడానికి రూ.384.78 కోట్ల అంచనాతో ఏడీసీఎల్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

జీఎస్టీ, సీనరేజీ లాంటి పన్నుల రూపంలో 81.92 కోట్లు రీయింబర్స్‌ చేస్తామని పేర్కొంది. అంటే.. అంచనా వ్యయం రూ.466.7 కోట్లు అన్నమాట. ఈ లెక్కన కి.మీకి 64.01 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణ పనులకు టెండర్‌ పిలిచినట్లు స్పష్టమవుతోంది. జాతీయ రహదారికి కి.మీ.కి అయ్యే వ్యయం కంటే ఈ–13 రహదారి వ్యయం రూ.44.01 కోట్లు అధికంగా పెంచేశారు. 

» భూసమీకరణ కింద రాజధానికి 29,357 మంది రైతులు 34,773.76 ఎకరాల భూమిని ఇచ్చారు. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద ఆ రైతులకు 17 వేల ఎకరాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలి. ల్యాండ్‌ పూలింగ్‌ లేఅవుట్ల అభివృద్ధి పనులకు 18 ప్యాకేజీల కింద రూ.14,887.64 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించింది. కాంట్రాక్టు విలువలో 18 శాతం జీఎస్టీ, 0.45 శాతం సీనరేజీ, 0.1 శాతం న్యాక్‌ పన్నుల రూపంలో రీయింబర్స్‌ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే.. అప్పుడు వాటి వ్యయం రూ.2,761.66 కోట్లు ఇస్తారన్నమాట.  

ఈలెక్కన ల్యాండ్‌ పూలింగ్‌ లేఅవుట్ల అభివృద్ధి పనుల కాంట్రాక్టు విలువ రూ.17,649.3 కోట్లుకు చేరుతుంది. ఈ లెక్కన ఎకరంలో లే అవుట్‌ అభివృద్ధికి రూ.కోటికి పైగా వెచ్చిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించి లేఅవుట్‌ను అభివృద్ధి చేసినా ఎకరానికి రూ.50లక్షల నుంచి రూ.60 లక్షలకు మించదని బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.   

» అత్యాధునిక హంగులతో భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదు. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన రాజధానిలో భవనాల నిర్మాణ వ్యయం తగ్గాలి. కానీ వ్యయాన్ని భారీగా పెంచేసి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులను చదరపు అడుగుకు రూ.10,042.86 చొప్పున అప్పగించడం గమనార్హం. మిగతా భవనాల నిర్మాణ పనుల్లోనూ అదే తీరు.

జ్యుడీషియల్‌ ప్రివ్యూ–రివర్స్‌ టెండరింగ్‌ రద్దు.. 
వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా జ్యుడీషియల్‌ ప్రివ్యూ–రివర్స్‌ టెండరింగ్‌ విధానం వల్ల 2019–24 మధ్య ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేసి రాజధాని పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. 

ఇప్పటిదాకా కాంట్రాక్టర్లకు అధిక ధరలకు రూ.40,497.55 కోట్ల విలువైన పనులు అప్పగించింది. దీనివల్ల ఖజానాపై రూ.1231.42 కోట్ల మేర భారం పడింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా టెండర్లు నిర్వహించి ఉంటే కాంట్రాక్టర్లు పోటీ పడి ఖజానాకు రూ.3,500 నుంచి రూ.4 వేల కోట్ల మేర ఆదా అయ్యే అవకాశం ఉండేదని ఇంజినీరింగ్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  

బీఎస్సార్‌కు రూ.7,298.97 కోట్లు.. ఆర్వీఆర్‌కు రూ.6,031.79 కోట్ల పనులు
రాజధాని పనుల టెండర్లలో సిండికేట్‌ కాంట్రాక్టు సంస్థలు మినహా ఇతరులు బిడ్లు దాఖలు చేస్తే టెక్నికల్‌ బిడ్‌లోనే ఆ సంస్థపై అనర్హత వేటు వేస్తున్నారు.  
»  సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌కు జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నులతో కాకుండా రూ.7,298.97 కోట్ల విలువైన పనులు ఇప్పటికే అప్పగించారు. 
» సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కృష్ణారెడ్డికి చెందిన మేఘా సంస్థకు జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నులతో కాకుండా రూ.7,022.38 కోట్ల విలువైన పనులను అప్పగించేశారు. 
» టీడీపీకి బాకా ఊదే ఈనాడు కిరణ్‌ సోదరుడు వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.6,031.79 కోట్లు విలువైన పనులు కట్టబెట్టారు. 
» ఎన్‌సీసీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏవీ రంగరాజు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆ సంస్థకు శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం సహా రూ.6,910.93 కోట్ల విలువైన పనులు అప్పగించారు. 
» ఎల్‌ అండ్‌ టీ సంస్థకు శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణంతోపాటు రూ.1,427.21 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. 
» నారా లోకేశ్‌ తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్‌కు అత్యంత సన్నిహితుడు ఎం.వెంకట్రావు. ఆయనకు చెందిన ఎంవీఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థకు రూ.796.04 కోట్ల విలువైన పనులు అప్పగించారు.  
» చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన బీఎస్‌సీపీఎల్‌ సంస్థకు రూ.779.82 కోట్ల విలువైన పనులు అప్పగించారు. 
» సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు ఆప్తుడైన కనకమేడల వరప్రసాద్‌కు చెందిన కేఎంవీ ప్రాజెక్ట్స్‌కు రూ.429.23 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. 
» జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడిన పీవీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌–కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థకు రూ.309.6 కోట్ల విలువైన పనులు అప్పగించారు.  

మరో రూ.7,202.3 కోట్ల పనులూ సిండికేట్‌కే.. 
గెజిటెడ్‌ అధికారులు, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల క్వార్టర్స్‌కు సంబంధించి నాలుగు ప్యాకేజీల కింద రూ.1,960.36 కోట్ల అంచనాతో నాలుగు ప్యాకేజీల కింద పిలిచిన టెండర్లు ఆర్థిక బిడ్‌ దశలో ఉన్నాయి. ఈనెల 16న శాశ్వత సచివాలయం నిర్మాణంలో భాగంగా ఐదు ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్‌ టెండర్లు పిలిచింది. ఈ–13, ఈ–15 రహదారుల పొడిగింపు పనులకు రూ.553.12 కోట్లతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

టెండర్ల దశలో ఉన్న ఈ రూ.7,202.3 కోట్ల విలువైన పనులను సిండికేట్‌ కాంట్రాక్టర్లకే కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు. రాజధానికి వరద ముప్పును నివారించేందుకు కొండవీటివాగుపై మరో ఎత్తిపోతల, గ్రావిటీ కెనాల్‌పై మరో నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి.. కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఏడీసీఎల్, సీఆర్‌డీఏ కసరత్తు చేస్తున్నాయి. ఈ పనులు కూడా సిండికేట్‌ కాంట్రాక్టు సంస్థలకే కట్టబెట్టనున్నారనే అభిప్రాయం అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.  

ప్రాథమిక అంచనా వ్యయం రూ.77,249 కోట్లు.. 
రాజధాని పనులకు ప్రాథమిక అంచనా వ్యయం రూ.77,249 కోట్లు అని ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో నుంచి రూ.31 వేల కోట్లు రుణం తెచ్చారు. మరో రూ.46,249 కోట్ల రుణం కోసం ఆర్థిక సంస్థలు, జాతీయ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చదరపు అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున చెల్లించారు. అంటే అంచనా వ్యయం చదరపు అడుగుకు రూ.15,833 పెరిగింది.

తాత్కాలిక సచివాలయం నిర్మాణ వ్యయమే ఈ స్థాయిలో పెరిగితే శాశ్వత నిర్మాణాల వ్యయం ఇంకెంత పెరుగుతుందో ఊహించుకోవచ్చు. కనీసం రూ.లక్ష కోట్ల నుంచి 1.50 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ డబ్బంతా అప్పులు తేవాల్సిందే. అదంతా వడ్డీతో సహా చెల్లించాల్సిందే. ఇలా అప్పు తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలసి దోచుకుంటూ రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారనే ఆందోళన అటు మేధావులు.. ఇటు అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.  

ఇదీ స్థూలంగా నష్టం..!
రాజధాని పనులను అధిక ధరలకు కట్టబెట్టడం వల్ల జానాపై అదనపు భారం: రూ.1,231.42 కోట్లకుపైగా
జ్యుడీషియల్‌ ప్రివ్యూ– రివర్స్‌ టెండరింగ్‌ అమలు చేయకపోవడంతో నష్టం: రూ.4,000 కోట్లు
కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు చెల్లించి 8 శాతం కమీషన్లు వసూళ్లతో అక్రమాలు: రూ.3,200 కోట్లకుపైగా 

Back to Top