నరసరావుపేట: టీటీడీలో గోవుల మరణాలపై కూటమి నేతలు చర్చకు పిలిచి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తారా, ఇదేనా బహిరంగ చర్చ నిర్వహించే తీరు అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గోమాతల మరణాలపై నిజాలను అంగీకరించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదని అన్నారు. కళ్ళ ముందే అన్ని ఆధారాలు కనిపిస్తున్నా చంద్రబాబు, లోకేష్‌లు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాతల మరణాలపై బహిరంగంగా చర్చించేందుకు, వాస్తవాలను ఆధారాలతో సహా బయటపెట్టేందుకు వైయస్ఆర్‌సీపీ సిద్దంగా ఉందని, దీనికి కూటమి ప్రభుత్వం సిద్దమా అని సవాల్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమలలో జరుగుతున్న వరుస సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పురాణాల్లో గోవులకు విశిష్ట స్థానం ఉంది. అలాంటి గోవులకు రాష్ట్రంలో రక్షణ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పవిత్రమైన తిరుపతి గోశాలలో నెలకు సగటున 15 గోవులు చనిపోతున్నాయనే ఆవేదనతో వైయస్సార్సీపీ నాయకులు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వాస్తవాలను బహిర్గతం చేశారు. అయితే ప్రభుత్వం కానీ, టీటీడీ కానీ పొరపాట్లను సరిదిద్దుకోకుండా తప్పును కప్పిపుచ్చుకునేందుకు, వాస్తవాలను మరుగున పరిచేందుకు రాజకీయ విమర్శలకు పాల్పడింది. తిరుమలకు సంబంధించిన సున్నితమైన అంశం కాబట్టి బాధ్యతతో వ్యవహరించాల్సిందిపోయి చంద్రబాబు సహా టీడీపీ నాయకులు రాజకీయ విమర్శలు చేయడం హిందూ సమాజాన్ని తీవ్రంగా అవమానించడమే. - గోవుల మరణాలు వాస్తవవేనని అంగీకరించారు గోశాలను సందర్శించి గోవుల మరణానికి గల కారణాలు తెలుసుకోకుండా మాపై ఎదురుదాడికి దిగుతున్నారు. గోవుల మరణాలను భూమన ఫొటో ఆధారాలతో సహా బయటపెట్టాక ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ నారా లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. గోవుల మరణాలపై మేము అబద్ధాలు చెప్పామని చంద్రబాబు పబ్లిక్ మీటింగ్‌లో ప్రకటించారు. కానీ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులే స్వయంగా 40 గోవులు చనియాయని మీడియాతో చెప్పారు. ఈవో 43 ఆవులు చనిపోయాయని చెప్పాడు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు 20 ఆవులు చనిపోయాయని చెబుతూనే, మనుషులు చనిపోవడం లేదా అంటూ ఆవుల మరణాలపై వెగటుపుట్టించే వెకిలి మాటలు మాట్లాడుతున్నాడు. ఒకే ఇంట్లో ఒకే నెలలో వరుస మరణాలు సంభవిస్తుంటే పట్టించుకోరా? అలాంటిది గోవుల వరుస మరణాలపై ఎందుకు సమీక్షించలేదు? దేవుని సన్నిధిలో అపచారాలు జరుగుతుంటే వాటిని ఎలా నిరోధించాలా అని ఆలోచించాలి. టీటీడీ చైర్మన్‌గా రెండు సార్లు చేసిన వ్యక్తిని ఎవరైనా సలహాలు సూచనలు కోరుతారే తప్ప, తప్ప బహిరంగ సవాల్ చేస్తారా? బహిరంగ చర్చను నిర్విఘ్నంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికార పక్షానిది కాదా? బహిరంగ చర్చకి రమ్మని పిలిచి గృహనిర్భందం చేయడం దేనికి సంకేతం? కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తిరుమలలో జరుగుతున్న అరాచకాలపై, తిరుమల అపవిత్రతపై చర్చకు ఇప్పటికీ వైయస్సార్సీపీ సిద్ధంగానే ఉంది. మా తరఫున భూమన కరుణాకర్‌రెడ్డి వస్తారు.. మీరు ఎవర్నయినా పిలుచుకోండి. మీడియాను ఆహ్వానిద్దాం. ప్రతినెలా ఎన్నెన్ని గోవులు మరణించాయో లెక్కలతో సహా గో సంరక్షణశాల మేనేజర్ వెల్లడించాక కూడా తమ తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూడటం కన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? - గోమాత మరణాలపై పవన్ కళ్యాణ్ స్పందన ఏదీ? కాషాయ వస్త్రాలు ధరించి, ఈ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తానంటూ చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు టీటీడీలో గోమాతల మరణాలు కనిపించడం లేదా? దీనిపై కనీసం స్పందించే తీరిక ఆయనకు లేదా? సనాతన ధర్మం అంటే కాషాయ బట్టలు వేసుకుని మైకుల ముందు ఘోషించడం మాత్రమే కాదు. ఆ ధర్మాలను కూడా పాటించాలి. ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడేందుకు పశ్చాత్తాప దీక్షలు చేసే పవన్ కళ్యాణ్ కు గోమాత అంటే భక్తి లేదా? తక్షణం దీనిపై ఆయన స్పందించాలి. హిందూ సమాజానికి సమాధానం చెప్పాలి. - నిత్యం వైయస్ జగన్‌పై దూషణలకే పాలన పరిమితం కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఎంతసేపటికీ వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం, సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయడం, వైయస్ జగన్‌ని బూతులు తిట్టడం, ఆయన మీద కట్టుకథలు అల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడటమేనా పాలన అంటే? ఇంత తలతిక్క ప్రభుత్వాన్ని గడిచిన 40 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు. 11 నెలలు దీనికే సరిపోయింది. ప్రజా సమస్యలపై దృష్టిపెట్టండి. ఎన్నికల హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు మీరు చేసిందేంటి? రైతులు అప్పులపాలై అల్లాడిపోతున్నారు. కంది, మిరప, వరి రైతుల కష్టాలు మీకు కనిపించడం లేదు. జగన్ సీఎంగా ఉండి ఉంటే ఈ పాటికి రైతు భరోసా అందుకునేవారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కావడం లేదు. తల్లికి వందనం ఇవ్వడంలేదు. ఫ్రీ బస్ ఊసే లేదు. మొదటిసంతకం పెట్టిన డీఎస్సీ హామీకి ఇంతవరకు దిక్కులేదు. ఇంకెంతకాలం మాయమాటలతో కాలం వెళ్లదీస్తారు. చిత్తశుద్ధిగా నిజాయితీతో పనిచేయండి. తిరుమల తిరుమతి దేవస్థానం పవిత్రతను కాపాడండి. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. గోవుల మరణాలకు గల కారణాలను చిత్తశుద్ధితో అన్వేషించి, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడండి. దీనిపై కమిటీ వేయాలని డిమాండ్