గుడివాడలో రౌడీ రాజ్యం

మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్‌

కృష్ణా జిల్లా:  గుడివాడలో రౌడీ రాజ్యం న‌డుస్తోంద‌ని మాజీ మంత్రి పేర్ని నాని మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ కాసిం అబూ ఇంటిపై గత అర్ధరాత్రి టీడీపీ రౌడీలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అబూ ఇంటి అద్దాలను టీడీపీ నేతలు పగలగొట్టారు. పార్టీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న ఆ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని.. అబూ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధ్వంసమైన ఫర్నిచర్‌ను ఆయన పరిశీలించారు. టీడీపీకి చెందిన కొందరు తమ ఇంటి వద్ద భయాందోళన సృష్టిస్తున్నారంటూ పేర్ని నాని వద్ద అబూ తల్లి బేగం ఆవేదన వ్యక్తం చేశారు.

అబూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ పేర్ని నాని, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు భరోసా ఇచ్చారు. టీడీపీ నేత కడియాల గణేష్, మరికొందరు అర్ధరాత్రుళ్లు  ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ అబూ ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ నేత ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గుడివాడ డీఎస్పీకి పేర్ని నాని, వైయ‌స్ఆర్‌సీపీనేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోకుంటే, ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామంటూ పేర్ని నాని హెచ్చరించారు.

వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేంగా సమావేశం పెట్టడానికి వీల్లేదని అబూని టీడీపీ నేత కడియాల గణేష్ హెచ్చరించాడు. నా ఆదేశాలు ఖాతరు చేయకుండా మీటింగ్ పెడితే నీ అంతుచూస్తానని బెదిరించాడు. గణేష్ హెచ్చరించినా అబూ మీటింగ్‌కు హాజరయ్యారు. ముస్లింలు సమావేశం పెట్టినందుకు ఓ ఎస్ఐ వచ్చి కమ్యూనిటీ హాల్‌కు తాళం వేశారు. పోలీసు యూనిఫామ్ వేసుకుని కొందరు అధికారులు వ్యవస్థలను దిగజారుస్తున్నారు. ఇలాంటి పోలీసులను జిల్లా ఎస్పీ, డిజిపి అదుపులో పెట్టుకోవాలి

పదిమంది ముస్లింలు కలిసి మీటింగ్ పెట్టుకోకూడదని ఏమైనా చట్టం ఉందా?. ముస్లింలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?. కమ్యూనిటీ హాల్‌కు తాళం వేయడంతో రోడ్డుమీదే ముస్లింలు మీటింగ్ పెట్టుకున్నారు. గత రాత్రి అబూ ఇంటిపై టీడీపీ రౌడీలు దాడి చేశారు. ఐరన్ రాడ్లతో అబూ ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. అబూను చంపేస్తామని టీడీపీ రౌడీలు బెదిరించారు. గుడివాడలో రౌడీ రాజ్యం నడుస్తోంది.. ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశాం. 

Back to Top