ఆ ఇద్దరి గురించీ జనాలు తెగ మాట్లాడేసుకుంటున్నారు. వాదులాడేసుకుంటున్నారు. చివరకు ఓ డెసిషన్ కు వచ్చేస్తున్నారు. ఏమనీ?? ఆ ఇద్దరూ ఒక్కటని. అవును మరి...ఇద్దరూ కలిసి చదువుకోలేదు. కలిసి ఆడుకోలేదు. కనీసం కలిసి ఒకే వీధిలో ఉండలేదు కూడా. ఆ మాటకొస్తే ఇద్దరి వయసుకూ సంబంధం కూడా లేదు. నాయుడు బాబాయ్ అని రాయుడు పిలిస్తే ఏంట్రా అబ్బాయ్ అని పలుకుతాడు. మరెందుకు ఆ ఇద్దరి గురించీ కలిసి, ఆ ఇద్దరినీ కలిపి మాట్లాడుకుంటున్నారు? ఇద్దరి గురించీ వేరు వేరుగా మాట్లాడుకోవచ్చు కదా... ఊహూ కుదరదు. వాడు లేనిదే వీడు లేడు. వీడు లేనిదే వాడు రాడు. ఆ ఇద్దరిదీ ఫెవిక్విక్ బంధం. ఈ బంధం ఇప్పటిది కాదు. ఐదేళ్ల నాటిది. ఏంటీ.... ఐదేళ్లకే అంత డీపు ఫ్రెండ్ షిప్పా...అంటే అంతే మరి... కాపీ నాయుడికి పక్కోళ్లదేదైనా బాగుంటే కొట్టేయడం, కాపీ కొట్టేయడం చిన్నప్పట్నించీ అలవాటు ఉంది. కోతల రాయుడికేమో ఎప్పుడూ తనని తానో సంఘసంస్కర్తనని ఫీలవుతూ ఊగిపోతుండే పేరు తెలియని జబ్బు ఉంది నాయుడు తన పిల్లనిచ్చిన మామ ఇంటిని, పొలాన్నీ కొట్టేసాడు. ఊళ్లో ఎవరైనా మంచి పనిచేస్తే దాని క్రెడిట్ కూడా కొట్టేసేవాడు. అంతా నేనే చేసా. మొత్తం నావల్లే అంటూ ఊళ్లో చెప్పుకు తిరిగేవాడు. నిజమే కాబోలు అనుకునేవారు అమాయకులైన ఊరి జనం. ఇక రాయుడైతే రికార్డింగ్ డాన్సులతో, లేడీ డాన్సర్లతో పండగ పండక్కీ ఊళ్లో వేషాలు వేసేవాడు. ఇదంతా సామాజిక సేవే అని కూడా చెప్పుకు తిరిగేవాడు. ఆ తైతక్కలు, తల తిక్కలూ చూసి ఊళ్లో పిల్లలు చెడిపోతారేమో అని దిగులు పడేవాళ్లు ఊళ్లో పెద్దలు. మొత్తానికి ఈ కాపీ నాయుడు, కోతల రాయుడు ఊరికో తలనొప్పై కూర్చున్నారు. కొన్నాళ్లకు ఈ ఇద్దరికీ స్నేహం కుదిరింది. కుదరడం అంటే దానికదే కుదరలేదు. ఇద్దరూ కలిసి ఇంకొకళ్ల ద్వారా అలా కుదురుకున్నారన్నమాట. నాయుడు ఏం చేసినా ఏం చెప్పినా రైటే నాది పూచీ అన్నాడు రాయడు. రాయడు నాకు అప్తుడు. మిత్రుడు. స్నేహితుడు. చెలికాడు. గొప్పోడు...అని ఇంకా చాలా చాలా చెప్పాడు నాయుడు. అహా ఇదికదా అసలైన మిత్రద్వయం అన్నారు చూసినవాళ్లు. కాదు త్రయం మేం ముగ్గురం అన్నాడు మధ్యవర్తిత్వం కుదిర్చిన పెద్దాయన. ఐదేళ్లలో చాలా మార్పులు జరిగాయి. పెద్దాయన పరాయి వాడైపోయాడు. బాబాయ్ అబ్బాయి తెగ పోట్లాడేసుకుంటున్నారు. వదిలితే కొట్టేసుకునేలా ఉన్నారు అనుకున్నారంతా...పాపం ఏం జరిగిందో ఇద్దరి మధ్యా అని కూడా చర్చికోవడం మొదలెట్టారు. కానీ ఇదంతా క్లీన్ గా అబ్జర్వ్ చేసి, ఎంక్వైరీ చేసిన ఊళ్లో కుర్రాళ్లకి ఓ నిజం తెలిసింది. అసలు నాయుడు రాయుడు గొడవ పడిందే లేదు. అలా నాటకం ఆడారంతే. నాయుడి దొడ్లో ఎద్దుల కోసం రాయుడు తన పొలంలో గడ్డి పెంచుతున్నాడు. రాయుడి పొలంలో గడ్డి కోసుకు రమ్మని నాయుడు తన పాలేళ్లను పంపుతున్నాడు. ఇద్దరి తాలూకా ఎవరు ఎవరికి ఎదురుపడ్డా అభిమానంగా పలకరించుకుంటున్నారు. ఆప్యాయంగా కౌగిలించుకుంటున్నారు. మరెందుకు ఈ గొడవలు, పొట్లాటల ప్రచారం జరిగింది...? ఎందుకంటే నాయుడి భాగోతం, రాయుడి జబ్బు గురించి ఊళ్లో అందరికీ చెప్పిన కుర్రోడున్నాడు. ఇటు ఊళ్లో నాయుళ్లు, రాయళ్లు అందరూ ఆ కుర్రోడు చెప్పే నిజాలు, విని, రుజువులు చూసి ఈ ఇద్దరినీ ఛీ కొట్టడం మొదలెట్టారు. ఇవాళో రేపో పంచాయితీ పెట్టి ఊళ్లోంచి వెళ్లగొట్టేద్దామని కూడా ఆలోచిస్తున్నారు. అది తెలిసే రాయుడు నాయుడూ ఈ డ్రామా మొదలెట్టారు. ఆ ఇళ్లద్దరూ ఎందుకు గొడవపడుతున్నారా అని ఆలోచిస్తూ వాళ్లను వెలి వేయాలన్న ఆలోచన నుంచి ఊరివాళ్లు డైవర్టు అవుతారని ప్లానేసుకున్నారన్నమాట. కానీ పాపం ఆ ప్లాన్ ను కూడా ఆ ఊరి కుర్రాళ్లంతా కలిసి బయటపెట్టేసరికి తేలు కుట్టిన దొంగల్లా ఊళ్లో ముఖం చూపించకుండా తిరగడం మొదలెట్టారు కాపీ నాయుడు, కోతల రాయుడు. పంచాయితీ పెట్టి..... వీళ్ల బండారం బయటపెట్టి.... చీపుళ్లు, చేటలతో తరిమి కొట్టే రోజెప్పుడా అని ఎదురు చూస్తున్నార్ట ఆ ఊళ్లో జనం.