చేసింది చెప్పుకోడానికి ఏమీ లేదు. పోనీ చేసేశాం అని చెబుదామంటే లెక్కలు తీసి సభ ముందే మొహం మీద కొడుతున్నాడు యువ ముఖ్యమంత్రి. మాట్లాడకుండా ఊరుకుందాం అంటే నలభయ్యేళ్ల అనుభవం ఉండనివ్వడం లేదు. ఏదో ఒకటి సమాధానం చెప్పకపోతే తనను మోసే బాజా భజంత్రీలు అయ్యో బాబూ అంటూ హర్ట్ అయిపోతారు. పోనీ గట్టిగా ఎవరిచేతైనా కౌంటర్ ఇప్పిద్దామంటే వెనకాల ఉన్న 22 మందిలో ఒక్కరూ సరైనోళ్లు లేరు. ఇలాంటి పరిస్థితుల మధ్య సభలో సతమతమైపోతున్నాడు బాబు. ప్రజలను మోసం చేసి తాను చేసిన పాపాలను కళ్లారా చూస్తూ చెవులారా వింటూ యాతన పడుతున్నాడు. అలాగని ఊరుకుంటూ చంద్రబాబు ఎందుకవుతాడు. ఏదో ఒకటి మాట్లాడాల. గంభీరంగా ఉన్నట్లు నటించాల. కళ్లు ఉరిమి బెదిరించే ప్రయత్నం చేయాల. అప్పుడప్పుడూ తన అనుభవం గురించి తానే చెప్పుకోవాల. రెండు నెలలు కూడా నిండని ప్రభుత్వం మీద ఏదో ఒక బురద చల్లే ప్రయత్నం చేయాల. శుక్రవారం సభలో అలాంటి ప్రయత్నమే చేశాడు చంద్రబాబు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటూ వైయస్ జగన్ ఇంటిమీదికి జనం తండోపతండాలుగా వస్తున్నారట. ధర్నాలు చేస్తున్నారట. ఆ ధాటి తట్టుకోలేకనే ముఖ్యమంత్రి ఇంటిముందు 144 సెక్షన్ పెట్టారట. ఇదీ బాబుగారి ఎద్దేవా. ఎంత దారుణం, ఎంత అవివేకం, ఎంత బాధ్యాతారాహిత్యం కాకపోతే ఇది అసలు బాబునోటిలోనుంచి రావాల్సిన మాటేనా అని సభలో సొంత పార్టీవాళ్లే చెవులు కొరుక్కున్నారట. ''ఆయన పాదయాత్ర గురించి ఈయనకెందుకు? అది సూపర్ సక్సెస్, అదే కదా అధికారంలోకి తెచ్చింది, మళ్లీ ఎందుకు కెలుక్కుంటున్నాడు. రెండు నెలలైనా కాకముందే ఎవరైనా యాత్రలో హామీల గురించి మాట్లాడతాడా? మనల్నేమే ఓపికపట్టండి, విమర్శించొద్దు అంటాడు. ఈయన మాత్రం తగుదునమ్మా అంటూ నోరు పారేసుకుంటాడు'' అని లాబీల్లో తెలుగుతమ్ముళ్లు తలబాదుకున్నారట. నిజమే మరి..! విడ్డూరం కాకపోతే, హామీలు-వాటిని నెరవేర్చడాల గురించి బాబు మాట్లాడ్డమేంటి సిత్రం. అదీ, మాట తప్పని నాయకుడిగా పేరున్న వైయస్ జగన్ దగ్గర. నాయీ బ్రాహ్మణులు తమకు న్యాయం చేయమంటూ అడగడానికి వస్తే... ''ఎంత ధైర్యం ఉంటే మీరు సెక్రటేరియట్‌కు వస్తారు? తమాషాలు చేస్తున్నారా? అంతు చూస్తా'' అంటూ అధికారంలో ఉండగా బెదిరించిన ఈ మాజీగారు, ఇప్పుడు ప్రజలు... ఆప్రజల పట్ల ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు గురించి చెప్పడం గురివింద గింజ చంద్రమే కదా!. జనంలో జనంతో మమేకమై పదేళ్లు ప్రజలే జీవితంగా బతికిన నాయకుడిని, ఆ ప్రజలకు భయపడి పోలీసుల్ని పెట్టుకున్నావని ఎద్దేవా చేయడం ఎంత అవివేకం. ఇది విన్నవాళ్లు ఎవరైనా అది నోరా..? నారా? అని అనుకోకుండా ఉండగలరా? ఏవైనా సరే.. బాబు రోజు రోజుకీ తన అనుభవానికి తానే మసిపూసుకుంటూ వస్తున్నాడు.