కాదేదీ బాబు ప్రచారానికి అనర్హం

కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నాడు. దాన్ని చంద్రబాబు కాదేదీ నా ప్రచారానికి అనర్హం అని మార్చి వాడేస్తున్నాడు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల దేనిమీదైనా కవిత రాసేయండి అని ఆ విప్లవ కవి చెబితే, ఊరి గోడలు, ఇంటి తలుపులు, కరెంటు బిల్లులు, కాళ్ల కింద చెప్పులూ అన్నిటినీ ప్రచారంలో వాడేయండి అంటోంది బాబు ప్రభుత్వం. 
ఎక్కడ చూసినా ఆయనే కనపడాలని...
ప్రచార పిచ్చి అని చంద్రబాబును ఎవ్వరు ఎంత విమర్శించినా అంతకంతకూ ఆ పిచ్చి ముదిరిపోతోంది తప్ప తగ్గే సూచనలేం కనిపించడంలేదు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో తన గురించి, పార్టీ గురించి ప్రచారం చేసుకోవడానికి బాబు తొక్కని దారిలేదు. ఎక్కని నిచ్చెనలేదు. తాజాగా కరెంటు బిల్లుల పై చంద్రబాబు తమ ప్రభుత్వం అందించే పథకం గురించి ముద్రించి ఇంటింటికీ అందిస్తున్నాడు. ప్రచారం కోసం పవర్ బిల్లును కూడా వదలకుండా వాడుతున్న చంద్రబాబును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కరెంటు బిల్లులను కరపత్రాలుగా మార్చి టిడిపి పథకాల గురించి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు కాదా అని మండి పడుతున్నారు.
ప్రచార ఆర్భాటం 
చౌకడిపోలో పండగలకు పబ్బాలకు అందిస్తున్న నాసిరకం సరుకులను కూడా చంద్రాబు తన ఫొటో ముంద్రించి ఉన్న సంచుల్లో అందించాడు. పథకం ప్రయోజనం నిష్ప్రయోజనమే అయినా ప్రచారానికి మాత్రం ఢోకాలేకుండా చేసుకున్నాడు. ఎపిలో ఏ ఆర్సీసీ బస్సు చూసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ ఇతర టిడిపి నాయకుల ఫొటోలతోనే నిండిపోయి కనిపిస్తున్నాయి. చివరకు ఆర్టీసీ కాంప్లెక్సుల్లోనూ ఏ దిక్కు చూసినా బాబు పోస్టర్లే. ఇక అన్నా కాంటీన్ల కోసం ఊరూరా పెడుతున్న సైన్ బోర్డులకైతే లెక్కేలేదు. పదడుగులకో సైన్ బోర్డు చంద్రబాబు ముఖంతో కనిపిస్తుంటుంది. పట్టెడన్నం పేదలకు పెట్టడంలోనూ లక్షలకు లక్షల అవినీతి జరిగిన అన్న కాంటీన్ల ఖర్చుకు ఈ ప్రచారార్భాటం అదనం అన్నమాట. 
గోడలూ గేట్లూ కూడా వదలకుండా...
ఎన్నికల సమయంలో ప్రచారాల కోసం పబ్లిక్ వాల్స్ ను ఉపయోగించుకోవడం పరిపాటే. కానీ చంద్రబాబు గారి దూర దురాలోచనల్లో ఈ పబ్లిక్ ప్రాపర్టీలను కూడా పచ్చప్రచారానికి వాడేయాలనే బుద్ధి పుట్టింది. గ్రామాల్లో తమ అభివృద్ధి పనుల గురించి గోడలపై రాయాలంటూ కొత్త ఆర్డరు జారీచేసాడు. అభివృద్ధి చేస్తే అది ప్రాంతానికీ, ప్రజలకు తెలుస్తుంది. గోడలపై రాతలు రాస్తేనే తెలిసే అభివృద్ధి గోడలకు తప్ప ప్రజలకు తెలియదని అర్థం. రెండు రోజుల క్రితం కూడా పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతున్నట్టుఉన్న ప్రచార పోస్టర్లను అందించారు. ప్రతిపొదుపు మహిళా ఇంటి తలుపులకు వీటిని అంటించుకోవాలంటూ ఆజ్ఞలు జారీ చేసారు. తుఫాను బాధితులకు సహాయం చేసేటప్పుడుకూడా చంద్రబాబు ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్నిచూసి బాధితులు ఆగ్రహం వ్యక్తం చేసినా ముఖ్యమంత్రి తీరు మారనే లేదు. 
అరువు సన్మానాలు  అద్దె అభిషేకాలు
ముఖ్యమంత్రి కీర్తి కండూతి ఏ స్థాయిలో ఉందంటే వివిధ ప్రభుత్వ శాఖలతో తన పనితీరును, పనులను, తననూ పొగిడించుకుంటూ సన్మానాలు చేయించుకునే దాకా చేరింది. ఆశా వర్కర్లు, యానిమేటర్లు, ఆరోగ్యశ్రీ సిబ్బంది ఇలా చిరు ఉద్యోగులకు చిల్లరగా జీతాలు పెంచిన చంద్రబాబు, వారితో బలవంతపు సన్మానాలు చేయించుకుంటున్నాడు. ధన్యవాదాల సభలు పెట్టించుకుంటున్నాడు. చివరకు తన ఫొటోలు పంచి పెట్టి మరీ వారితో పాలాభిషేకాలు చేయించుకుంటున్నాడు. వారందరినీ రాజధానికి రప్పించి, సభలు పెట్టి మరీ పొగిడించుకుంటున్నాడు. ఇందుకోసం అయ్యే ఖర్చుకోసం ప్రభుత్వ ఖజానాకే చిల్లు పెడుతున్నాడు. ప్రభుత్వమే డబ్బిచ్చి మరీ సన్మానాలు, సత్కారాలు చేయించుకోవడాన్ని చూసి సదరు ఉద్యోగులు చంద్రబాబును ఛీత్కరించుకుంటున్నారు. 
శృతిమించుతున్న ప్రచార యావ
చంద్రబాబు ప్రచార యావ పోను పోనూ ఎంతదాకా వెళుతుందో అని భయపడుతున్నారు ఎపి అధికారులు. త్వరలో చంద్రబాబు ఫొటో ప్రింట్ చేసిన షర్టులు వేసుకోవాలని జీవో జారీచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకుంటున్నారు రాష్ట్రంలోని ఉద్యోగులు. 

 
Back to Top